జనసేనాని పవన్‌కల్యాణ్ వీకెండ్ మీటింగ్‌కు సిద్ధమయ్యారు. సాధారణ రోజుల్లో ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరనే ప్రత్యర్థుల విమర్శలకు బలం చేకూర్చేలా జనసేనాని వ్యవహరిస్తున్నారు. పవన్ కల్యాణ్ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని పిలిపించుకోడానికి ఇష్టపడుతున్నట్టున్నారు. ఇటీవల జనవాణి పేరుతో వారాంతాల్లో పవన్‌కల్యాణ్ కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. రెండు వారాలు నిర్వహించిన తర్వాత, ఇప్పుడు జనవాణి ఏమైందో తెలియదు.
తాజాగా ఐటీ సమన్వయకర్తలు, వాలంటీర్లతో మంగళగిరిలో పవన్‌కల్యాణ్ సమావేశం కానున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఈ సమావేశంలో వివరించనున్నారు. జనసేన కార్యక్రమాలను పరిశీలిస్తే జనం కోసం చేస్తున్న ఫీలింగ్ కలగదు. తమ రాజకీయ ఉనికిని చాటుకోడానికి అన్నట్టు… వీకెండ్స్‌లో ఏదో ఒకటి అన్నట్టు కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారనే భావన కలుగుతోంది.
ఇలాంటి కార్యకలాపాల వల్ల పార్టీ ఎలా బలోపేతం అవుతుందో పవన్‌కల్యాణ్, జనసేన నాయకులకే తెలియాలి. అసలు సీరియస్ పాలిటిక్స్ నడిపే ఉద్దేశం లేకుంటే, ఆ విషయాన్ని నిర్భయంగా ప్రకటించొచ్చు కదా? సీఎం కావాలనే ఆశ ఉంటే సరిపోతుందా? సీఎం… సీఎం అని జనసేన కార్యకర్తలు కేకలేస్తే పవన్ మందలించడం చూశాం. అరిస్తే సీఎం కానని, ఓట్లు వేసి, వేయిస్తేనే కల నెరవేరుతుందని హితబోధ చేస్తుంటారు. మరి తాను చేస్తున్నదేంటి?
ప్రజలకు చేరువ అయ్యేందుకు నిర్మాణాత్మక కార్యక్రమాలను చేయాల్సిన బాధ్యత లేదా? ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉందనే మాటే గానీ, కళ్లు మూసి తెరిచే లోపు కాలం కరిగిపోతుంది. ఇంత వరకూ పార్టీ నిర్మాణమే జరగలేదు. ఇక ప్రజాక్షేత్రంలో వారి అభిమానాన్ని చూరగొని అధికారంలోకి రావడం ఎట్లా? ఇవేవీ పవన్‌కు తెలియవని అనుకోవాలా? లేక ఆయన మనసులో మరేదైనా ఉద్దేశం ఉందా? ఏంటో జనసేనాని అయోమయం, పార్టీలో గందరగోళం.