కీలక సమయంలో రేవంత్‌రెడ్డిని కరోనా లక్షణాలు ఇబ్బంది పెడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మునుగోడులో గెలిచితీరాలనే పట్టుదలతో ఉన్నారు. ప్రతి అవకాశాన్ని రాజకీయంగా అనుకూలంగా మలుచుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మనుగోడులో తలపెట్టిన పాదయాత్రలో పాల్గొనాల్సి ఉంది.
అయితే కరోనా లక్షణాలుండడంతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా స్వల్ప వ్యవధిలోనే రెండోసారి కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఆమె ఆ మహమ్మారి నుంచి కోలుకుని, ఆరోగ్యం బాగుందని అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్‌కు షాకింగ్ వార్త. ఆమె మళ్లీ కరోనాబారిన పడి ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు వార్తలొచ్చాయి.
ఇదిలా వుండగా చౌటప్పల్ నారాయణపురం నుంచి చౌటప్పల్ వరకూ కాంగ్రెస్ శనివారం పాదయాత్ర చేపట్టింది. ఇందులో పాల్గొని కాంగ్రెస్ శ్రేణుల్ని సమరానికి సన్నద్ధం చేయాలని రేవంత్‌రెడ్డి ఆశించగా, అనారోగ్యం ఆయనకు సహకరించలేదు. కరోనా లక్షణాలు వుండడంతో శాంపిల్స్‌ను పంపించారు. పాదయాత్రలో కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి తదితర నాయకులు పాల్గొన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ రేవంత్‌రెడ్డి అన్నట్టు పోరు సాగుతోంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌లోనే వుంటూ రేవంత్‌కు కంట్లో నలుసులా తయారయ్యారు. రాజగోపాల్‌రెడ్డిని విమర్శిస్తే, దాన్ని తనకు వర్తింపజేసుకుంటూ రేవంత్‌రెడ్డిపై వెంకటరెడ్డి రాజకీయ దాడికి దిగుతున్నారు. దీన్ని రానున్న రోజుల్లో రేవంత్ ఎలా పరిష్కరిస్తారో మరి!