ఎమ్బీయస్‌ – పవనమా? ఋతుపవనమా?

పవనం ఎప్పుడూ ఏడాది పొడుగునా వుండేది, ఋతుపవనం సీజనల్‌, చుట్టపుచూపుగా వచ్చి కొన్నాళ్లు ఉండి వెళ్లిపోతుంది. పవర్‌ స్టార్‌ రాజకీయాలలో పవన విద్యుత్‌ ప్రభావం చూపాలంటే గాలిమరలు నిరంతరం ఆడుతూ ఉండాలి. ఆడతాయా అనేదే…

పవనం ఎప్పుడూ ఏడాది పొడుగునా వుండేది, ఋతుపవనం సీజనల్‌, చుట్టపుచూపుగా వచ్చి కొన్నాళ్లు ఉండి వెళ్లిపోతుంది. పవర్‌ స్టార్‌ రాజకీయాలలో పవన విద్యుత్‌ ప్రభావం చూపాలంటే గాలిమరలు నిరంతరం ఆడుతూ ఉండాలి. ఆడతాయా అనేదే ప్రశ్న. ఫలితాలు వెలువడగానే 'ఓటమి పాలైనా తుది శ్వాస దాకా రాజకీయాల్లోనే ఉంటాను. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతూనే ఉంటాను.' అని పవన్‌ ప్రకటించారు. ఇలాటివి చాలామంది చేయగా చూశాం కాబట్టి చటుక్కున నమ్మడం కష్టం. ఎందుకంటే ఫలాఫలాలు వెల్లడి కాని యుద్ధానికి అనుచరులను సిద్ధం చేయడం ఒక ఎత్తయితే, యుద్ధానంతరం ఓటమితో కృంగిపోయిన క్యాడర్‌ను ఉత్తేజ పరచడం రెండు ఎత్తులు.

నిజం చెప్పాలంటే జనసేన అనుకున్న దాని కంటె ఘోరంగా ఓడిపోయింది. కనీసం 4-5 వస్తాయని యితరులు, 15-20 వస్తాయని పార్టీ వాళ్లు అనుకున్నారు. టిడిపి పరిస్థితి అంత బాగా లేదు కాబట్టి, వైసిపి పెద్ద పార్టీగా అవతరించినా, ప్రభుత్వం ఏర్పాటు చేయలేక సతమతమవుతుందని, అప్పుడు టిడిపితో కలిసి తాము సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని ఆశలు కన్నారు. తీరా చూస్తే అధ్యక్షుడే రెండు చోట్లా ఓడిపోయారు (ఒకచోట రెండో స్థానం, మరో చోట మూడో స్థానం). 130 కి మించి అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తే పార్టీకి పట్టుందనుకున్న గోదావరి జిల్లాలలో ఒకే ఒక్క సీటు – రాజోలు మాత్రం గెలిచారు. తక్కిన చోట్ల అన్నిటా ఓటమే. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ అధ్యక్షుడు తన నియోజకవర్గంలో రెండో స్థానంలో నిలిచాడు. విశాఖ జిల్లా గాజువాకలో అయితే బొత్తిగా తృతీయస్థానం.

ఇక పార్టీ అగ్రనాయకులు అనదగిన నాదెండ్ల మనోహర్‌, తోట చంద్రశేఖర్‌దీ అదే బాటు. పవన్‌ సోదరుడు నాగబాబు నరసాపురంలో మూడో స్థానంలో నిలిచారు. 18 పార్లమెంటు స్థానాల్లో  పోటీ చేస్తే ఒక్కటీ గెలవలేదు.ఓ దశలో సిబిఐ లక్ష్మీనారాయణ గెలుస్తారనే ప్రచారం జరిగింది. అది ఉత్తిదే అని ఫలితాలు చెప్పాయి. ఆయనదీ మూడో స్థానమే. 30% స్థానాల్లో డిపాజిట్లే దక్కలేదు. ఐదే ఐదు స్థానాల్లో ప్రభావం చూపింది. మూడు చోట్ల మాత్రమే ద్వితీయ స్థానంలో నిలిచింది. 75 స్థానాల్లో అభ్యర్థులకు 10 వేల ఓట్లు కూడా రాలేదు. కొన్ని చోట్ల 4, 5 స్థానాలు. కొన్ని చోట్ల కాంగ్రెసుకు, నోటాకు వచ్చిన ఓట్ల కంటె తక్కువ వచ్చాయి. ఓ చోట బిజెపితో బరాబరిగా వచ్చాయి. మరో చోట జనసేన అభ్యర్థి కంటె స్వతంత్ర అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి.

ఉన్నదున్నట్లు చెప్పాలంటే పార్టీ ఆవిర్భావ దశలో ప్రజలు తీసుకున్నంత జనసేనను తీసుకున్నంత సీరియస్‌గా పవన్‌ తనను తాను తీసుకోలేదు. ఈ మధ్యే ఓ ఏడాది, ఆర్నెల్లగా జనాల్లో తిరిగాడు. అప్పటిదాకా కాల్‌షీట్‌ ఆర్టిస్టుగానే ఉన్నాడు. రంగంలోకి దిగాక కూడా పార్టీ నిర్మాణంపై శ్రద్ధ పట్టలేదు. బిజెపి వంటి పార్టీలు ఓటర్ల లిస్టులో ప్రతి పేజీకి ఒక వాలంటీరును ఏర్పాటు చేసుకుంటూంటే, యీయన జిల్లా వారీగా, నియోజకవర్గాల వారీగా కమిటీలు కూడా ఏర్పాటు చేయలేదు. నిర్దిష్ట ప్రణాళిక లేదు. తన పార్టీకి మద్దతు సేకరించలేదు. జెపి, ఉండవల్లి, ఐవైఆర్‌ వగైరాలతో కమిటీ వేశాక వారితో పార్టీ సలహా మండలి ఏర్పాటు చేస్తాడనుకుంటే అదీ లేదు.

జనసేనకు ఒక తాత్త్విక భూమిక ఉందని పవన్‌ అనుకుని, మనల్ని కూడా అనుకోమన్నారు. దీర్ఘకాలంలో అది ప్రయోజనాలు కల్పిస్తుందని నమ్మమన్నారు. కానీ జనాలకు అదేమిటో అర్థం కాలేదు. వాళ్లకు ఉచిత విద్యుత్‌లు, ఋణమాఫీలు, నవరత్నాలు వంటివే అర్థమవుతాయి మరి. సామాన్యులను వదిలేయండి, మేధావులకు, ధనికులకు కూడా యీయన తత్త్వమేమిటో బోధపడలేదు. ఒక పారిశ్రామిక వేత్త, ఒక సామాజిక కార్యకర్త, ఒక సాహితీవేత్త… ఎవరూ దరి చేరలేదు. ఈయన వెళ్లి అడిగాడో లేదో తెలియదు. వాళ్లే వస్తారనుకున్నాడనుకున్నాడేమో, రాలేదు. పార్టీ అంటూ పెట్టాక దానికి థింక్‌ ట్యాంక్‌ ఉండాలి, దాని ఆలోచనలను అమలు చేసేందుకు, ప్రజలకు చేర్చేందుకు ఆర్థిక పరిపుష్టి ఉండాలి. దాన్ని సమకూర్చేందుకు ధనికుల మద్దతు ఉండాలి. జనసేనకు యివేమీ లేదు.

గతకాలంలో సభలు, సదస్సులు, సమావేశాల ద్వారా ఒక పార్టీ తన సిద్ధాంతాలను వ్యాప్తి చేసేది. ఈ రోజు వాటికి హాజరయ్యే తీరిక ప్రజలకు లేదు. అందుకే మీడియాకు ప్రాముఖ్యత పెరిగింది. తెల్లవారి లేవగానే పేపరు వచ్చి గుమ్మంలో పడుతుంది. టివి ఆన్‌ చేయగానే అనేక ఛానెల్స్‌ నట్టింట్లోకి వచ్చి హోరెత్తిస్తాయి. చదువు రానివారికి సైతం రాజకీయాలు మప్పుతాయి. ఆలోచనలు రేకెత్తిస్తాయి. నిష్పక్షపాతమైన మీడియా ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. అయితే ప్రస్తుతం అవి ఏదో ఒక ప్రయోజనంతో ఒక్కో పార్టీకి కొమ్ము కాస్తూ పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయి. వాటిని ప్రసార సాధనాలు అనడం కంటె ప్రచార సాధనాలనడం సబబు.

ఇలాటి పరిస్థితుల్లో జనసేన తరఫున ప్రచారం చేయకపోయినా కనీసం కార్యకలాపాలను కవర్‌ చేసే పత్రిక, టీవీ ఛానెల్‌ లేకపోయాయి. గతంలో పవన్‌ వచ్చే గాలి, పోయే గాలిగా ఉంటూ, టిడిపికి అండగా ఉండే రోజుల్లో అతని మీటింగు ఉందంటే టీవీలు పొద్దుటి నుంచీ ఆ సన్నాహాలన్నీ చూపేవారు. ప్రసంగాన్ని లైవ్‌ కవర్‌ చేసేవారు. ఎప్పుడయితే సొంతంగా పోటీలోకి దిగుతానని ప్రకటించారో అప్పణ్నుంచి మీడియా దూరమై పోయింది. కనీసం ఒక ఏడాది ముందు నుంచైనా ఏదో ఒక పత్రికతో, ఒక ఛానెల్‌తో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాల్సి ఉంది. తనకు అండగా వచ్చే పారిశ్రామిక వేత్తలతో వాటిని కొనిపించాల్సింది. పవన్‌ అవేమీ పట్టించుకోలేదు. తన మీటింగులకు వచ్చి కేరింతలు కొట్టే అభిమానులను చూసి, నా వాణి ప్రజలకు చేరిపోతోంది అనుకున్నారు. అంతే కాకుండా సోషల్‌ మీడియాలో తన అభిమానులు చురుగ్గా ఉండడంతో యింకేం కావాలి అనుకున్నారు.

కానీ మధ్యతరగతి వాళ్లు, మధ్యవయస్సు వాళ్లు ఎందరు సోషల్‌ మీడియా చూస్తారు? ఎందరు మీటింగులకు వెళతారు? మామూలు మీటింగయితే వెళ్లవచ్చు కానీ, యిలా పాప్యులర్‌ స్టార్‌ మీటింగుకి వెళ్లాలంటే ఎక్కడ తొక్కిసలాట జరుగుతుందోనన్న భయం. అలాటి ఓటర్లను చేరాలంటే మీడియాయే శరణ్యం. కానీ ఇది పవన్‌ గుర్తించలేదు. ఓటర్లలో యువత కంటె, మధ్య వయస్సు వాళ్లు, మధ్యతరగతి వాళ్లు, పేదలు, తటస్థులు అత్యధికంగా ఉంటారని, వాళ్లను తను చేరటం లేదని గ్రహించలేదు. చివరకు ఓ పేపరు దొరికింది. ఆంధ్రప్రభ! దాని గురించి ఎవర్ని అడిగినా 'మూసేసి చాలా రోజులైంది కదా, ఇంకా వస్తోందా?' అని ఆశ్చర్యపడేవారే! ఇక దొరికిన టీవీ ఛానెల్‌ 99దీ అదే పరిస్థితి. కమ్యూనిస్టుల హయాంలోనే అది మూలపడింది. దాన్ని బయటకు తీసి బూజు దులిపిన విషయం కూడా ఎవరూ గుర్తించలేదు. పైగా అది జనసేన అభ్యర్థుల నుంచి కూడా డబ్బులు తీసుకునే కవరేజి యిచ్చిందట.

ఇలాటి మీడియా మాత్రమే చేతిలో ఉన్న పవన్‌ మెయిన్‌స్ట్రీమ్‌ మీడియాను ఉపయోగించుకోలేదు. పైపెచ్చు తగాదా పెట్టుకున్నాడు. సోషల్‌ మీడియా రాతలు చూసి మురిశాడు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఉద్యమాలు చేయలేదు, ఓ పెద్ద సభ పెట్టడం, అక్కడ తన అభిమానులు సిఎం సిఎం అంటే మురిసిపోవడం. ''కీర్తిశేషులు'' నాటకంలో చెప్పినట్లు ఆ చప్పట్లే మత్తెక్కించాయి, కొంప ముంచాయి. తన అభిమానులను చూసి మొత్తం యువత తన వెంట ఉందనుకున్నాడు. యువతను ఆకర్షించే ఒక నినాదమైనా యివ్వలేదు. నిరుద్యోగం పెద్ద సమస్య. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. రాదని గ్రహించి, నిరాశ పడిన యువతను ఉద్దేశించి 'ఇన్నేళ్ల అనుభవం ఉండి బాబు సాధించినదేముంది? నాకు అనుభవం లేకపోయినా, చిత్తశుద్ధి ఉంది. మీకు  ఫలానా ఫలానా రకంగా ఉపాధి కల్పిస్తా.'' అని గణాంకాలతో సహా వివరిస్తే వాళ్లు నమ్మేవారేమో!

యువతను ఉద్ధేశించి అనే కాదు, ఓటర్లలో ఏ వర్గాన్ని ఉద్దేశించైనా ఒక ఆకర్షణీయమైన నినాదం లేదు, ఒక కార్యాచరణ లేదు, ఎన్నికల సందర్భంగా పబ్లిసిటీ లేదు. అసలు అతని ఆలోచనలో స్పష్టత గోచరించలేదు. ఏదో జనరలైజ్‌డ్‌గా గందరగోళంగా మాట్లాడడం తప్ప స్థానిక సమస్యల గురించి మాట్లాడడం కానీ, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆ నియోజకవర్గంలో యిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందిన విషయాన్ని ఎత్తి చూపడం కానీ ఏమీ చేయలేదు. సమాజంలో మార్పు రావాలి, మార్పు తెస్తా అనేవి ఎప్పణ్నుంచో వింటున్న అరిగిపోయిన పదాలు. ప్రాక్టికల్‌గా మాట్లాడాలి. తను పదవిలోకి వస్తే ఏ వర్గానికి ఏం చేస్తాడో చెప్పాలి.

ఇవన్నీ ప్రజలకు చేరాలంటే మీడియా కొంతమేరకు సాయపడుతుంది. లేనిపక్షంలో కార్యకర్తల ద్వారా అది సాధ్యపడుతుంది. భిన్నతరహా రాజకీయాలు అని చెప్పుకున్నపుడు వాటిని అర్థం చేసుకునేందుకు ప్రజలకు సమయం యివ్వాలి. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థిని కనీసం ఆర్నెల్ల ముందుగానే ప్రకటించి ఉంటే, అతడు కార్యకర్తలను సమకూర్చుకుని ప్రజల్లో తిరిగి జనసేన సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ తన గురించి కూడా ప్రజలకు ఒక అవగాహన ఏర్పడేట్లు చేసుకోగలిగేవాడు. పాత పార్టీల కైతే అభ్యర్థులను ముందుగా ప్రకటించడంలో యిబ్బందులున్నాయి. టిక్కెట్టివ్వనివారు అలిగి అవతలి పార్టీలో చేరతారేమో, అవతలి పార్టీ వారు అదే వర్గానికి చెందినవారిని పోటీగా నిలబడతారేమో.. అనే సందేహాలుంటాయి. కొత్త పార్టీకి, అందునా అప్లికేషన్ల రద్దీ పెద్దగా లేని పార్టీకి అభ్యర్థులను ముందుగా ప్రకటించడంలో యిబ్బందేమిటో పవన్‌కే తెలియాలి. నామినేషన్‌ మర్నాడు వేయాలనగా కూడా యివాళ టిక్కెట్లు యిస్తున్నారు. ఈ గందరగోళంలో కొందరికి బి ఫారమ్‌లు అందక మొత్తం మీద ఎంతమంది జనసేన తరఫున నిలబడ్డారో స్పష్టత లేకుండా పోయింది.

పవన్‌ అభిమానులకు తప్ప వేరెవ్వరికీ జనసేన పెద్ద పార్టీగా కంటికి ఆనలేదు. పవన్‌ జాతీయ మీడియాలో – జాతీయ ఆంగ్ల పత్రికకు కానీ, ఆంగ్ల టీవీ ఛానెల్‌కు కానీ ముఖాముఖీ యింటర్వ్యూ యిచ్చి వుంటే జాతీయ మీడియా అతన్ని ప్రొజెక్టు చేసి ఉండేది. దాని వలన తటస్థులు యింప్రెస్‌ అయి ఉండేవారు. అది జరగలేదు. ఇక తనతో జట్టు కట్టడానికి లెఫ్ట్‌ వాళ్లు మాత్రమే ముందుకు వచ్చారు. కొంతకాలానికి బియస్పీ వచ్చింది. అది కులప్రాతిపదికపై ఏర్పడిన పార్టీ. ఆంధ్రలో ఉప్పూపత్రీ లేని పార్టీ. దళితులు, మైనారిటీలు వైసిపితో ఎప్పణ్నుంచో అంటకాగుతున్నారు. కొత్తగా పరిచయమైన బియస్పీని కన్నెత్తి చూడవలసిన అవసరమేముంది? భాగస్వాముల వలన జనసేనకు కానీ, జనసేన వలన భాగస్వాములకు కానీ ఆవగింజంత ఉపయోగం జరగలేదు.

పవన్‌ ప్రధానమైన లోపం టిడిపిని వ్యతిరేకించక పోవడం! ఎవరైనా నేత అనేవాడు అధికారంలో ఉన్నవారిని తప్పు పడతాడు. ప్రతిపక్షంలో ఉన్నవారిని కాదు. కానీ యితని మార్గమే వేరు. ప్రత్యేక హోదా గురించి ప్రతిపక్షం ఏం చేసింది? అసెంబ్లీకి రాకుండా బాధ్యత ఎగ్గొట్టడమేమిటి? అని ఎంతసేపూ వైసిపినే నిందించారు. ఫలితాలు చూశాకైనా అర్థమై ఉంటుంది. ప్రజలు టిడిపితో విసిగి ఉన్నారు. వైసిపి పట్ల అభిమానంతో ఉన్నారు. ప్రజాహృదయాన్ని పవన్‌ చదవలేదు. జగన్‌ను పదేపదే తిట్టడం చేత, సిఎం కావాలని జగన్‌ కోరిక అంటూ మాటిమాటికీ వెక్కిరించడం చేత ప్రజలకు తను ఎంత దూరమయ్యాడో పవన్‌ గ్రహించలేదు.

సిఎం కావాలని కోరుకోవడం అంత పాపిష్టి ఆలోచనా? సినిమాల్లోకి వచ్చినపుడు జూనియర్‌ ఆర్టిస్టుగా రావాలని ఎవరూ కోరుకోరు కదా. హీరో అవుదామనే వస్తారు. ఆ కోరిక ఉండడం తప్పని ఎలా అంటాం? పోలీసు కానిస్టేబుల్‌ కొడుకు కాకూడదా? అని పవన్‌ అన్నపుడు, ఏ కానిస్టేబుల్‌ కొడుకైనా అని అర్థం కాదు కదా, కనీసం నాగబాబు అని కూడా అర్థం కాదు కదా! తనే కావాలి అనే దాని తాత్పర్యమని అందరికీ తెలుసు. అందువలన జగన్‌కు వ్యతిరేకంగా పవన్‌ అన్న మాటలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. పవన్‌ను జగన్‌కు వ్యతిరేకిగా, బాబుకు అనుకూలుడిగా జనం చూశారు. అందుకే జనసేనను టిడిపి బి టీము అని వైసిపి చేసిన ప్రచారాన్ని నమ్మారు.

నమ్మేట్లుగా టిడిపి కూడా వ్యవహరించింది. పవన్‌ను పన్నెత్తి మాట అనలేదు. రంగంలో ఆ పార్టీ కూడా ఉన్నపుడు దాన్నీ విమర్శించాలి. దానికి ఎందుకు ఓటేయకూడదో చెప్పాలి. కానీ బాబు పవన్‌ను ఏమీ అనకపోగా, తన అనుయాయుల చేత కూడా అనిపించలేదు. పవన్‌ కూడా 'పోనీ కదాని మద్దతిస్తే టిడిపి ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారు' వంటి జనరల్‌ స్టేటుమెంట్స్‌ యిచ్చారు తప్ప, తను అధికారంలోకి వస్తే విచారణ జరిపిస్తాను అని ప్రకటించలేదు. ఎమ్మేల్యేలందరూ దొంగలయినపుడు దొంగల నాయకుడు మంచివాడవుతాడా? వాళ్లపై చర్య తీసుకోనివాడు సహనేరస్తుడు కాడా? కానీ పవన్‌ బాబును ఏమీ అనలేదు. ఒక్క సమావేశంలో మాత్రం బాబు, లోకేశ్‌ గురించి ఆరోపణలు చేశారు తప్ప తర్వాత గప్‌చుప్‌. సాధారణంగా అందరూ ఎన్నికల సమయంలోనే ఆరోపణలు గుప్పిస్తారు. ఆశ్చర్యకరంగా పవన్‌ ఆ సమయంలోనే యీ విషయంలో మౌనదీక్ష పట్టారు.

దీన్ని టిడిపి తనకు అనువుగా మార్చుకుంది. జనసేనకు వేసినా, తమకు వేసినా ఒకటే అనే భావం కలిగించి వాళ్ల ఓటు కూడా తమకే పడేలా స్ట్రాటజీ వర్క్‌ చేసింది. ఇప్పుడు జనసేన వలన తాము ఓడిపోయామని వాదిస్తోంది. టిడిపి అనుకూల మీడియా వాదన ప్రకారం జనసేన కారణంగా 8 లోకసభ, 31 శాసనసభ స్థానాలలో టిడిపి నష్టపోయిందట. ఎందుకంటే అక్కడ వైసిపికి వచ్చిన ఆధిక్యత కంటె జనసేనకు ఎన్నో రెట్ల ఓట్లు ఎక్కువ పడ్డాయట. అంటే జనసేన లేకపోతే ఆ ఓట్లన్నీ తమకే పడేవని టిడిపి భావన. అలా ఎలా చెప్పగలరు? జనసేన లేని పక్షంలో వాళ్లలో కొందరు వైసిపికి కూడా వేసి వుండవచ్చు కదా! ఆ మాట కొస్తే టిడిపికి పడిన ఓట్లలో వైసిపి వ్యతిరేక, జనసేన అనుకూల ఓటు ఉందేమో ఎవరికి తెలుసు? జనసేన మీద అభిమానం ఉన్నా అభ్యర్థులు ఎవరికీ తెలియని కొత్త ముఖాలు కాబట్టి, వారికి బదులు టిడిపికి వేశారేమో!

జనసేనకు అభ్యర్థులెవ్వరూ సరైన వాళ్లు దొరకలేదు. టిడిపి బలంగా ఉంది, వైసిపి కూడా సర్వశక్తులూ సమీకరించుకుని ఊపు మీద ఉంది. వాటిని ఢీకొని మధ్యలో నిలబడాలంటే ఎంత బలమైన అభ్యర్థులుండాలి? రాజకీయాలకు కొత్తయినా వేరే రంగాలలోనైనా నిష్ణాతులై ఉండాలి. అభ్యర్థుల్లో అందరికీ తెలిసున్న పదిమంది పేర్లు చెప్పమంటే తడుముకోవాలి. పైగా దురదృష్టం ఏమిటంటే తనకు కులమత భేదాల లేవని పవన్‌ ప్రకటించినా కాపులు తప్ప వేరెవరూ పార్టీ పట్ల ఆకర్షితులు కాలేదు. ఇతరులు వచ్చినా చాలా తక్కువ మంది, అదీ పలుకుబడి పెద్దగా లేనివారు వచ్చారు. తమ దగ్గరకు వచ్చినవారికే టిక్కెట్లు యిచ్చారు. దాంతో పార్టీకి కాపు పార్టీ ముద్ర పడింది. అలా అనీ కాపులందరూ దాన్ని సొంత పార్టీ అనుకోలేదు. జనాభాలో కాపులు 15% ఉంటారనుకుంటే జనసేనకు వచ్చిన ఓట్లు 6% లోపే! ఈ 6%లో అన్ని కులాలకు చెందిన యువత, యితర కులస్తుల ఓట్లు కూడా ఉంటాయి కదా. అవి తీసేస్తే ఏ 4%కో చేరవచ్చేమో! అంటే 11% మంది కాపులు టిడిపికో, వైసిపికో వేశారన్నమాట.

కాపులు కూడా నమ్మకపోవడానికి కారణమేమిటి? నిజానికి యీ సారి ఆంధ్రలో ఎన్నికలు కమ్మ వ్యతిరేక ఎన్నికలుగా ముద్ర పడ్డాయి. కమ్మ ఆధిక్యత విపరీతమై పోయిందనే భావనతో చాలా కులాలు వాళ్లకు వ్యతిరేకమయ్యాయి. అంతమాత్రం చేత కమ్మలందరూ టిడిపికి వేయలేదు. ఒక లెక్క ప్రకారం 62% మంది మాత్రమే వేశారు. కానీ వాతావరణం మాత్రం కమ్మ-నాన్‌కమ్మ అన్నట్లు తయారైంది. ఇలాటి నేపథ్యంలో కమ్మలను వ్యతిరేకించే ప్రధాన కులం కాపులు టిడిపికి వ్యతిరేకంగా, జనసేనకు అనుకూలంగా వేయాలి. కానీ చూడబోతే కాపులు మూడు వర్గాలుగా చీలి, మూడు పార్టీలకు వేశారనిపిస్తోంది. పవన్‌ ఆ ఓట్లను గంపగుత్తగా ఎందుకు కొల్లగొట్టలేక పోయారు? ఐదేళ్లలో నాలుగేళ్ల పాటు స్తబ్ధంగా ఉండడం చేత, తను ప్రత్యామ్నాయ నాయకుణ్నని, కమ్మల ఆధిపత్యాన్ని అడ్డుకోగల ధీరుడినని కాపులకు నమ్మకం కలిగించడంలో పవన్‌ విఫలమయ్యారు. కమ్మలతో కుమ్మక్కయిన నాయకుడిగానే కాపులనుకునేట్లా చేసుకున్నారు.

దీనికితోడు ప్రజారాజ్యం నేపథ్యం కూడా పవన్‌కు గుదిబండయింది. సినిమారంగంలో కేరాఫ్‌ చిరంజీవి విజిటింగ్‌ కార్డు పవన్‌కు ప్లస్‌ పాయింటయింది కానీ రాజకీయరంగంలో మైనస్‌ పాయింటయింది. ప్రజారాజ్యం నుంచి పవన్‌ తనను తాను వేరు చేసుకోలేదు. అప్పట్లో అతను యువరాజ్యం అధ్యక్షుడు. ఇప్పుడు కూడా ప్రజారాజ్యాన్ని విమర్శిస్తూ ఏమీ అనలేదు. ఎంతసేపూ ఇతరులు దాన్ని వెన్నుపోటు పొడిచారు అంటూనే వచ్చారు. అంతేగానీ ప్రజలకు చిరంజీవి పొడిచిన వెన్నుపోటు గురించి చెప్పలేదు. కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా ఉన్నామని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో 19% ఓట్లు తెచ్చుకుని, తర్వాత పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన సంగతి ఎవరు మర్చిపోతారు?

దానికి కారణం ఏమిటి? అయితే సిఎం కావాలి, కాకపోతే పార్టీని గంగపాలు చేయాలి అని చిరంజీవి అనుకున్నారు. ఎందుకంటే పార్టీ నిర్వహణ అనేది ఖర్చుతో కూడుకున్న పని. కార్యకర్తలకు నిత్యం డబ్బిస్తూనే ఉండాలి. వాళ్ల యిళ్లల్లో పెళ్లిళ్లలకు, చావులకు వెళుతూనే ఉండాలి. ఇంటికి వస్తే ఆదరించాలి. చిరంజీవి మొదటి నుంచీ ఆర్జనకే అలవాటు పడ్డారు కానీ ఖర్చుకి అలవాటు పడలేదు. ఐదేళ్ల పాటు పార్టీని సొంత ఖర్చుతో నడపాలంటే ఠారుకున్నారు. పట్టికెళ్లి కాంగ్రెస్సాగరంలో అస్తినిమజ్జనం చేసి చేతులు కడుక్కున్నారు. తను కేంద్రమంత్రి పదవి తెచ్చుకున్నారు. మళ్లీ సినిమాలు వేసుకుంటున్నారు. తనకు ఓట్లేసిన, తనపై నమ్మకముంచిన ప్రజల మనోభావాల గురించి పట్టించుకోలేదు.

ఆ అనుభవంతో మనసు విరిగిన ఓటర్లు ఈ పవన్‌ ఆ చిరంజీవి తమ్ముడే అనుకున్నారు. ఓడితే పార్టీ నడపడు, మనల్ని నట్టేట ముంచి పోతాడు అనుకున్నారు. గతంలో ప్రజారాజ్యంలో హంగు చేసిన నాగబాబు మళ్లీ యిక్కడా ప్రత్యక్షం! కథ రిపీట్‌ అవుతోంది, అప్పుడు అన్నగారు కాంగ్రెసులో కలిపితే తమ్ములుంగారు టిడిపిలో కలిపేస్తాడు అని సందేహించారు. చిరంజీవికి పడిన వర్గాల ఓట్లు కూడా పవన్‌కి పడకపోవడానికి యిదో కారణం కావచ్చు. చిరంజీవికి ఆంధ్రప్రాంతంలో 16 ఎమ్మేల్యేలు గెలిచారు. దాదాపు 23-24% ఓట్లు పడ్డాయి. మరి పవన్‌కు? ఒకే ఒక్కడు. ఓట్లు దానిలో నాల్గోవంతు.

ఇప్పుడు ఓటమిపై సమీక్షలు జరుపుతున్నారు. లోపల ఏం మాట్లాడుతున్నారో తెలియదు కానీ, బయటకు వచ్చి ఇవిఎంలను, ధనప్రభావాన్ని తప్పుపడుతున్నారు తప్ప ఆత్మవిమర్శ చేసుకోవటం లేదు. జనసేన పార్టీలో పెద్ద చిక్కేమిటంటే వికేంద్రీకరణ లేదు. అన్నీ పవనే ఫైనలైజ్‌ చేయాలి. ఆయనకు ఎప్పుడు టైమ్‌ దొరుకుతుందో, దొరికినప్పుడు ఏ మూడ్‌లో ఉంటాడో తెలియదు. బయట వాళ్లను పిలిచి తమ తప్పొప్పులను చెప్పమని అడిగే తత్త్వం ఉందో లేదో తెలియదు. ఈ సందేహం ఎందుకంటే పవన్‌ డైరక్ట్‌ చేసిన సినిమాలన్నీ ఫ్లాపే. పైగా తనకు తిక్కుందని ప్రతీతి. ఏం మాట్లాడితే ఎలాటి కోపం వస్తుందేమోనన్న భయం ఉంటుంది ద్వితీయ శ్రేణి నాయకులకు. ఎందుకంటే వాళ్లలో ఎవరికీ స్టేచర్‌ లేదు. బయటకు పొమ్మంటే విడిగా నిలబడే ప్రతిపత్తి లేదు.

పార్టీ నిలబడాలంటే అధికారంలో ఉన్న వైసిపిపై నిఘా వేసి ఉండాలి. తప్పు దొరకగానే ఏకేయాలి. సాటి ప్రతిపక్షమైన టిడిపిని ఎదగకుండా వారి స్థానాన్ని తను ఆక్రమించే ప్రయత్నం చేయాలి. పార్టీలో ఎందరినో చేర్చుకోవాలి. వాళ్లకు తర్ఫీదు యివ్వాలి. నిరంతరం ప్రజలలో ఉంటూ ఏవో ఒక కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. వీటన్నిటికీ మూకబలం, రూకబలం ఉండాలి. ఓపికుండాలి, దృఢసంకల్పం ఉండాలి. ఇవి తనలో ఉండి ఉంటే పవన్‌ వాటిని ప్రదర్శించలేదు. అతని నాయకత్వంపై కార్యకర్తలకు, ప్రజలకు నమ్మకం కుదురుకునే వరకు సమయం పడుతుంది. ఈలోగా ఆంధ్రలో ఎలాగైనా బలపడాలని చూస్తున్న బిజెపి, కాపులను, జనసేన అభిమానులను తన పార్టీలో చేర్చుకోవడం మొదలు పెట్టవచ్చు.

యువకుల్లో పవన్‌కు ఎంత ఆకర్షణ ఉందో, మోదీకి అంత ఆకర్షణ ఉంది. వైసిపి కూడా తన కాబినెట్‌లో కాపులకు పెద్ద పీట వేసి, రెడ్లతో సమానసంఖ్యలో వాళ్లకు పదవులు యిచ్చి కాపులను మెప్పించింది. టిడిపిపై కోపం పెంచుకున్న కాపులు వైసిపి వైపు పూర్తిగా మొగ్గినా ఆశ్చర్యం లేదు. టిడిపి, వైసిపి, బిజెపి అన్నీ దిగ్గజాలే. వీళ్ల మధ్య పవన్‌ ఎంతకాలం నెగ్గుకు వస్తాడన్నది సందేహమే! ఒకటి మాత్రం నిజం, ఏ ఆర్నెల్లకో కాడి పారేసినా ఎవరూ ఆశ్చర్యపోరు. పారేయకపోయినా వెనక్కాల నుంచి ఏ టిడిపియో, బిజెపియో నడిపిస్తోందేమో అని సందేహించనూ గలరు. ఎందుకంటే వనరులు లేని జనసేన ఎక్కువ కాలం మనగలగడం యీ రోజుల్లో సాధ్యపడదనే నమ్మకం చేత!

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2019)
[email protected]

ఎమ్బీయస్‌ – తెరాస చోటెక్కడో చెప్పిన తెలంగాణ

ఎమ్బీయస్‌ – అవినీతిరహిత పాలన సాధ్యమా?