2024 ఎన్నికలకు వైఎస్ జగన్, చంద్రబాబునాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జనసేనాని పవన్‌కల్యాణ్ మాత్రం అప్పుడప్పుడు మాత్రమే సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపిస్తారు. ఎక్కువ సార్లు ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్‌గా కనిపిస్తుంటారు. పవన్‌కల్యాణ్ సీరియస్ పాలిటిక్స్ చేయాలని సొంత పార్టీ వాళ్లు కూడా కోరుకుంటుంటారు. పవన్‌కల్యాణ్‌ది ఓ ప్రత్యేక పంథా అని, ఆయన్ను అందరూ లైట్ తీసుకున్నారు.
రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జగన్, చంద్రబాబు ఓ యుద్ధమే చేయబోతున్నారు. చంద్రబాబుకు ఈ ఎన్నికలు చావుబతుకుల సమస్య. దీంతో చావోరేవో తేల్చుకునేందుకు చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డనున్నారు. ఈ దఫా చంద్రబాబును ఓడిస్తే, ఇక తనకు ఎదురే లేదని జగన్ భావిస్తున్నారు. అందుకే చంద్రబాబును రాజకీయ చరమాంకంలో చిత్తుగా ఓడించేందుకు జగన్ వ్యూహం రచిస్తున్నారు. ఇందులో భాగంగా కుప్పంలోనే చంద్రబాబును కట్టడి చేసేందుకు “పెద్దిరెడ్డి” అస్త్రాన్ని జగన్ ప్రయోగించనున్నారు.
ముఖ్యంగా కుప్పంలో చాపకిందు నీరులా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వర్కౌట్ చేస్తున్నారు. ఇక మంగళ గిరిలో లోకేశ్‌ను మరోసారి ఓడించడానికి పక్కా ప్రణాళికలతో వైసీపీ ముందుకెళుతోంది. ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో మూడొంతు మారుస్తారనే టాక్ వైసీపీ నుంచే వినిపిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీలో గెలుపు గుర్రాలనే టాక్ వున్న నేతలపై జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు చంద్రబాబు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇద్దరు నేతల్లో పూర్తి వైరుధ్యం కనిపిస్తున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఉదాహరణకు టీడీపీలో ఒక బలమైన నాయకుడు ఉన్నాడనుకుందాం. అతన్ని తీసుకుంటే పార్టీకి గెలుపు అవకాశాలు మెరుగు అవుతాయనే నివేదిక జగన్‌కు అందిందని అనుకుందాం. ఆ నాయకుడిని తీసుకునేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అలాంటి నాయకులతో ఇప్పటికే అధికార పార్టీ చర్చలు జరుపుతోంది. ప్రధానంగా అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు భారమవుతున్న నేపథ్యంలో, దాన్ని జగన్ సొమ్ము చేసుకోవడంలో నిమగ్నమయ్యారు.
ఎన్నికల ఖర్చు కింద రూ.25 -రూ.30 కోట్ల వరకూ పార్టీ భరిస్తుందని వైసీపీ తరపున ప్రతిపాదనలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో టికెట్ ఆశిస్తున్న నాయకులు అధికార పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇదే చంద్రబాబు విషయానికి వచ్చే సరికి… డబ్బు విషయంలో పూర్తిగా చేతులెత్తేస్తున్నారని తెలిసింది. బాగా డబ్బు ఖర్చు పెట్టుకునే వాళ్లెవరైనా చూడండి అంటూ కొందరు ముఖ్య నాయకులకు సూచించినట్టు తెలిసింది. అదే టీడీపీకి పెద్ద అవరోధంగా మారిందనే చర్చ నడుస్తోంది.
ఉదాహరణకు చంద్రబాబు ప్రకటించిన డోన్ అభ్యర్థి సుబ్బారెడ్డి సంగతే తీసుకుందాం. సుబ్బారెడ్డి ఆర్థికంగా పుష్టిగా ఉన్నాడు. దీంతో ముందూవెనుకా ఆలోచించకుండా ఆయనే అభ్యర్థి అని ప్రకటించారు. తిరుపతికి వెళ్దాం. అక్కడ ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను కాదని జేబీ శ్రీనివాస్ అనే నాయకుడే కాని నాయకుడికి టికెట్ ఇచ్చేందుకు దాదాపు నిర్ణయం ఖరారైనట్టు సమాచారం. ఈయన్ను నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి వెతికి పట్టుకున్నాడు.
ఇలా ఏ నియోజకవర్గం తీసుకున్నా టీడీపీకి వెతుక్కునే పరిస్థితి. మరోవైపు టీడీపీలో కొద్దిగా ప్రజాదరణ ఉన్న నాయకులను వైసీపీ గద్దల్లా తన్నుకుపోడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. పలకరింపులు, మాట, మర్యాద చంద్రబాబు దగ్గర బాగున్నప్పటికీ, డబ్బు విషయంలో వెనుకడుగు వేస్తున్నారనే అసంతృప్తి టీడీపీ నేతల్లో ఉంది.
ఈ కారణం వల్లే వైసీపీ నుంచి ఆఫర్ వస్తే చాలు అన్నట్టు ఎదురు చూసే పరిస్థితి. ఎన్నికలను అంతిమంగా డబ్బు శాసిస్తుందనేది జగమెరిగిన సత్యం. అందులో ఎవరైతే దూకుడు ప్రదర్శిస్తారో వారిదే పైచేయి అని చెప్పక తప్పదు.