మూడేళ్లు ఆగండి తమ్ముళ్లూ మనదే అధికారం అని చెబుతూ వస్తున్న చంద్రబాబు.. దానికి తగ్గట్టు బ్రహ్మాండమైన లాజిక్ కూడా వెదుక్కున్నారు. ఆ లాజిక్ వింటే నిజంగా తెలుగు తమ్ముళ్లు మరోసారి భ్రమల్లో మునిగిపోవడం ఖాయం. అలా ఉంటాయి చంద్రబాబు చేసే జిమ్మిక్కులు.
అవును.. వచ్చే మూడేళ్ల కాలంలో వైసీపీ నుంచి టీడీపీకి విపరీతంగా వలసలుంటాయని, 2024 ఎన్నికలనాటికి ఆ పార్టీలో జగన్ మినహా పెద్ద నేతలెవరూ మిగలరని జోస్యం చెబుతున్నారు బాబు. అడ్డదిడ్డంగా తన వాదనని సమర్థించుకుంటున్నారు.
ఓడిన నేతలు..
2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కనివారు, ఓడిపోయిన నేతలు ఇప్పుడు అసంతృప్తితో ఉన్నారట. వీరిలో చాలామందికి జగన్ పునరావాసం చూపించకపోయే సరికి ప్రత్యామ్నాయం కోసం వెదుకుతున్న వారంతా గుంపగుత్తగా టీడీపీలో చేరతారట.
జగన్ రాజకీయ ఉపాధి కల్పించకపోయే సరికి, టీడీపీలోకి వచ్చి చేరే వారందరితో తమ పార్టీ బలబడుతుందని అంచనా వేస్తున్నారు చంద్రబాబు. ఇలా ఓడిపోయిన జనాల్ని, రాజకీయ నిరుద్యోగుల్ని కలిపేసుకుని బాబు తన పార్టీని ఏం చేస్తారో ఏమో..?
గెలిచిన నేతలు..
అయితే వైసీపీ తరపున గెలిచిన నేతల్లో కూడా చాలామంది అసంతృప్తులు ఉన్నారని అంటున్నారు చంద్రబాబు. మంత్రి పదవులు రాలేదని అలిగినవారు వైసీపీలో ఉన్నమాట వాస్తవమే. నామినేటెడ్ పోస్ట్ లు కూడా దక్కనివారూ కాస్త ఇబ్బంది పడుతున్న మాట కూడా వాస్తవమే.
అంతమాత్రాన వారంతా టీడీపీలోకి వెళ్తారనుకుంటే అది బాబు భ్రమే. అయితే ఆయన మాత్రం ఈ బ్యాచ్ కూడా వచ్చే ఎన్నికలనాటికి పచ్చకండువాలు కప్పేసుకుంటుందని భ్రమల్లో ఉన్నారు.
పదవి లేకపోయినా అధికారంలో ఉన్న పార్టీలో ఉండటానికే ఎవరైనా ఇష్టపడతారు. అలాంటిది మునిగిపోయే నావని ఎక్కేందుకు ఎవరైనా ఎందుకు సాహసిస్తారు. ఇక్కడ కూడా చంద్రబాబు లాజిక్ మిస్ అయ్యారు, కానీ టీడీపీ నేతల్ని భ్రమల్లోకి నెట్టేందుకు ఇలా మాయమాటలు చెబుతున్నారు.
వలసలు ఎట్నుంచి ఎటు..?
మొన్నటివరకు టీడీపీ నుంచి వైసీపీకి.. భారీగా వలసలు జరిగాయి. లక్షలాది మంది కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఇటు వచ్చారు. తమ పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే నియమం జగన్ పెట్టుకోకుండా ఉంటే.. బాబు, బాలయ్య మినహా ఇంకెవరూ ఆ పార్టీలో ఉండరనే అంచనాలు కూడా ఉన్నాయి.
అలాంటి పరిస్థితుల్లో ఉన్న టీడీపీలోకి ఇప్పుడు వలసలు పెరుగుతాయంటే ఎవరు మాత్రం ఎందుకు నమ్ముతారు? ఎలా నమ్ముతారు..? కానీ చంద్రబాబు మాత్రం పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు ఇలా వలసల కథ చెబుతున్నారు.
వైసీపీ అసంతృప్త నేతలంతా వచ్చే ఎన్నికలనాటికి తమవైపు వస్తారని, వారందరి సాయంతో వైసీపీని ఓడిస్తామని చెబుతున్నారు చంద్రబాబు. కానీ అసలు వాస్తవాన్ని మాత్రం ఆయన గ్రహించలేకపోతున్నారు. వైసీపీలో అసంతృప్తి ఉన్న మాట నిజమే కానీ, వారంతా టీడీపీలోకి వస్తారనుకోవడం భ్రమ.
ఎందుకంటే, ఇప్పుడు టీడీపీలో ఉన్న జనాలకే బాబు, లోకేష్ పై నమ్మకం లేదు. ఇక కొత్తగా ఎందుకొస్తారు? ఎవరొస్తారు..? నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తున్న టీడీపీని ఎవరు నమ్ముతారు..? అసంతృప్తి ఉన్నప్పటికీ అధికార పార్టీలో ఉన్నామన్న తృప్తితో కొనసాగడానికే ఇష్టపడతారు నేతలు.
బాబు మరో ఎత్తుగడ ఇది..
వైసీపీని అస్థిరపరచడానికి రోజుకో కుయుక్తి పన్నుతున్న చంద్రబాబు, తన అను'కుల' మీడియా సహాయంతో బాబు వేసిన కొత్త ఎత్తుగడ ఇది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ పార్టీలో అసంతృప్తి తారా స్థాయికి చేరిపోయిందని.. వలసలు అట్నుంచి ఇటు ఉంటాయని నమ్మబలుకుతున్నారు బాబు.
మొన్నటివరకు చేసిన జమిలి జపం అయిపోవడంతో ఇప్పుడీ కొత్త పల్లవి అందుకున్నారు. ఈ జిమ్మిక్కుకు టీడీపీ శ్రేణులు పడతాయేమో కానీ, వైసీపీ నేతలు మాత్రం కచ్చితంగా పడరు.