ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో వైసీపీ బలోపేతంపై ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు దృష్టి సారించారు. పార్టీ బూత్‌లెవెల్ మొదలుకుని అన్ని స్థాయిల్లోనూ కమిటీలను ఏర్పాటు చేసి ఎన్నికలకు సమాయత్తం కావాలని సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా 50 శాతం మహిళలుండాలనే నిబంధనను తప్పని సరిగా పాటించాలని సీఎం ఆదేశించారు.
దీంతో ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో మహిళల ప్రాధాన్యతను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో కమిటీల వివరాలను అధిష్టానానికి పంపాల్సి వుంది. సెల్ నంబర్‌తో సహా పూర్తి వివరాలను అందులో పొందుపరుస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అధిష్టానమే ఒక ఫారం పంపింది. వాటిలో ఫేస్‌బుక్ ఖాతా, ఇన్‌స్టా, అలాగే వాట్సాప్ నెంబర్ తదితర వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలని వైసీపీ అధిష్టానం సూచించింది.
ఈ వివరాలతో వైసీపీ సోషల్ మీడియాను కూడా బలోపేతం చేసే ఉద్దేశం కనిపిస్తోందని నేతలు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సామాజిక సమీకరణలు, 50 శాతం మహిళల భాగస్వామ్యం ఉండాలనే నిబంధనపై నేతలు పెదవి విరుస్తున్నారు. పార్టీ నిబంధనలు అనుసరించి అభ్యర్థులు దొరకడం కష్టంగా ఉందని కొన్ని చోట్ల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఓటర్ల నమోదు ప్రక్రియ సాగుతుండడంతో బూత్ లెవెల్ కమిటీలు, చురుకైన నాయకుల కోసం ప్రజాప్రతినిధులు వెతుక్కుంటున్న పరిస్థితి.
సంక్షేమ పథకాలు ఒక చోట పొందుతూ, మరో చోట నివాసం ఉన్న వాళ్లపై ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి సారించారు. అలాంటి వాళ్లను గుర్తించి ఓట్లను నివాసం ఉన్న ప్రాంతానికే మార్పించేందుకు కూడా యత్నిస్తున్నారు. కొత్త ఓటర్ల నమోదులో జాగ్రత్తలు తీసుకోవాలని, పార్టీకి అనుకూలమా? లేదా? అనేది బాగా తెలుసుకున్న తర్వాతే ఎంటర్ చేయాలనే ఆదేశాలు వెళ్లాయి. ప్రస్తుతం ఆ పనిలో వైసీపీ నేతలు బిజీగా ఉన్నారు.