చంద్రబాబు ముఖ్యమంత్రి హోదా కోసం కొందరు తపిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఎవరు పోరాటం చేసినా అభినందించాల్సిందే. ఏపీలో పాలక ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోడీని ఏమీ ప్రశ్నించలేని దుస్థితి.
గతంలో చంద్రబాబైనా, నేడు జగన్ బాబైనా…రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీయలేని వైనం. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి రాష్ట్రానికి ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారనే విమర్శల్లో వాస్తవాలేంటో ఏపీ ప్రజానీకానికి బాగా తెలుసు.
తనకు 25కు 25 ఎంపీ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదాను తీసుకొస్తానని గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పదేపదే నమ్మబలికారు. జగన్ అడిగిన దానికంటే మూడు సీట్లు తక్కువ ఇచ్చారు. కేంద్రంలో మరోసారి మోదీ నేతృత్వంలో సంపూర్ణ మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
ఏపీకి ప్రత్యేక హోదా, విభజిత హామీలను నెరవేర్చడంలో కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తున్నా ప్రశ్నించలేని అసమర్థ నాయకత్వాన్ని మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో నాడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమల్లో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని ప్రతిపక్ష నేతగా జగన్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు.
ముళ్లును ముళ్లుతోనే తీయాలనే తలంపుతో కొందరు మరోసారి ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాలను మరోసారి తెరపైకి తెచ్చి జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరీ ముఖ్యంగా ఈ పోరాటంలో సీపీఐ రామకృష్ణ, ఆ పార్టీకి చెందిన మరో నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, టీడీపీ సీనియర్ నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు , కాంగ్రెస్ నేతలు ఉండడం వల్లే అందరిలో అనుమానాలు కలుగుతున్నాయి. గుంటూరులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో గతంలో ప్రత్యేక హోదాకు, విభజన హామీల అమలుకు తూట్లు పొడిచిన వారే కనిపించడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి అన్యాయం చేసి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా అన్నీ గుర్తుకు రావడం ఏంటనే నిలదీతలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే ఎత్తుగడలో భాగమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేతల పోరాటం సంగతేమో గానీ, ఎలాగైనా చంద్రబాబును సీఎం చేయాలనే ఆరాటం వారిలో కనిపిస్తోంది.