ఎన్టీఆర్ జీవితంలో ప్ర‌ధాన ఘ‌ట్టాన్ని మ‌రిచిన రామోజీ

టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా రామోజీరావు నేతృత్వంలోని ఈనాడు ఆయ‌న‌కు విశేష ప్రాధాన్యం ఇచ్చింది. ఎన్టీఆర్ జీవితంలోని ప్ర‌ధాన ఘ‌ట్టాల‌ను చ‌క్క‌గా ఆవిష్క‌రించింది. 1923, మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్…

టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా రామోజీరావు నేతృత్వంలోని ఈనాడు ఆయ‌న‌కు విశేష ప్రాధాన్యం ఇచ్చింది. ఎన్టీఆర్ జీవితంలోని ప్ర‌ధాన ఘ‌ట్టాల‌ను చ‌క్క‌గా ఆవిష్క‌రించింది. 1923, మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్ జ‌న్మించారు. త‌ల్లిదండ్రులు వెంక‌ట్రావ‌మ్మ‌, ల‌క్ష్మ‌య్య చౌద‌రి. పెద‌నాన్న రామ‌య్య దంప‌తుల‌కు పిల్ల‌లు లేక‌పోవ‌డంతో వారి ద‌గ్గరే ఎన్టీఆర్ పెరగ‌డంతో పాటు ఆయ‌న విద్యాభ్యాసం గురించి వివ‌రాలను “ఈనాడు” తెలియ‌ప‌రిచింది.

ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్‌కు సంబంధించి రాజ‌కీయ‌, సినీ రంగ అనుబంధాల్ని ఆవిష్క‌రించే క్ర‌మంలో ప‌లు ఆస‌క్తిక‌ర ఫొటోల‌ను “ఈనాడు” ప్ర‌చురించింది. చైత‌న్య‌ర‌థం పైనుంచి ప్ర‌సంగిస్తున్న ఫొటో, అలాగే మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీతోనూ, నాటి విప‌క్ష‌నేత‌లు జ్యోతిబ‌సు, వీపీ సింగ్‌, క‌రుణానిధి, దేవీలాల్ ఎన్టీఆర్ జ్ఞాప‌కాల‌ను పాఠ‌కుల ముందు ఉంచింది.

వెండితెర‌పై శ్రీ‌కృష్ణుడిగా, రాముడిగా, అల్లూరి సీతారామ‌రాజుగా ఇలా అనేక రూపాల్లో ఎన్టీఆర్ క‌నిపించిన తీరును గుర్తు చేసింది. అడ‌విరాముడు సినిమాలో జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌ల‌తో , పాతాళ‌భైర‌విలో ఎస్వీఆర్‌తో ఎన్టీఆర్ స్మృతుల‌ను చ‌క్క‌గా ఈనాడు ప‌త్రిక ఆవిష్క‌రించింది. అలాగే కుమారుల‌తో ఎన్టీఆర్, అసెంబ్లీలో భీష‌ణ ప్ర‌తిజ్ఞ చేసే ఎన్టీఆర్‌, దివిసీమ‌లో ఉప్పెన బాధితుల స‌హాయార్థం జోలెప‌ట్టిన ఎన్టీఆర్‌…ఇలా ఎన్నెన్ని మ‌ధుర జ్ఞాప‌కాలో.

ఎన్టీఆర్ జీవ‌న ప్ర‌స్థానంలోని అనేక ఘ‌ట్టాల‌ను ఆవిష్క‌రించిన రామోజీరావు నేతృత్వంలోని ఈనాడు ప‌త్రిక‌….కీల‌క‌మైన అంశాన్ని మాత్రం విస్మ‌రించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. 1993, సెప్టెంబ‌ర్ రెండోవారంలో ల‌క్ష్మిపార్వ‌తిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. ఇద్ద‌రూ క‌లిసి 1994 ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజం ఎన్టీఆర్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టింది. 1995, ఆగ‌స్టులో ఎన్టీఆర్‌ను సీఎం ప‌ద‌వి నుంచి అల్లుడు చంద్ర‌బాబు నేతృత్వంలో ప‌డ‌గొట్టారు. హైద‌రాబాద్‌లోని వైశ్రాయ్ హోట‌ల్‌లో చంద్ర‌బాబు క్యాంప్ రాజ‌కీయాలు నిర్వ‌హిస్తున్నార‌ని తెలిసి ఎన్టీఆర్‌ వెళ్లారు. అక్క‌డ వాహ‌నంపై ఎన్టీఆర్‌, ల‌క్ష్మిపార్వ‌తి, ప‌రిటాల ర‌వి, దేవినేని నెహ్రూ నిలిచి నిర‌స‌న తెలిపారు.

వారిపై చంద్ర‌బాబు నేతృత్వంలో చెప్పులు, రాళ్ల‌తో దాడి చేయించారు. దీంతో ఎన్టీఆర్‌కు తీవ్ర ప‌రాభ‌వం ఎదురైంది. 1995, ఆగ‌స్టు 23న ఎన్టీఆర్‌ను టీడీపీ నుంచి చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో బ‌హిష్క‌రించారు. మాన‌సిక ఆవేద‌న‌తో ఎన్టీఆర్ ప్రాణాలు కోల్పోయార‌ని ల‌క్ష్మీపార్వ‌తితో పాటు మ‌రికొంద‌రి వాద‌న‌. వీటికి సంబంధించి ఫొటోలు ప్ర‌చురించ‌డానికి ఈనాడు ప‌త్రిక సిగ్గుప‌డిన‌ట్టుంది. 

ఎందుకంటే ఈ కుట్ర‌లో మీడియా ప‌రంగా ఈ కుట్ర‌లో ఈనాడుకు కూడా భాగ‌స్వామ్యం ఉంద‌ని నాడు ఎన్టీఆరే స్వ‌యంగా ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈనాడు ప‌త్రిక‌, చాన‌ల్‌ రాసింది, చెప్పిందే వార్త అనే రోజులు పోయాయి. నిజాల్ని వెలుగులోకి తీసుకొచ్చే  వేదిక‌లు బోలెడున్నాయి.

సొదుం ర‌మ‌ణ‌