మూడు రాజధానుల ద్వారా అధికార వికేంద్రీకరణ చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంకల్పిస్తే.. అందరూ కలిసి అనేక రకాలుగా అడ్డుపడ్డారు. మొత్తానికి కోర్టు ద్వారా.. మూడు రాజధానులు అనేవి అమల్లోకి రాకుండా అడ్డుకున్నారు. అమరావతి ఒక్కటే రాజధాని అని నానా గోల చేశారు.
సీఎంగా జగన్ రాష్ట్రం కోసం ఒక మంచి పనిచేయాలని అనుకుంటే.. అధికార వికేంద్రీకరణ ద్వారా.. సమతుల అభివృద్ధిని కాంక్షిస్తే చూసి ఓర్వలేకపోయిన పచ్చదళాలు దానిని అడ్డుకున్నాయి. వాళ్లంతా.. అమరావతి ఒక్కటే రాజధాని అని, అది మాత్రమే నిలిచి వెలుగుతుందని రకరకాల ప్రతిజ్ఞలు చేశారు. ఆ విషయాన్ని కనీసం వారయినా నమ్ముతున్నారా అంటే అదీ లేదు. అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి, సొంతంగా నిధులు సమీకరించుకోవడానికి సీఆర్డీయే స్థలాల వేలానికి పూనుకుంటే పట్టించుకున్న దిక్కులేదు. కేవలం ఒకే ఒక్కరు వేలంలో పాల్గొన్నారు.
రాజధాని జిల్లాల్లో భూముల వేలానికి సీఆర్డీయే ప్రయత్నిస్తే ఆసక్తి చూపించిన దిక్కులేదు. దాదాపు యాభైలక్షల రూపాయల ఖర్చుతో చేసిన పబ్లిసిటీ ఖర్చులు కూడా వారికి మిగల్లేదు. 56.2 ఎకరాలను సిఆర్డీయే వేలానికి పెట్టింది. స్థలాలు ఉన్న చోటు వాటి ప్రాధాన్యాన్ని బట్టి.. ఒక్కో గజం రూ.10వేల నుంచి రూ.32 వేల వరకు వీటికి ధరలు నిర్ణయించారు. వేలంలో పాల్గొన్న ఆ ఒక్కరు కూడా ప్రకటించిన ధర కంటె కేవలం రూ.వంద ఎక్కువ పెట్టి వేలంలోకి దిగారు.
సిఆర్డీయే భూముల వేలం అనేది ఇలా అపహాస్యానికి గురికావడం అనేక ఆలోచనలు రేకెత్తిస్తోంది. అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారులు, వ్యక్తులు, సంస్థలు దిగ్గజాలు ఎవ్వరూ సిద్ధంగా లేరనడానికి ఇది సంకేతం. అంటే, అమరావతిని రాజధానిగా ఆమోదించే పరిస్థితే ప్రజల్లో లేకుండా పోతోంది. అమరావతిని ఎవరూ పట్టించుకోకపోవడం అంటే.. వాళ్లందరూ కూడా జగన్ ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల ఆలోచనకు మద్దతిస్తున్నట్లే అనుకోవాలని పలువురు భావిస్తున్నారు.
అమరావతి ఒక్కటే రాజధాని అనే తెలుగుదేశం ప్రేరేపిత ప్రచారం కూడా ప్రజల్లో ఏమాత్రం నమ్మకం కలిగించలేకపోతోంది. ఆ ప్రచారాన్ని నమ్మి ఉంటే.. ఎవరో ఒకరు బిడ్ లో పాల్గొనేవారు. అలా జరగలేదు. వారు మాత్రం.. అమరావతికి డప్పు కొట్టుకుంటూనే ఉన్నారు. అదే అమరావతిని ఇన్వెస్టర్ల వర్గంలో పట్టించుకుంటున్న వారు మాత్రం లేరు. ఈ వేలమే ఇంత దారుణంగా విఫలమవగా.. మరో 14 ఎకరాలను వేలం వేయడానికి సిఆర్డీయే మళ్లీ సిద్ధమవుతుండడం విశేషం.