తిరుపతి ఉప ఎన్నికల వేళ.. అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించి, ప్రచార పర్వం మొదలు పెట్టి హడావిడి చేశారు చంద్రబాబు. ఒక రకంగా బాబు హడావిడి చూసి అధికార పక్షం కూడా ఓ దశలో అయోమయంలో పడింది.
టికెట్ విషయంలో జగన్ ఎంతకీ తేల్చకపోయేసరికి బాబు వ్యూహం వల్ల తమకు నష్టం జరుగుతుందేమోనన్న భయం కూడా కొంతమందికి పట్టుకుంది. అయితే జనబలం జగన్ కే ఉండటంతో ఓ సామాన్య డాక్టర్ కాస్తా ఎంపీ అయ్యారు, ఢిల్లీ వెళ్లారు.
కట్ చేస్తే ఇప్పుడు అదే తిరుపతి ఉప ఎన్నికల ఫార్ములాని రాబోయే సార్వత్రిక ఎన్నికల విషయంలో కూడా ఉపయోగించాలనుకుంటున్నారు చంద్రబాబు. ఎన్నికలకు కనీసం ఏడాది ముందుగానే నియోజకవర్గాలన్నింటికీ టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించి, శ్రేణుల్లో ఉత్సాహం నింపాలనుకుంటున్నారట. 30-35 నియోజకవర్గాల్ని మినహాయిస్తే.. మిగతా అన్ని సెగ్మెంట్లలో ఏడాది ముందే అభ్యర్థుల్ని ప్రకటించాలనేది బాబు ఆలోచన.
బాబుకు ఎందుకీ తొందర..
2019 ఎన్నికల్లో ఘోర ఓటమితో ఇప్పటికే క్యాడర్ చేజారిపోయింది. స్థానిక ఎన్నికల్లో కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా కరువయ్యారు. మిగతావాళ్లు కూడా చేజారిపోకుండా ఉండాలంటే ఇలా ఏడాది ముందు అభ్యర్థుల్ని ప్రకటించాలి అనుకుంటున్నారు చంద్రబాబు.
ఏడాది ముందు నుంచే అభ్యర్థి ఎవరనేది స్పష్టత ఇస్తే, వాళ్లంతా చురుగ్గా పనిచేస్తారనేది బాబు ఆలోచన. ముందే అభ్యర్థిని డిక్లేర్ చేస్తే, సదరు అభ్యర్థి నియోజకవర్గం మొత్తం తిరిగే ఛాన్స్ ఉంది. ఏడాది ముందే అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తే, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి బాగుంటుంది.
ఇంతకుముందు బాబు ఏం చేసేవారు..?
గతంలో బాబు తన అభ్యర్థుల్ని ప్రకటించడానికి అర్థరాత్రి నిర్ణయాలు తీసుకునేవారు. ఆఖరి నిమిషం వరకు అభ్యర్థుల్ని ప్రకటించేవారు కాదు.
నామినేషన్లకు గడువు ముగుస్తుందనగా అర్థరాత్రి వచ్చి అభ్యర్థుల్ని బి-ఫామ్ తీసుకోమనేవారు. చాలామంది అసంతృప్తుల్ని అలాగే వదిలేసేవారు, కనీసం వారిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేసేవారు కాదు.
బాబు కొత్త ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?
తిరుపతి ఉప ఎన్నికల వేళ అందరి కంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించి తానేదో పెద్ద స్కెచ్ వేశానని బిల్డప్ ఇచ్చారు చంద్రబాబు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు కూడా అదే ప్లాన్ వేస్తున్నారు. ఈసారి కూడా అది వర్కవుట్ అయ్యే అకాశాలు చాలా తక్కువే.
ఎందుకంటే, ముందే అభ్యర్థిని ప్రకటిస్తే, టికెట్ ఆశించిన మరో వర్గం ఏడాదికి ముందే టీడీపీకి దూరమవుతుంది. బాబుకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే టీడీపీ టికెట్ పై పోటీ చేయడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించకపోవడం.
కాంపిటీషన్ లేదు కాబట్టి, పెద్దగా ఇబ్బంది లేకుండానే చంద్రబాబు టికెట్ల పంపిణీ పూర్తి చేయొచ్చు. అయితే, అలా అభ్యర్థులుగా ప్రకటించే నేతలంతా ఎన్నికల వరకు చంద్రబాబుతో ఉంటారా లేదా అనేది మాత్రం డౌటే.