అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి అభ్యర్థే శాపమా? అంటే ఔననే సమాధానం వస్తోంది. అక్కడ బత్యాల చెంగల్రాయులు టీడీపీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన స్థానికేతరుడు.
అయితే రాజంపేట నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం బలంగా ఉంది. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన బత్యాల చెంగ్రలాయుల్ని టీడీపీ పెద్దిదిక్కుగా భావించింది. ఈయన సమీపంలోని రైల్వేకోడూరు నియోజకవర్గ నివాసి. రైల్వేకోడూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్. దీంతో బత్యాల అక్కడ పోటీ చేయడానికి వీల్లేదు.
గత ఎన్నికల సందర్భంలో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్‌రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేశారు. దీంతో టీడీపీకి అభ్యర్థి కరువయ్యారు. బత్యాల చెంగల్రాయుల్ని తీసుకొచ్చి నిలిపారు. వైఎస్ జగన్ సొంత జిల్లాతో పాటు ఆయన హవాలో బత్యాల గాలికిపోయారు. మేడా మల్లికార్జున్‌రెడ్డి వరుసగా రెండుసార్లు గెలుపొందడం, అలాగే వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షానికి కలిసి వచ్చే అవకాశం ఉంది.
అయితే దీన్ని రాజకీయంగా క్యాష్ చేసుకునే పరిస్థితిలో టీడీపీ లేదని సమాచారం. బత్యాల చెంగ్రలాయులు వ్యవహార శైలే కారణమని అంటున్నారు. రాజంపేటలో రెడ్లు, మైనార్టీలు, బలిజలు ఇలా అన్ని కులాల వాళ్లున్నారు. కానీ బత్యాల మాత్రం కేవలం తన సామాజిక వర్గం వారిని మాత్రమే దగ్గరికి తీసుకుంటున్నారనే విమర్శ ఉంది. మిగిలిన సామాజిక వర్గాలను ఆయన ఆదరించకపోవడంతో వారంతా అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఆయన తిరుపతిలో వుంటారు. దీంతో కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే ఆగ్రహం సహజంగానే వుంది. మరీ ముఖ్యంగా చేతిలో నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడంతో ఆయనకు ఎవరూ దగ్గర కాలేకపోతున్నారు.
రాజంపేటకు బదులు రాయచోటిని జిల్లా కేంద్రం చేయడంతో రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. బత్యాల నాయకత్వంలో దీన్ని సొమ్ము చేసుకునే పరిస్థితి లేదని టీడీపీ ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో రాజంపేటలో బత్యాల నాయకత్వంపై ఏం చేయాలో టీడీపీకి దిక్కుతోచని పరిస్థితి.