కూసుకుంట్లకే కేసీఆర్ జై! నిరసనలు బేఖాతర్!!

గులాబీ దళపతి కేసీఆర్.. తాను మోనార్క్ అని మరోసారి నిరూపించుకునే ఆలోచనతో ఉన్నారా? మునుగోడు ఎమ్మెల్యే స్థానానికి జరగబోతున్న ఉప ఎన్నిక విషయంలో.. 2018లో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేయడానికే ఆయన…

గులాబీ దళపతి కేసీఆర్.. తాను మోనార్క్ అని మరోసారి నిరూపించుకునే ఆలోచనతో ఉన్నారా? మునుగోడు ఎమ్మెల్యే స్థానానికి జరగబోతున్న ఉప ఎన్నిక విషయంలో.. 2018లో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేయడానికే ఆయన మొగ్గుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని.. తెరాస శ్రేణులు గట్టిగా నిరసనలు చేపట్టినా.. కేసీఆర్ వాటిని పట్టించుకోవడంలేదు. అధికారిక ప్రకటన లేకపోయినా.. నర్మగర్భ సంకేతాలు ఆయన పంపుతున్నారు. 

ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో తాజాగా సమావేశమైన కేసీఆర్.. మునుగోడు అభ్యర్థి విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఎవరికి వారు తామే పోటీలో ఉంటామని ఊహించుకోవద్దునని, ఎవరిని ఎంపిక చేసినా.. గెలిపించుకునే బాధ్యతను పార్టీ సమష్టిగా తీసుకోవాలని వారికి హితబోధ చేశారు. అయితే.. రెండు రోజుల కిందట కూసుకుంట్లను వ్యతిరేకిస్తున్న నాయకులంతా ఓ సమావేశం పెట్టుకోగా.. అది అసమ్మతి భేటీ కాదని, విందుకు హాజరయ్యారని అంటూ నాయకులు కేసీఆర్ కు ఫీడ్ బ్యాక్ ఇచ్చి.. నియోజకవర్గంలో ఉన్న అసమ్మతిని పలుచన చేయడం విశేషం.

నిరసనల సంగతి అలా ఉండగా.. కేసీఆర్ మాటలే చిత్రంగా కనిపిస్తున్నాయి. ఆ మాటలే.. కూసుకుంట్లకే అభ్యర్థిత్వం దక్కుతందనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. 2014లో అక్కడ గెలిచిన తమ పార్టీ 2018లో కొద్ది తేడాతో ఓడిపోయిందని కేసీఆర్ అనడమే తమాషా. 2018లో 22వేలకు పైగా ఓట్ల తేడాతో కూసుకుంట్ల ఓడిపోయారు. 22 వేల మెజారిటీ ‘కొద్ది’ తేడానా? అని పార్టీ వారే ముక్కున వేలేసుకుంటున్నారు. కూసుకుంట్ల మీద కేసీఆర్ లో సానుభూతికి ఇది నిదర్శనం అంటున్నారు. ఆయనకే టికెట్ ఇవ్వాలని ఫిక్సయినట్లుగానే ఈ మాటల సంకేతాలు ఉన్నాయని అంటున్నారు. 

దానికితోడు.. మునుగోడు టికెట్ ఆశిస్తున్న నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తమ్ముడు చంచర్ల కృష్ణారెడ్డితో సీఎం ప్రత్యేకంగా సమావేశమై.. మునుగోడులో కష్టపడి పార్టీ విజయానికి పనిచేయాలని చెప్పడం విశేషం. ఆయనకు పార్టీ ఇతర రూపంలో మంచి స్థానం కల్పిస్తుందని చెప్పడం విశేషం. 

మరో ప్రయత్నంగా.. 2018 ఎన్నికల సమయంలో పార్టీనుంచి సస్పెన్షన్ కు గురైన వేనేపల్లి వెంకటేశ్వర్ రావుపై తెరాస సస్పెన్షన్ ఎత్తేసింది. అప్పట్లో టికెట్ ఆశించి భంగపడి, కూసుకుంట్లకు వ్యతిరేకంగా, వేనేపల్లి మునుగోడులోపెద్ద సభ పెట్టారు. దాంతో పార్టీ సస్పెండ్ చేసింది. ఇన్నాళ్లు ఆయనను పార్టీకి దూరంగానే ఉంచారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ పిలిపించి మాట్లాడారు. సస్పెన్షన్ ఎత్తేసి.. పార్టీ సముచిత స్థానం ఇస్తుందని.. మునుగోడులో ఈసారి అభ్యర్థి విజయానికి పనిచేయాలని పురమాయించారు. 

అక్కడ టికెట్ ఆశిస్తున్న కంచర్ల కృష్ణారెడ్ది, వేనేపల్లి వెంకటేశ్వర్ రావు లను ఇద్దరినీ ఇతర పదవుల తాయిలాలతో దువ్వడానికి కేసీఆర్ ప్రయత్నించడాన్ని చూస్తోంటే.. ఆయన ఖచ్చితంగా కూసుకుంట్ల ప్రభాకర రెడ్డికే టికెట్ ఇవ్వడానికి ఫిక్సయినట్లుగా పార్టీ నాయకులు అనుకుంటున్నారు.