ఇసుక నుంచి తైలాన్ని తీయడం, మూగవానితో మాట్లాడించడమైనా సాధ్యం కావచ్చు. కానీ చంద్రబాబు అవినీతిపై విచారణ జరపడం అసాధ్యమని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. ఇందులో మరో మాటకే తావులేదు. ప్రజాకోర్టులో చంద్రబాబు పరపతి పాతాళంలోకి పడిపోయినా, అదొక్క చోట తిరుగులేని పట్టు నిలుపుకున్నారు.
చంద్రబాబుపై కేసులు గట్రా జగన్ ప్రభుత్వం ఎన్ని ఫైల్ చేసినా…. ఆయన్ను ఏం చేసుకోలేమని అధికార పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు. అమరావతి భూకుంభకోణానికి సంబంధించి అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి పొంగూరు నారాయణలపై సీఐడీ నమోదు చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అమ్మా చంద్రబాబును విచారించాలనుకుంటున్నారా…. ఆశ దోశ అప్పడం అని టీడీపీ శ్రేణులు వ్యంగ్యంగా చెబుతూ వచ్చాయి. టీడీపీ అన్నదే నిజమైంది.
చివరికి ఏమైంది? విచారణలో దశలోనే ఆగిపోయింది. ఈ మాత్రం సంబడానికి జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే చెడ్డ పేరు మూటకట్టుకోవడం అవసరమా? ఇప్పుడిలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తనపై కేసులేస్తే బాబు ఏం చేస్తారో అందరికీ తెలుసు. గతంలో చంద్రబాబుపై లక్ష్మిపార్వతి వేసిన కేసుల సంగతేంటి? అంతెందుకు ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా వాయిస్ రికార్డ్‌తో పట్టుబడిన చంద్రబాబును ఏం చేశారు? ఎవరూ ఏమీ చేయలేరు. అదేమీ ప్రజాకోర్టు కాదు.
ఎప్పట్లాగే చంద్రబాబుకు కేసు విచారణకు వెళ్లకుండానే సహజంగానే ఊరట లభించింది. ప్రతి మనిషికి ఏదో ఒక ఆశ, ఊరటనిచ్చే ఘటనలే ముందుకు నడిపిస్తాయి. ప్రజాకోర్టులో చంద్రబాబు పని సమాప్తమైందనే అభిప్రాయాలు విస్తృతంగా ప్రచారమవుతున్న వేళ…. ఆయనకు మరో వేదికపై సాంత్వన లేకపోతే ముందుకు సాగేది ఎలా? అందుకే చంద్రబాబుకు నిన్న లభించిన ఊరట ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు.
కానీ ఒక్కటి మాత్రం నిజం. అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబు నిస్సహాయుల భూములను చౌకగా కొన్నారనే వాస్తవం జనాల్లోకి బలంగా వెళ్లింది. కొన్ని వ్యవస్థల్లో తనకున్న పట్టుతో విచారణ జరగకుండా, శిక్ష నుంచి చంద్రబాబు తప్పించుకుం టున్నారనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. ఇదే చంద్రబాబుకు ఎన్నికల క్షేత్రంలో తీవ్ర నష్టం కలిగించే అంశం. రాజకీయంగా ప్రజాకోర్టే అంతిమంగా భవిష్యత్‌ను డిసైడ్ చేస్తుంది. బహుశా జగన్ సర్కార్ ఉద్దేశం కూడా చంద్రబాబుపై దళితులు, అణగారిన వర్గాల్లో వ్యతిరేకత పెంచడానికి సీఐడీ కేసు దోహదపడుతుందని భావించి ఉండొచ్చు.
మరో రాజ్యాంగ వ్యవస్థలతో తనకు అనుకూలంగా తీర్పులు తెప్పించుకుంటున్నారనే అక్కసుతో ప్రజాకోర్టులో న్యాయమూర్తులైన ప్రజలు కఠిన శిక్ష విధిస్తున్నారు. దీనికి సార్వత్రిక ఎన్నికలు మొదలుకుని, నిన్నటి స్థానిక ఎన్నికల ఫలితాల వరకూ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పేదలకు ద్రోహం చేయడం నిజమైతే….శిక్ష తప్పదు. అది ప్రజాకోర్టా? మరొకటా అన్నది అనవసరం. కొన్ని చోట్ల తన మేనేజ్‌మెంట్ స్కిల్స్‌తో ఊరట పొందినా, ప్రజాకోర్టులో మాత్రం బాబు జిమ్మిక్కులకు కాలం చెల్లిందన్నది పచ్చి నిజం. అందుకే బాబుకు కేవలం స్టేల సంతృప్తి మాత్రమే మిగిలింది.
సొదుం రమణ