ఏడ్చే మగాళ్లను నమ్మొద్దంటారు. నిజమే.. జనాలు నమ్మడం మానేశారని తెలుసుకున్న తర్వాతే చంద్రబాబు ఏడవడం మొదలు పెట్టారు. ఏడ్చిన తర్వాత ఇంకాస్త నమ్మకం పోగొట్టుకున్నారు. పోనీ ఆ తర్వాతేమైనా టీడీపీలోని మగ నాయకులు బదులు తీర్చుకుంటామని అన్నారా అంటే అదీ లేదు. ఆ ఏడుపు ఎపిసోడ్ ని కంటిన్యూ చేస్తూ సింపతీ దక్కుతుందేమోనని చూశారు. కానీ అది వర్కవుట్ కాలేదు.
విచిత్రం ఏంటంటే.. టీడీపీలో మగాళ్లు ఏడుస్తుంటే, ఆడాళ్లు తొడ కొడుతున్నారు. తాజాగా మహానాడు కార్యక్రమంలో మహిళా నాయకురాలు గ్రీష్మ తొడగొట్టడం సంచలనంగా మారింది. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ మహానాడులో తొడగొట్టారు. ప్రసంగం మధ్యలో ఆమె తన ఆవేశాన్ని ఆపుకోలేకపోయారు.
మహానాడు స్టేజ్ పై ఏం జరిగినా అది టీడీపీ అంతర్గత వ్యవహారం అనుకోవచ్చు కానీ, ఆమె జగన్ సతీమణిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేవలం గ్రీష్మ ఒక్కరే కాదు.. ఆ స్థాయిలో రెచ్చిపోయే నాయకులు టీడీపీలో చాలామందే ఉన్నారు. ఫైర్ బ్రాండ్స్ అనే పేర్లు వీరికి సరిపోవు. బూతులు మాట్లాడను అంటూనే.. పక్క పార్టీవాళ్లు ఏం మాట్లాడారనే విషయాన్ని విడమర్చి మరీ చెబుతుంటారు వంగలపూడి అనిత.
అనిత, గ్రీష్మ.. ఈ పేర్లు ఇక్కడితో ఆగవు, ద్వితీయ శ్రేణి నాయకురాళ్లు చాలామంది గుర్తింపు కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు గ్రీష్మ ఏకంగా స్టేజ్ పైనే తొడగొట్టారు కాబట్టి.. ఆమె స్ఫూర్తితో మరింత మంది మహిళా నేతలు గుర్తింపు కోసం ఆ ఫీట్ రిపీట్ చేస్తారేమో చూడాలి.
నందమూరి హీరోలు సినిమాల్లో తొడ కొడుతుంటారు. మేనమామ అలవాటు లోకేష్ కి రాలేదు. పప్పు అనే బ్రాండ్ వేయించుకున్నారు. ఆ అపవాదు తొలగించుకోడానికి ఇటీవల అరేయ్ ఒరేయ్ అంటూ రెచ్చిపోతున్నారు. అయితే ఆయన ప్రగల్భాలు అంతవరకే. ఆ స్థాయికి మించి విమర్శలు చేయడం, చేసినా వాటికి కట్టుబడి ఉండటం లోకేష్ కి చేతకాదు. నిజంగానే లోకేష్ సమర్థుడే అయితే తండ్రి ఏడ్చిన రోజే ఏదో ఒక శపథం చేసి ఉండేవారు.
కానీ టీడీపీలో మగాళ్లకు అంత సీన్ లేదు. వారు ఏడవడానికే పరిమితం, సింపతీ కోసమే వారి తాపత్రయం. అదే సమయంలో మహిళా నేతలు మాత్రం తొడలు కొట్టడంలో రాణిస్తున్నారు. గ్రీష్మతో మొదలైన ఈ ఎపిసోడ్ లోకి ఎంతమంది మహిళా నేతలు వచ్చి చేరుతారో చూడాలి.