హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై టీడీపీ తరపున బలంగా మాట్లాడుతున్న వారిని ఒక్కసారి పరిశీలించండి. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి, అలాగే వంగలపూడి అనిత, కావలి గ్రీష్మ, అనురాధ కనిపిస్తున్నారు. మగవాళ్లలో మాత్రం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పట్టాభిని టీడీపీ ప్రోత్సహిస్తోంది. కానీ మహిళల విషయానికి వస్తే ముఖ్యంగా దళితులను ముందుకు పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఈ వ్యవహారంలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత దూకుడు ప్రదర్శిస్తున్నారు. కావలి గ్రీష్మ మాత్రం ఒకట్రెండుసార్లు వచ్చి “బాబోయ్ నేను ఆ వీడియోని చూడలేక చచ్చా”నంటూ తెగ బాధపడిపోయారు. పంచుమర్తి అనురాధ ప్రభుత్వంపై విమర్శలతో మమ అనిపించారు. కానీ టీడీపీలో అంతర్గతంగా ఓ సీరియస్ చర్చ నడుస్తోంది. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాళ్లు ఎందుకని మాధవ్ ఎపిసోడ్‌పై ప్రెస్‌మీట్లు పెట్టడం లేదనే ప్రశ్న ఉత్పన్నమైంది.
ఇటీవల చంద్రబాబు ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ మాధవ్ ఎపిసోడ్‌పై పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. బాగా మాట్లాడాలని ప్రత్యేకంగా చెప్పారు. అయితే వంగలపూడి అనిత మాత్రమే ఎందుకు మాట్లాడుతోందనే ప్రశ్న దళితుల నుంచి వస్తోంది. పనికిమాలిన విషయాలపై దళితులతో మాట్లాడిస్తూ, వారిని తిరుగుబోతులుగా జమకట్టాలనే కుట్ర కాదా? అనే నిలదీత అణగారిన వర్గాల నుంచి ఎదురవుతోంది.
ఇటీవల చంద్రబాబు ఆదేశాల మేరకు గోరంట్ల మాధవ్ ఎపిసోడ్‌పై మీడియాతో మాట్లాడేందుకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకురాలు సిద్ధమయ్యారు. తోడు రావాలని పార్టీ అధికార ప్రతినిధి (నాన్ కమ్మ అయిన పెద్దాయన)ని సదరు నాయకురాలు కోరారట. “అమ్మా మీకు తోడుగా రావడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి వ్యవహారాలపై మాట్లాడేవాళ్లను సమాజం చిన్న చూపు చూస్తుంది. బజారు మనిషని ముద్ర వేస్తారు. ఇప్పుడు మన పార్టీలో మాట్లాడే వాళ్లెవరూ ఇష్టంతో చేస్తున్న పని అని నేను అనుకోను. అలా మాట్లాడుతున్న మహిళల గురించి మన పార్టీలోనే ఏ విధంగా మాట్లాడుకుంటు న్నారో నాకు బాగా తెలుసు. బిడ్డలాంటి దానివి. ఇంకొక అంశం ఏదైనా వుంటే చెప్పమ్మా కలిసి మాట్లాడ్దాం” అని సున్నితంగా చెప్పినట్టు సమాచారం.
అసలు మాధవ్ ఉదంతంపై కేవలం దళిత మహిళలే ఎందుకు మాట్లాడుతున్నారని టీడీపీ నేతల్ని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. పైకి ఎన్ని మాట్లాడుకుంటున్నా… “ఛీఛీ సిగ్గులేకపోతే సరి. పనికి మాలిన ఆ వీడియోపై మాట్లాడినోళ్లు కూడా గబ్బు పడతారు. మేము మాట్లాడ్డం బాబు” అని టీడీపీ అగ్రవర్ణ మహిళలు అంటున్నారని తెలిసింది. మరికొందరు కుటుంబ సభ్యులు ఎట్టి పరిస్థితు ల్లోనూ మాధవ్ న్యూడ్ వీడియో రొంపిలోకి దిగొద్దని మహిళా నాయకురాళ్లను హెచ్చరించినట్టు సమాచారం.
కుటుంబంలో భర్త, పిల్లలు, ఇతర కుటుంబ పెద్దలున్న వారు ఈ విషయంలో మాట్లాడ్డానికి ససేమిరా అంటున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక అవేవీ లేని, సమాజం, పెద్దాచిన్నా అనే భయభక్తులు, బాధ్యతలు లేనివాళ్లు మాత్రం ఇదే అవకాశంగా తీసుకుని పబ్లిసిటీ పొందాలనుకుంటే అడ్డుకునేదెవరనే ప్రశ్న ఒక టీడీపీ అధికార ప్రతినిధి నుంచి రావడం గమనార్హం.