భాజపా..బలుపు కాదు..వాపే?

దుబ్బాక ఉప ఎన్నిక, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నిక కలిసి భారతీయ జనతా పార్టీ ని ఎక్కడికో తీసుకుపోయాయి. ఇంకేం వుంది. పార్టీ నేతల మాటలు కోటలు దాటేసాయి. బస్తీ మే సవాల్ అంటూ రంకెలు…

దుబ్బాక ఉప ఎన్నిక, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నిక కలిసి భారతీయ జనతా పార్టీ ని ఎక్కడికో తీసుకుపోయాయి. ఇంకేం వుంది. పార్టీ నేతల మాటలు కోటలు దాటేసాయి. బస్తీ మే సవాల్ అంటూ రంకెలు వేసేలా చేసాయి. తెలంగాణ నేతలు కూడా సరిహద్దులు దాటి ఆంధ్ర మీద కూడా కామెంట్లు చేసేలా చేసాయి. ఇక తిరుపతి ఎన్నికతో చూపిస్తాం తడాఖా అంటూ కిందా మీదా అయిపోయారు. జనసేన ను కాదని తామే తిరుపతిలో పోటీ చేస్తామని, ప్రతిపక్షంగా ఫస్ట్ ప్లేస్ తమదే అని బీరాలు పోయారు.

కానీ రోజులు ఎక్కువ గడవకుండానే వ్యవహారం అంతా మారిపోయింది ఇప్పుడు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా కలలు కరిగిపోయినట్లే. చదువుకున్న పట్ట భద్రులే భాజపాకు ఓటు వేయకుంటే వ్యవహారం ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. సరే తెలంగాణ వ్యవహారం ఇలా వుంటే ఆంధ్రలో ఇంకోలా వుంది పరిస్థితి. విశాఖ ఉక్కు వ్యవహారం. పెట్రోలు ధరలు కలిసి భాజపాను ఎక్కడికో నొక్కేసాయి. 

ఒక్క భాజపా నాయకుడు మాట్లాడే పరిస్థితి లేదు. విశాఖలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే సో కాల్డ్ భాజపా లీడర్లు ఒక్కరు కూడా మాట్లాడలేదు అడుగు పెట్టలేదు. అక్కడే ఎంపీగా చెసిన పురంధ్రీశ్వరి, హరిబాబు వగైరాలు పని చేసిన దాఖలానే లేదు. పెరుగుతున్న ధరలు, పెట్రోలు రేట్లు, విశాఖ ఉక్కు లాంటి వాటిపై తెలుగుదేశం పార్టీ మాట్లాడడం లేదు. మాట్లాడినా వాటిని కూడా వైకాపా ఖాతాలో వేస్తోంది. కానీ సోషల్ మీడియాలో వ్యవహారం చాలా గట్టిగా వుంది. మోడీ మీద ఇన్నీ అన్నీ సెటైర్లు కావు. దాంతో జనాలకు నిజం తెలుస్తోంది.

ఇలాంటి నేపథ్యంలో భాజపా నాయకుల మౌనమే తమ భాష అన్నట్లు వుండిపోయారు. తిరుపతి బరిలో జనసేన కనుక దిగితే పరిస్థితి వేరు. కానీ తెలుగుదేశం పార్టీతో తెరవెనుక బంధాలు కొనసాగుతూనే వున్నాయి అనే గ్యాసిప్ లు వున్న జనసేన పార్టీ తెలివిగా ఆ బరి నుంచి తప్పుకుంది. భాజపానే పోటీ చేస్తోంది. దీంతో తెలుగునాట సామాజిక బంధాల మీడియాలు కూడా భాజపాను పక్కన పెట్టాయి. 

అంటే ఇప్పుడు లేటెస్ట్ సిట్యువేషన్ ఏమిటంటే తిరుపతిలో భాజపా ప్లేస్ మూడో, నాలుగో, అయిదో అన్నట్లు మారిపోయింది. ఫైట్ మళ్లీ వైకాపా-దేశం మధ్యకే మారిపోయింది. పైగా జనసేన జనాలు భాజపా పై విమర్శలు కురిపిస్తున్నారు. అందువల్ల తిరుపతి బరిలో భాజపాకు ఏ మేరకు పరువు దక్కుతుందన్నది అనుమానమే.  అమిత్ షా లాంటి జాతీయ నాయకులు అడుగు పెట్టకపోతే ఇక పరిస్థితి దారుణంగా వుంటుంది. 

పైగా భాజపాలో సామాజిక బంధాలు వున్న నాయకులు చాలా మంది వున్నారు. వారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవాలనే అనుకుంటున్నారు. అలాంటి వారు మొన్న విశాఖ కార్పొరేషన్ ఎన్నికకు దూరంగా వున్నారు. ఇప్పుడు తిరుపతికీ దూరంగానే వుండే అవకాశం వుంది.  అసలే రాజధాని విషయంలో, విశాఖ ఉక్కు, ఇంకా అనేక విషయాల్లో భాజపా కార్నర్ అవుతోంది. 

ఇవన్నీ చాలక ఇవ్వాళ కాకుంటే ఎన్నికలు దగ్గరకు వచ్చాక అయినా జనసేన విడాకులు ఇస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఇక మళ్లీ ఇప్పట్లో భాజపా ఆంధ్రలో పుంజుకోవడం కష్టం ఏమో?