కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి రోజురోజుకూ తగ్గుతోంది. కరోనా సెకెండ్ వేవ్ తాజా లెక్కలు దేశ ప్రజానీకానికి ఎంతో ఊరటనిస్తున్నాయి. మూడు నెలల క్రితం మొదలైన మహమ్మారి రెండో వేవ్… దేశాన్ని అతలాకుతలం చేసింది. ఊపిరాడక జనం తలకిందులయ్యారు. చేతిలో డబ్బున్నా ట్రీట్మెంట్ తీసుకునేందుకు సరైన బెడ్ సౌకర్యం దొరకని దుర్భర స్థితి ఓ పీడకలలా మిగిలిపోయింది.
ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి ఎప్పుడెప్పుడూ పోతుందా అని ఎదురు చూస్తున్న దేశ ప్రజలకు ఆనందం కలిగించే వార్త. సంతోషంతో ఎగిరి గంతేయాలనిపించే సమాచారం.
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 39,796 కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. గత మూడు నెలలో ఇదే అత్యల్ప కేసుల నమోదుగా రికార్డుకెక్కింది. నిన్న 43,071 కేసులు వచ్చాయి. ఒక రోజు తేడాతో ఆ సంఖ్య మరింతగా తగ్గడం విశేషం.
మార్చి 19 తర్వాత ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,85,229కి చేరింది. ఇందులో 2,97,00,430 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 723 మంది కొత్తగా మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,02,728కు చేరుకుంది.