స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతికి వచ్చేసింది. ఇది ఎంత వినోదాన్ని అందిస్తుందో అంతే ప్రమాదం కూడా తెచ్చిపెడుతుంది. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా వ్యక్తిగత జీవితమే కాదు, బ్యాంక్ ఎకౌంట్ కూడా గల్లంతవుతుంది. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, అవగాహన లేకపోవడం వల్ల ఎంతోమంది గ్రామీణులు ఇప్పుడు ఆన్ లైన్ మోసాల బారిన పడుతున్నారు. అలాంటిదే ఓ ఘటన చీరాలలోని ఓ మారుమూల గ్రామంలో జరిగింది.
చీరాల దగ్గర్లోని హస్తినాపురానికి చెందిన గణేశ్, చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఉద్యోగ నిమిత్రం చేబ్రోలు వచ్చాడు. నిత్యం సోషల్ మీడియాలో ఉంటాడు. ఓసారి ఇలానే గణేష్ కు, ప్రీతి అనే అమ్మాయి నుంచి ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత కొన్నాళ్లకు టెలిగ్రామ్ లో కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వీడియో కాల్స్ వరకు వెళ్లింది వ్యవహారం.
మరికొన్ని రోజులకు ప్రీతి నుంచి ఓ లింక్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేసుకుంటే మరింత బాగా వీడియోల్లో మాట్లాడుకోవచ్చని ఊరించింది. వెంటనే గణేశ్ ఆ లింక్ క్లిక్ చేశాడు. అడిగిన పర్మిషన్స్ అన్నీ ఇచ్చాడు. ఆ తర్వాత అమ్మాయి తనకు 20 రూపాయలు రీచార్జ్ చేయమని కోరింది. అలానే చేశాడు గణేశ్. అలా రీచార్జ్ చేయడం వల్ల గణేశ్ పాస్ వర్డ్స్, ఎకౌంట్ డీటెయిల్స్ అన్నీ అంతకుముందు ఇనస్టాల్ చేసుకున్న యాప్ లోకి వెళ్లిపోయాయి. ఆ యాప్ ప్రీతి కంట్రోల్ లో ఉంది.
అలా గణేశ్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న ఆ మహిళ.. అతడి ఎకౌంట్ నుంచి ఏకంగా 2 లక్షల 50వేల రూపాయలు కొట్టేసింది. ఉన్నట్టుండి తన ఎకౌంట్ లో డబ్బులన్నీ మాయమవ్వడంతో గణేశ్ లబోదిబోమన్నాడు. వెంటనే పోలీసుల్ని ఆశ్రయించాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, గణేశ్ ఎకౌంట్ నుంచి ఏ ఎకౌంట్ కు డబ్బులు బదిలీ అయ్యాయో తెలుసుకొని ఆ ఎకౌంట్ ను ఫ్రీజ్ చేశారు.