గుంటూరు జిల్లా మంగళగిరిపై కొత్త చర్చ ప్రారంభమైంది. ప్రస్తుతం ఆక్కడ వైసీపీ సీనియర్ నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేయరనే ప్రచారానికి తెరలేచింది. అక్కడి నుంచి గంజి చిరంజీవి వైసీపీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. టికెట్ హామీతోనే ఆయన టీడీపీ నుంచి బయటికొచ్చారని చెబుతున్నారు. త్వరలో ఆయన వైసీపీ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
టీడీపీలో మున్సిపల్ చైర్మన్‌గా గంజి చిరంజీవి పని చేశారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణా రెడ్డిపై కేవలం 12 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తాజాగా టీడీపీలో తనకు అన్యాయం జరిగిందని, మానసికంగా హత్య చేశారనే ఘాటు విమర్శలు చేసి బయటికొచ్చారు. మంగళగిరిలో గంజి చిరంజీవి చేనేత సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకుడు. మంగళగిరిలో ఆయన సామాజిక వర్గం ఓట్లే అత్యంత క్రియాశీలకం. దీంతో గంజి చిరంజీవిని వైసీపీలో చేర్చుకుని, రానున్న రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.
దీనికి అనేక కారణాలున్నాయి. అక్కడి నుంచి మరోసారి నారా లోకేశ్ పోటీ చేయనున్నారు. లోకేశ్‌ను ఎలాగైనా ఓడించాలనే ధ్యేయంతో జగన్ ఉన్నారు. ఈ దఫా ఆళ్ల రామకృష్ణారెడ్డి అభ్యర్థి అయితే గెలుపు అవకాశాలు తక్కువే అని వైసీపీ భయపడుతున్నట్టు సమాచారం. రాజధాని మార్పు, ప్రభుత్వంపై వ్యతిరేకత తదితర అంశాలు మంగళగిరిలో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీయొచ్చని సర్వే నివేదికలు జగన్‌కు అందినట్టు చెబుతున్నారు.
దీంతో గెలుపే ప్రధానంగా అత్యంత సన్నిహితుడైన ఆళ్లను కూడా మార్చే అవకాశాలు లేకపోలేదనే చర్చకు దారి తీసింది. గంజి చిరంజీవిని వైసీపీ తరపున నిలిపితే ఆయన సామాజిక వర్గ ఓట్లు, అలాగే రెడ్లు, మైనార్టీలు, దళితుల ఓట్లు కలిసొచ్చి లోకేశ్‌ను మట్టి కరిపించొచ్చనే ఎత్తుగడ వైసీపీ వేసినట్టు ప్రచారం జరుగుతోంది.
అభ్యర్థుల విషయమై కఠిన నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడనని జగన్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీకి గంజి చిరంజీవి టీడీపీకి రాజీనామా అంశం వైసీపీ అభ్యర్థి మార్పుపై కొత్త చర్చకు దారి తీసింది.