రాజకీయ ప్రత్యర్థులుగా అన్నా చెల్లెలు …?

రాజకీయ కుటుంబాలు ఎప్పుడూ విచిత్రంగానే ఉంటాయి. ఆ కుటుంబాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కుటుంబ సభ్యుల్లో అందరూ ఒకే పార్టీల్లో ఉండొచ్చు, వేరు వేరు పార్టీల్లో ఉండొచ్చు.  Advertisement కొన్ని రాజకీయ కుటుంబాల్లో…

రాజకీయ కుటుంబాలు ఎప్పుడూ విచిత్రంగానే ఉంటాయి. ఆ కుటుంబాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కుటుంబ సభ్యుల్లో అందరూ ఒకే పార్టీల్లో ఉండొచ్చు, వేరు వేరు పార్టీల్లో ఉండొచ్చు. 

కొన్ని రాజకీయ కుటుంబాల్లో సభ్యులు తమ రాజకీయ సిద్ధాంతాలు, నమ్మకాల కారణంగా వేరు వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ కుటుంబ కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా కలిసిపోతారు. అక్కడ రాజకీయాల ఊసు ఉండదు. పాలిటిక్స్ గురించి మాట్లాడుకోరు. గడపదాటి బయటకొస్తే మళ్ళీ ఎవరి దారి వారిదే. ఇలాగే జరుగుతుందని చెప్పలేము గానీ ఇలా జరగదని కూడా చెప్పలేం.

ఈ నెలలోనే అంటే త్వరలోనే ఇలాంటి ఆసక్తికరమైన ఘటన జరగబోతోంది. అది ఎలా ఉంటుందనేది ఇప్పుడు జనాలకు ఉత్కంఠగా ఉంది. పైన చెప్పుకున్న ఉపోద్ఘాతానికి వైఎస్సార్ కుటుంబానికి సంబంధం ఉంది. 

ప్రతి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, అన్నా చెల్లెళ్ళ మధ్య, అక్కా చెల్లెళ్ళ మధ్య అభిప్రాయభేదాలు ఉంటూనే ఉంటాయి. ఒక్కోసారి అవి తీవ్రంగా కూడా ఉండొచ్చు. ఇక రాజకీయ ప్లస్ డబ్బున్న కుటుంబాల్లో విభేదాలు ఉండటం విచిత్రం కాదు. వైఎస్ జగన్, షర్మిల మధ్య విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో స్పష్టంగా తెలియదు.

అయినప్పటికీ వాళ్లిద్దరూ నిన్నటివరకు అన్నా చెల్లెలు. ఇప్పుడు వారిద్దరూ రాజకీయ నాయకులు. జగన్ సొంత పార్టీ పెట్టుకొని అధికారంలోకొచ్చి సీఎం కూడా అయితే, షర్మిల ఏపీలో కాకుండా తెలంగాణలో పార్టీ పెట్టింది. వాస్తవానికి రాజకీయంగా ఇద్దరికీ సంబంధం లేదు. కానీ ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ ప్రత్యర్ధులయ్యారు. 

షర్మిల తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నప్పుడు తెలంగాణా తరపున మాట్లాడాలి కదా. తన రాష్ట్రాన్ని, తన అన్నను సమర్ధిస్తూ మాట్లాడలేదు కదా. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతున్న నేపథ్యంలో ఆమె తెలంగాణా తరపున మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే తెలంగాణా నీటి వాటాలో ఒక్క చుక్క కూడా వదులుకునే ప్రసక్తి లేదని కరాఖండీగా చెప్పింది. 

అన్న జగన్ పై విమర్శలేమీ చేయలేదు. మరి షర్మిల ఈ వైఖరిని జగన్ ఏ విధంగా తీసుకుంటాడో తెలియదు. ఈ నేపథ్యంలో అన్నయ్య, చెల్లెలు ఒక చోటికి చేరబోతున్నారు. అదే ఇడుపులపాయ. జులై 8 వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. 

ఆ రోజున ఇడుపులపాయలో కుటుంబం అంతా కలిసి నివాళి అర్పిస్తుంది. ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మాట ముచ్చట ఉంటుంది. ఇదంతా గత ఏడాది వరకే. కానీ, ఈ సారి మాత్రం పరిస్థితులు వేరు.. గత ఏడాది వరకు అన్నకు తోడుగా, మాజీ ముఖ్యమంత్రి కూతురిగా ఉన్న షర్మిల..ఈ సారి సొంత పార్టీ పెట్టి రాకీయాల్లోకి వచ్చేసింది. 

అది కూడా తెలంగాణలో.  తెలంగాణలో ప్రజా సమస్యలపై స్పందిస్తూ తనదైన శైలిలో ముందుకు వెళుతోంది. ఎప్పటినుండో అన్న జగన్, చెల్లి షర్మిల మధ్య విబేధాలు, భేదాభిప్రాయాలు ఉండేవని వచ్చిన వార్తలను ఎక్కడా కొట్టేసిన దాఖలాలు లేవు. అలా అని ఒప్పుకున్న పరిస్థితీ లేదు. షర్మిల తెలంగాణలో  పార్టీ పెట్టడంపై అనేక ప్రశ్నలు వచ్చినా..ఎక్కడా వెనక్కి తగ్గలేదు. 

ఫిబ్రవరి 9 తర్వాత వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ ఎక్కడా కలిసిన సందర్భాలు లేవు. కలుసుకునే వేదికా రాలేదు. ఈ నేపథ్యంలో నే వైఎస్సార్ జయంతి రోజు జులై 8న ఇడుపులపాయలో ఏం జరగబోతుంది అనే చర్చ ఆసక్తిని పెంచుతోంది.  

కచ్చితంగా షర్మిల తండ్రికి నివాళి అర్పించాలి. అదే సందర్భంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపులపాయలో తండ్రికి నివాళి అర్పించడానికి వస్తారు. చెల్లితో మాట్లాడతారా ? చెల్లి షర్మిల వచ్చి వెళ్ళాక జగన్ వస్తారా..? ఇదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. 

షర్మిల ఇడుపులపాయలో తండ్రికి నివాళి అర్పించి అక్కడ నుండి హైదరాబాద్ వచ్చి పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి హాజరవుతుంది. ఇక ఇప్పుడు ప్రశ్నఏమిటంటే ఇడుపులపాయలో జగన్, షర్మిల అన్నా చెల్లెలుగా ఆప్యాయంగా మాట్లాడుకుంటారా? రాజకీయ ప్రత్యర్థులుగా వ్యవహరిస్తారా?