తెలంగాణ అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా.. ఆ రాష్ట్ర ప్రజల మేలు కోరాల్సిందే. అయితే అనుకోకుండా తెలంగాణ ప్రతిపక్షాల నుంచి ఏపీకి ఊహించని మద్దతు లభిస్తోంది. ఓవైపు జగన్, కేసీఆర్ మధ్య మాటల తూటాలు పేలుతుంటే.. మరోవైపు తెలంగాణ ప్రతిపక్షాలు కూడా కేసీఆర్ నే టార్గెట్ చేయడం విశేషం. అక్కడి ప్రతిపక్షాలన్నీ ఏపీ సీఎం జగన్ నిర్ణయానికి పరోక్షంగా మద్దతు తెలుపుతున్నాయి.
కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత అనుకోకుండా ఏపీ ప్రభుత్వంపై ప్రేమలా మారింది. తెలంగాణ ప్రతిపక్షాలు కృష్ణా నదీ జలాల వాటాలపై పరోక్షంగా ఏపీకి సపోర్ట్ చేస్తున్నాయి. జల జగడంలో తెలంగాణ ప్రభుత్వానికి వారు ఏమాత్రం మద్దతివ్వడం లేదు. కేసీఆర్ కావాలనే వాదన పెంచుతున్నారని, ఆయన మాటల్లో పసలేదని అంటున్నారు బీజేపీ నేతలు.
దావత్ లకు వెళ్లిన కేసీఆర్, ఆమాత్రం చర్చలకు వెళ్లలేరా అని ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయాలని బీజేపీ అనకపోవడం విచిత్రం. హుజూరాబాద్ ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ జల వివాదాన్ని పెంచిపోషిస్తున్నారని తీవ్రంగా విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు.
అప్పుడు ఓకే చెప్పి.. ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారా..?
ఏడేళ్ల క్రితం ఏపీతో కృష్ణా నీటివాటాలపై తెలంగాణ ఒప్పందం చేసుకుందని, దాని ప్రకారం 66శాతం ఏపీ, తెలంగాణ 34శాతం నీటిని వాడుకుంటున్నాయని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆ ఒప్పందాన్ని కాదని, ఇప్పుడు కేసీఆర్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. అంటే ఏడేళ్ల పాటు తెలంగాణకు అన్యాయం జరిగినట్టేనా అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ప్రతిపక్షాలు మూకుమ్మడిగా కేసీఆర్ పై నిందలేస్తున్నాయి. కేసీఆర్ ఎన్నికల స్టంట్ గా దీన్ని పేర్కొంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జలవిద్యుత్ ఉత్పత్తికి మద్దతివ్వడంలేదు, అదే సమయంలో ఏపీలోని రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వారు అడ్డు తగలడంలేదు.
రాగా పోగా ఏపీలోని ప్రతిపక్షం టీడీపీ.. ఇక్కడి ప్రభుత్వానికి మద్దతివ్వకపోవడం విశేషం. కనీసం చంద్రబాబు కానీ, ఇతర నేతలు కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మద్దతుగా మాట్లాడలేదు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్ చేయలేదు.