హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఇవాళ అనంతపురం రాకను పురస్కరించుకుని భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఏం ఘన కార్యం సాధించాడంటూ సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచే విసుర్లు. ఇలాంటి సీన్లు సినిమాల్లో చూస్తుంటామని, ఇప్పుడు మాధవ్ పుణ్యమా అని రియల్‌గా చూడాల్సి వస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
న్యూడ్ వీడియోతో గత కొన్ని రోజులుగా అత్యంత వివాదాస్పద ఎంపీగా గోరంట్ల మాధవ్ వార్తల్లో నిలిచారు. అభ్యంతరకర రీతిలో ఉన్న గోరంట్ల మాధవ్ వీడియోలో కనిపించడం అధికార వైసీపీని ఇరకాటంలో పడేసింది. మరోవైపు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు. నాలుగు రోజుల తర్వాత అనంతపురం ఎస్పీ ఫకీరప్పతో క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇప్పించి, హమ్మయ్య అని జగన్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.
మార్ఫింగ్ వీడియో అంటూ గోరంట్ల మాధవ్ మాటనే అనంతపురం ఎస్పీ బలపరిచారు. దీంతో ఆయనకు అధికారికంగా క్లియరెన్స్ వచ్చినట్టుంది. ఈ నేపథ్యంలో తీవ్ర వివాదాల మధ్య గోరంట్ల మాధవ్ ఆదివారం అనంతపురం నగరానికి వెళుతున్నారు. భారీ కాన్వాయ్ మధ్య ఆయన్ను అనంతపురం తీసుకెళ్లనున్నట్టు సమాచారం.
మరోవైపు గోరంట్ల మాధవ్ అనంతపురం రాకను పురస్కరించుకుని ఎలాంటి అలజడి లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. టీడీపీ అనుబంధ సంఘాల నేతలను ఇప్పటికే గృహ నిర్బంధం చేసి నట్టు తెలిసింది. మాధవ్‌ను అడ్డుకుంటారనే అనుమానంతో ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
మాధవ్‌కు ఘన స్వాగత ఏర్పాట్లపై జనం హవ్వా… అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. కాస్త ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిదనే చెప్పేవాళ్లే కరువయ్యారనే మాట వినిపిస్తోంది.