కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి తెలుగు రాష్ట్రాల సమస్యల కంటే, ఇటీవల తమ పార్టీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందరే ముఖ్యమని తేల్చి చెప్పింది. అంతేకాదు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కొట్టుకు చావండి…తమాషా చూస్తామన్నట్టుగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలు చెప్పకనే చెప్పాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి మాట్లాడిన తీరు …తెలుగు రాష్ట్రాల జలవివాదంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని చాటి చెప్పింది. ఒకవైపు కేంద్రానికి రాష్ట్రాలన్నీ సమానమేనని అంటూనే జలవివాదంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు కూచొని చర్చించుకోవడం లేదని ప్రశ్నించడం గమనార్హం.
జలవివాదాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించుకోవాలే తప్ప ప్రజల మనోభావాల్ని దెబ్బతీయొద్దన్నారు. కృష్ణాజలాల విషయంలో తమ చేతగానితనానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
ఇద్దరు సీఎంలు కలిసి ఆస్తుల పంపిణీ, దావత్లు చేసుకున్నప్నుడు నదీజలాల విషయం ఎందుకు చర్చించుకోలేదని కిషన్రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ ఈటలను వేధిస్తోందన్నారు. ఈటల ఒక వ్యక్తి కాదని, ఆయన వెనుక కేంద్ర ప్రభుత్వం, నరేంద్రమోదీ ఉన్నారని కిషన్రెడ్డి చెప్పడం గమనార్హం. అన్యాయంగా వేధిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని కేసీఆర్ సర్కార్ను కిషన్రెడ్డి హెచ్చరించారు.
ఈటల రాజేందర్ విషయంలో మాత్రం ఏకంగా నరేంద్ర మోదీ ఉన్నారని కిషన్రెడ్డి బీజేపీ శ్రేణులకు ఓ భరోసా ఇచ్చారు. ఇదే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసిన కృష్ణా జలాల విషయంలో మాత్రం పరిష్కారానికి ఎలాంటి చొరవ చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది.
రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణా జలాల విషయంలో అనవసర భావోద్వేగాలను రెచ్చగొడితే ఊరుకోమని కిషన్రెడ్డి ఎందుకు హెచ్చరించలేకపోయారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య జల జగడం పెరగాలని కేంద్రంలోని బీజేపీ కోరుకుంటోందని, అదే కిషన్రెడ్డి మాటల్లో ప్రతిబింబించాయనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.