‘‘కేసబ్లాంకా’’ సినిమా హీరో, హీరోయిన్‌ల ప్రేమకథలు (ఎవరివి వారివే) చెప్పబోతున్నాను. చివర్లో చిత్రవిశేషాలు కూడా. యుద్ధపు సినిమాలన్నిటికీ యీ ఫార్ములా వర్తించదు. ఎందుకంటే వీళ్ల ప్రేమకథలు ఆసక్తికరమైనవి కాబట్టి యీ అనుబంధం. తక్కిన సినిమాలకు ప్రధాన హీరోలు ఒకరిద్దరిని పరిచయం చేస్తాను. ‘‘గన్స్ ఆఫ్ నవరోన్’’ గురించి రాసినప్పుడు గ్రెగరీ పెక్, ఆంథోనీ క్విన్, ‘‘గ్రేట్ ఎస్కేప్’’ గురించి రాసినపుడు రిచర్డ్ ఎటెన్‌బరో, స్టీవ్ మెక్వీన్.. యిలా అన్నమాట. ఇప్పుడీ ‘‘కేసబ్లాంకా’’ హీరోయిన్ ఇంగ్రిడ్ బెర్గ్‌మన్ సుందరాంగి. హుందాగా వుంటూ, చక్కటి నటన ప్రదర్శిస్తుంది. స్వీడన్‌కు చెందిన ప్రఖ్యాత దర్శకుడు ఇంగ్మార్ బెర్గ్‌మన్‌తో కన్‌ఫ్యూజ్ కావద్దు. స్పెల్లింగ్‌లో ఇద్దరికీ ఆఖరి మూడు అక్షరాలే తేడా. ఇంగ్మార్ తీసిన ‘‘వైల్డ్ స్ట్రాబెరీస్’’ చూస్తే మీకు సత్యజిత్ రాయ్, ఉత్తమ్ కుమార్‌తో తీసిన ‘‘నాయక్’’ గుర్తుకు రావచ్చు. ఇంగ్మార్ డైరక్షన్‌లో ఇంగ్రిడ్ వేసిన స్వీడిష్ సినిమా ‘‘ఆటమ్ సొనాటా’’ (1978)లో వేసిన పియానిస్టు పాత్రకు ఆస్కార్ నామినేషన్ వచ్చింది.
1915లో స్టాక్‌హోమ్‌లో పుట్టిన ఇంగ్రిడ్‌కు మూడేళ్ల వయసులో తల్లి మరణించడంతో ఎప్పుడూ ఒంటరిగా వుండేది. ఫోటోగ్రాఫరైన తండ్రి ఆమెలో బిడియం పోగొట్టడానికి నాటకాలకు తీసుకెళ్లేవాడు. ఆమె నాటకాలు చూస్తూ ఊహాలోకంలోకి వెళ్లిపోయేది. అయితే 12వ ఏట తండ్రి కాన్సర్‌తో పోయాడు. అతని అక్కగారు చేరదీస్తే ఆవిడా ఆర్నెల్లలో పోయింది. ఇక చివరకు మరో అత్త, ఆమె భర్త తమ పిల్లలతో పాటు యీమెను పెంపకానికి తీసుకున్నారు. వాళ్లు మధ్యతరగతి వాళ్లు కాబట్టి యీమెను కూడా చదివించి, ఏదో ఉద్యోగంలో పెడదామనుకున్నారు. కానీ ఈమె రాయల్ డ్రమెటిక్ ఎకాడమీలో చేరతానని అడగడంతో సరేనన్నారు. అక్కడ చదువుతూనే సెలవుల్లో 1934లో స్వీడిష్ సినిమాల్లో ప్రవేశించి, చిన్న వేషాలు వేస్తే అక్కడా ఆఫర్లు వచ్చాయి. తన ఐదవ సినిమా అమెరికాలో ప్రదర్శింపబడినపుడు ‘‘ఈమెను అర్జంటుగా హాలీవుడ్‌కు తెస్తే మంచిది’’ అని పత్రికలు రాశాయి.
ఈలోగా ఆమెకు పీటర్ లిండ్‌స్టార్మ్ అనే డెంటిస్టు పరిచయమయ్యాడు. విద్యాధికుడు, అందగాడు, సంస్కారి. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈమెకు 21, అతనికి 28 ఏళ్లు. ఒక కూతురు పుట్టింది. ఆమె నటించిన ‘‘ఇంటర్‌మెజ్జో’’ (1936) అనే స్వీడిష్ సినిమాను ఇంగ్లీషులో రీమేక్ చేస్తూ ఆమెనే తీసుకోవడంతో 1940లో ఆమె హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అప్పటికే ఆమెకు ఒక కూతురుంది. స్పెన్సర్ ట్రేసీ సరసన వేసిన ‘‘డా. జెకిల్ అండ్ మిస్టర్ హైడ్’’ (1941)తో ఆమెకు పేరు వచ్చింది. అదే ఏడాది రిలీజైన ‘‘కేసబ్లాంకా’’తో తారాపథానికి ఎగిరిపోయింది. గ్యారీ కూపర్‌తో వేసిన ‘‘ఫర్ హూమ్ ద బెల్ టాల్స్’’ (1943)లో పాత్రకు ఆస్కార్ నామినేషన్ వచ్చింది. ‘‘జోన్ ఆఫ్ ఆర్క్’’ (1948)కు మరోసారి వచ్చింది. మొత్తం నాలుగు నామినేషన్లు. ‘‘గ్యాస్‌లైట్’’ (1944)అనే సైకలాజికల్ థ్రిల్లర్‌లో హీరోయిన్ పాత్రకు ఆస్కార్ వచ్చింది.
ఇంగ్రిడ్‌కు వరుసగా అవకాశాలు రావడంతో, యుద్ధం కమ్ముకుని వస్తున్న యూరోప్ వదిలిపోవడానికి యిదే అదననుకున్న ఆమె భర్త అమెరికాకు తరలి వచ్చేశాడు. డెంటిస్టు నుంచి బ్రెయిన్ సర్జన్ అయి, ఖ్యాతి పొందాడు. అతను స్వతహాగా మంచివాడే కానీ భార్యను పూర్తిగా డామినేట్ చేసేవాడు. ‘ఏమీ తెలియని మొద్దువి నువ్వు’ అనేవాడు. ఆమెను అస్సలు ఖర్చు పెట్టనిచ్చేవాడు కాదు. జీవితంలో ఏ సరదా లేకుండా పోవడంతో డైవోర్స్ తీసుకుందామా అంది. అతను తెల్లబోయి, ‘అలాటిది జరగనివ్వను’ అన్నాడు. బయట ప్రేక్షకులు ఆమెను తారగానే కాక, ఒక హుందాయైన వ్యక్తిగా ఆరాధించారు. ఎక్కడో ఉన్నతస్థానంలో కూర్చోబెట్టారు. వ్యక్తిగతంగా ఆమెకు సంతోషం లేదు. 1948 వచ్చేసరికి ఇన్‌గ్రిడ్‌కు సృజనాత్మకంగా కూడా శూన్యత ఏర్పడింది. హాలీవుడ్ సినిమాలలో పాత్రలు ఆమెకు రొటీన్‌గా అనిపించసాగాయి.
ఆ సమయంలో ఆమె తన భర్తతో కలిసి ‘‘రోమ్-ఓపెన్ సిటీ’’ అనే ఇటాలియన్ సినిమా చూసింది. దానిలో వాస్తవికతకు చకితురాలై పోయింది. అద్భుతమైన సృజనాత్మక ప్రదర్శించిన డైరక్టరు ఎవరా అని చూడబోతే రాబెర్టో రోసెలినీ. పేరే వినలేదు. మరి కొన్ని నెలలకు అతను తీసిన మరో సినిమా ‘పైసాన్’ చూశాక ‘ఈ దర్శకుడైతేనే నాలోని టాలెంటును వెలికి తీయగలడు’ అనుకుని అతని పేర ఒక ఉత్తరం ఇంగ్లీషులో రాసింది. ‘నేను మీ సినిమాలను చూసి ముగ్ధురాలి నయ్యాను. నేను స్వీడిష్ నటిని. ఇంగ్లీషు బాగా మాట్లాడగలను. జర్మన్ కూడా బాగానే వచ్చు. ఫ్రెంచ్ కొద్దిగా అర్థమౌతుంది కానీ మాట్లాడలేను. ఇక ఇటాలియన్ అయితే ‘టి అమో’’ (ఐ లవ్ యూ) అనే వాక్యం ఒక్కటే తెలుసు. మీ డైరక్షన్‌లో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.’ అని రాసి ఎక్కడికి పంపాలో తెలియక దగ్గర పెట్టుకుంది. ఓ సారి ఓ ఇటాలియన్ ఫాన్ ఆటోగ్రాఫ్‌కై వస్తే రోసెలినీ ఎక్కడుంటాడో తెలుసా? అని అడిగింది. ‘రోమ్‌లో మినర్వా స్టూడియోలో నేను పనిచేసే రోజుల్లో ఆయనా చేసేవాడు.’ అని అతను చెప్పి ఆ స్టూడియో అడ్రసు యిచ్చాడు. కానీ ఆ స్టూడియో వారికీ, రోసెలినీకి గొడవలొచ్చి సంబంధాలు తెగిపోయి వున్నాయి.
రోసెలినీ ఇంగ్రిడ్ కంటె 9ఏళ్లు ముందే 1906లో రోమ్‌లో ధనిక కుటుంబంలో పుట్టాడు. వాళ్ల నాన్న ఆర్కిటెక్ట్. రెండు చేతులా సంపాదించి, నాలుగు చేతులా ఖర్చు పెట్టాడు. ఆయన మధ్యవయసులోనే పోయాక ఆయన నలుగురు పిల్లలూ ఎనిమిది చేతుల్తో ఖర్చు పెట్టేసి, త్వరగానే యిల్లు గుల్ల చేసేశారు. రోసెలినీకి అమోఘమైన తెలివితేటలు, అఖండమైన సృజనాత్మకత వున్నాయి. దానితో పాటు మొండితనం, తిక్కా వున్నాయి. తను అనుకున్నది అనుకున్నట్లే జరగాలని పంతం పట్టేవాడు. కోపిష్టి. బాధ్యతారహితంగా ప్రవర్తించేవాడు. పోట్లాడడానికి వెఱచేవాడు కాదు. ఆ పరంపరలోనే స్టూడియోతో చెడి వుంది. ఇంగ్రిడ్ ఉత్తరం చేరే రోజునే స్డూడియో అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. ఈ ఉత్తరం మాత్రం మసిబారినా, కాలిపోలేదు. స్డూడియో ఉద్యోగిని కంట పడితే ఆమె రోసెలినీకి ఫోన్ చేసి చెప్పబోయింది. ఆ ఇంగ్రిడ్ ఎవరో నాకు తెలియదు అంటూ విసుగ్గా ఫోన్ పెట్టేశాడు. అయినా ఆమె ఆ ఉత్తరాన్ని అతని యింటికి పంపింది.
రోసెలినీకి తారలంటే మంట. రోడ్డు మీద పోయేవాళ్లను వెతికి పట్టుకుని, వాస్తవికంగా సినిమాలు తీసేవాడు. పెద్దగా సినిమాలూ చూసేవాడు కాదు. హాలీవుడ్ తారైనా ఇంగ్రిడ్ వేరు వినలేదు. పైగా అతనికి ఇంగ్లీషు ఒక్క ముక్క రాదు. ఎవరి చేతనో చదివించుకుని విషయం తెలుసుకున్నాడు. ఇంతలో అతనికి ఓ సంగతి గుర్తు వచ్చింది. ఓ సారి బాంబింగ్ నుంచి తప్పించుకోవడానికి ఓ సినిమా హాల్లో దూరి, బాంబులాగేవరకూ ఆ సినిమాను మూడు సార్లు చూడవలసి వచ్చింది. అది ఇంగ్రిడ్ నటించిన ‘‘ఇంటర్‌మెజ్జో’’ స్వీడిష్ సినిమా. అనుకోకుండా చూసిన ఆ సినిమాలోని తారే రాసిందని గ్రహించి, ‘నేనొక విషాదాంతమైన వాస్తవిక చిత్రం తీద్దామనుకుంటున్నాను. హీరోయిన్ రష్యా సరిహద్దుల్లో వున్న లాట్వియా దేశం నుంచి వచ్చిన యుద్ధ శరణార్థి. ఇటలీలో అగ్నిపర్వతం కింద వుండే స్ట్రోంబొలి అనే వూళ్లో వున్న ఒక పేదవాడు, మొరటు మనిషి ఐన హీరోని పెళ్లాడి అష్టకష్టాలు పడుతుంది. కథ విషాదాంతం. ఈ థీమ్ నచ్చితే మీరు వచ్చి కలవవచ్చు.’ అని ఉత్తరం రాయించాడు.
1948 మధ్యలో ఇంగ్రిడ్ తన భర్తతో సహా పారిస్‌లో రోసెలినీని కలిసింది. భర్తకు ఫ్రెంచ్ వచ్చు కాబట్టి దుబాసీగా వున్నాడు. రోసెలినీ చెప్పిన కథ విని అతను పెదవి విరిచాడు కానీ ఇంగ్రిడ్‌కి తెగ నచ్చేసింది.
అదే ఏడాది నవంబరులో ‘‘ఓపెన్ సిటీ’’ సినిమాకు వచ్చిన క్రిటిక్స్ ఎవార్డు తీసుకోవడానికి రోసెలినీ న్యూయార్క్‌కు వచ్చినపుడు వీళ్లు మళ్లీ కలిశారు. ఇంగ్రిడ్ సినిమాకు నిర్మాతను కూడా చూసి పెట్టింది. 1949 మార్చి కల్లా సినిమా షూటింగుకై ఒంటరిగానే రోమ్ వెళ్లింది. స్ట్రోంబొలిలోనే సినిమా షూట్ చేస్తానంటూ అక్కడకు తీసుకెళ్లాడు రోసెలినీ. ఎండ, వేడి, ఉక్క. ఏ సౌకర్యమూ లేదు. మనుష్యుల్లో నాగరికత కూడా కానరాలేదు. అయినా ఇంగ్రిడ్ ఏ ఫిర్యాదూ చేయలేదు. ఒక క్రియేటివ్ జీనియస్ దర్శకత్వంలో చరిత్రలో నిల్చిపోయే కళాత్మకమైన సినిమా చేయబోతున్నానన్న ఉత్సాహంలో యివేమీ పట్టించుకోలేదు.
రోసెలినీ అందగాడు కాకపోయినా ఆడవాళ్లను ఆకర్షించే గుణం ఉధృతంగా వుంది. చాలామందితో తిరిగాడు. ఇంగ్రిడ్ పరిచయమయ్యేనాటికి భార్యతో విడిగా వుంటూ, ఒక ఇటాలియన్ నటితో తిరుగుతున్నాడు. ఇంగ్రిడ్‌తో సాన్నిహిత్యం ఏర్పడ్డాక ఆమెను తన స్పోర్ట్స్ కారులో ఇటలీ అంతా తిప్పాడు. రసహీనమైన ఇంగ్రిడ్ జీవితంలో ఇంద్రధనస్సు మెరిసినట్లయింది. ‘‘గైడ్’’లో వహీదా ‘ఆజ్ ఫిర్ జీనేకీ తమన్నా హై’ పాడుకున్నట్లు పాడుకుని అతనితో తలమునకలా ప్రేమలో పడిపోయింది. జీవితమంటే యిదే అనుకుంది. విడాకులు కోరుతూ భర్తకు అక్కణ్నించే ఉత్తరం రాసింది. అయితే ఆమె భర్త పంతానికి పోయాడు. విడాకులు యివ్వను, ఏం చేస్తావో చేసుకో పో అన్నాడు. ఈమె బతిమాలుతూ ఉత్తరాలు రాసేది. ఈ లోపున రోసెలినీతో శృంగారం కూడా సాగిస్తూండడంతో ప్రకృతి తన పని తను చేసుకుంటూ పోయింది. ఆమె గర్భవతి అయింది. అదే అన్ని యిక్కట్లూ తెచ్చిపెట్టింది.
ఎంతో ఉదారుడైన భర్తను, పదేళ్ల కూతుర్ని, 12 ఏళ్ల కాపురాన్ని వదిలేసి పరదేశంలో ఒక వివాహితుడితో, పైగా ఓ పట్టాన విడాకులు యివ్వడానికి వీలుపడని రోమన్ కాథలిక్‌తో కాపురం చేసి గర్భవతి అవడమా? ఛీ అంటూ హాలీవుడ్ జనాలు మండిపడ్డారు. పొరపాట్లు చేయడానికి ఆస్కారమున్న ఒక సాధారణ మనిషిగా ఆమెను చూడకుండా తామే నైతికపరమైన ఒక ఉన్నతస్థానంపై కూర్చోబెట్టి, ఆ స్థానాన్ని నిలుపుకోలేనందుకు ఆమెకు శిక్ష విధించారు. అప్పట్లో అమెరికాలో ఉధృతంగా వున్న మెక్‌కార్తీయిజం తోడయ్యింది. ఆమెను దుమ్మెత్తి పోశారు. నీచురాలివి, మా విశ్వాసాన్ని వమ్ము చేశావంటూ సినిమాల్లో బుక్ చేయడం మానేశారు. అమెరికాలో అడుగు పెట్టనివ్వమన్నారు. భర్త కూతుర్ని చూడడానికి వీల్లేదన్నాడు. ఆమె చలించలేదు. నా వ్యక్తిగత యిష్టాయిష్టాలు నావి. నా భర్తతో ఎందుకు పడలేదో నాకే తెలుసు అనుకుంది. పబ్లిక్‌గా ఏమీ అనలేదు. రోసెలినీ చేయి విడవలేదు. మెక్సికో చర్చి ద్వారా పెళ్లి చేసుకుంది. యూరోప్‌లో వుంటూ, అక్కడే సినిమాలు వేస్తూ, పిల్లల్ని కంది.
‘‘స్ట్రోంబొలి’’ సినిమా షూటింగు సజావుగా సాగలేదు. రోసెలినీకి క్రమశిక్షణ లేదు. ఈమె తప్ప తక్కినందరికీ నటన కొత్త. నిర్మాణం ఆలస్యమై పోయింది. అక్కడి పరిస్థితులు గడ్డుగా వున్నాయి. మాటిమాటికీ షూటింగు వాయిదా వేసేవాడు. అయినా ఇంగ్రిడ్ ఆ కష్టాలన్నీ యిష్టంగా భరించింది. తీరా చూస్తే ఆ సినిమాను విమర్శకులూ మెచ్చలేదు, ప్రేక్షకులూ మెచ్చలేదు. తర్వాత వాళ్లిద్దరూ కలిసి తీసిన సినిమాలు కూడా ఆడలేదు. కానీ రోసెలినీ విలాసాలు తగ్గలేదు. ఆర్థికపరమైన యిబ్బందులు కూడా వచ్చిపడ్డాయి. ఈ పరిస్థితిలో 1956లో ఓ ఆఫర్ వచ్చింది. పారిస్‌లో ఓ నాటకాన్ని రోసెలినీ డైరక్టు చేసేట్లు, ఇంగ్రిడ్ నటించేట్లు ఒప్పందం కుదిరింది.
ఆ చర్చలకు వెళ్లినప్పుడే ఎనటోల్ లిట్వాక్ అనే డైరక్టర్ యూల్ బ్రిన్నర్ సరసన ‘‘అనస్టాసియా’’ (1956)లో రష్యన్ జార్ కూతురి పాత్ర వేయమని ఆఫర్ చేశాడు. ఇంగ్లండ్‌లో షూటింగన్నాడు. ఇంగ్రిడ్ సరేనన్నా, రోసెలినీ వద్దన్నాడు. కానీ ఇంగ్రిడ్ ముందుకు వెళ్లడంతో కోపంతో, పొజెసివ్‌నెస్‌తో నాటకం ఆఫర్ కూడా వదులుకున్నాడు. ఆ సినిమా తయారై అమెరికాలో కూడా రిలీజైంది. అప్పటికి ఆమెపై ఆగ్రహం చల్లారిన అమెరికన్లు ఆ సినిమాను ఆదరించడమే కాక, ఆస్కార్ అవార్డు కూడా యిచ్చారు. అయినా ఆమె ఒక పట్టాన హాలీవుడ్‌కు తిరిగి రాలేదు. రోసెలినీ, ఇంగ్రిడ్‌ల మధ్య పొరపొచ్చాలు ప్రారంభమయ్యాయి. అతను ఒక లేడీ ప్రొడ్యూసర్‌తో వ్యవహారం ప్రారంభించాడు.
ఇంతలో ఇండియాపై డాక్యుమెంటరీ తీయమని రోసెలినీకి ఆఫర్ వచ్చింది. అక్కడకు వెళ్లి డాక్యుమెంటరీ తీయడంతో పాటు, స్క్రీన్ రైటర్ అయిన సోనాలీ దాస్‌గుప్తాతో ప్రేమలో పడ్డాడు. ఆమె బిమల్ రాయ్ (‘‘మధుమతి’’, ‘‘దేవదాస్’’, ‘‘బందిని’’, ‘‘సుజాత’’, ‘‘దో బిఘా జమీన్’’ వగైరాల దర్శకనిర్మాత) భార్య చెల్లెలు. వయసు 27. వివాహిత. ఇద్దరు కొడుకులు. ఒక కొడుకుని తీసుకుని తన కంటె 24 ఏళ్లు పెద్దవాడైన యితనితో దేశం విడిచి పారిపోయింది. అతనామెను పెళ్లి చేసుకున్నాడు. 1977లో చనిపోయేవరకు కలిసే వున్నారు.
దీనితో ఇంగ్రిడ్ రోసెలినీని పూర్తిగా వదిలిపెట్టేసి 1958లో ఒక స్వీడిష్ నిర్మాతను పెళ్లి చేసుకుంది. 1975లో వాళ్లు విడిపోయారు. ఆమె యూరోప్‌లోనే వుంటూ సినిమాల్లోనే వేస్తూ పోయింది. వాటిల్లో ఆంథోనీ క్విన్‌తో వేసిన ‘‘ద విజిట్(1964)’’ (‘‘పండంటి కాపురం’’లో జమున పాత్రకు స్ఫూర్తినిచ్చిన పాత్ర) ఎన్నదగినది. చివరకు ‘‘కాక్టస్ ఫ్లవర్’’ (1969)తో హాలీవుడ్‌కు తిరిగి వచ్చింది. ఆ తర్వాత వేసిన ‘‘మర్డర్ ఆన్ ద ఓరియంట్ ఎక్స్‌ప్రెస్’’ (1974)లో స్వీడిష్ మతప్రచారకురాలి పాత్రకు మూడో ఆస్కార్ వచ్చింది. ఇంగ్రిడ్ వేసిన యితర సినిమాల్లో చూడదగినవి – గ్రెగరీ పెక్‌తో వేసిన ‘‘స్పెల్‌బౌండ్’’ (1945), క్యారీ గ్రాంట్‌తో వేసిన ‘‘నొటోరియస్’’ (1946) – యీ రెండూ హిచ్‌కాక్ సినిమాలు. ఇజ్రాయిలీ ప్రధాని గోల్డా మియర్‌పై 1982లో తీసిన టీవీ సీరీస్‌లో గోల్డాగా నటించింది. ఆమె కూతుళ్లలో ఒకరు టీవీ పర్శనాలిటీ, మరొకరు (ఇసబెల్లా రోసిలీనీ) నటి. 1982లో కాన్సర్‌తో మరణించింది. (ఫోటో – రోసెలినీ, ఇన్‌గ్రిడ్‌తో, రెండో ఫోటోలో సోనాలీతో)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2021)