ప్రభుత్వ సొమ్మును ప్రజలకు అప్పనంగా పంచడంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే రకమైన పంథాను అనుసరిస్తున్నాయి. అయితే ఉచితాలపై ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టులో పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉచితాలపై ఆందోళన నెలకుందనే విషయం అర్థమవుతోంది. న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
ఉచితాలను హామీ ఇవ్వడం చాలా తీవ్రమైన విషయమని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దీనివల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతింటోందన్నారు. ఈ వ్యాఖ్యలను కొట్టి పారేయలేం. సమస్యల్లా ఉచితాలను ఎవరికి అందించాలనేదే. వైట్ రేషన్‌కార్డు ప్రామాణికంగా పేదరికాన్ని నిర్ధారిస్తున్నారు. ఈ కార్డు ఉంటే చాలు ఏ పథకానికైనా అర్హులని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే పలుకుబడి ఉన్న వాళ్లు రేషన్‌కార్డు తెచ్చుకోవడం బ్రహ్మ విద్యేమీ కాదు.
ఇక్కడే ప్రభుత్వ ఆశయాలు దెబ్బతింటున్నాయి. నిజమైన పేదలకు 50 శాతం లబ్ధి అందుతుంటే, మిగిలిన 50 శాతం ఆర్థిక భరోసా అవసరం లేని వారికి కూడా అందుతోంది. ఇదే ప్రభుత్వాలకు భారంగా మారింది. లక్షలాది కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు అందిస్తున్నప్పటికీ, వారి జీవితాల్లో పురోభివృద్ధి కనిపించడం లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇంకా ఉచితాల ఎర చూపుతున్నారంటే… మనం ఎటు పోతున్నాం? అనే ప్రశ్న వెల్లువెత్తుతోంది.
ప్రభుత్వ ఖజానాలకు తీవ్ర భారమయ్యేలా అప్పులు చేసి మరీ పంచుతున్నప్పటికీ మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమా రాజకీయ పార్టీల్లో కనిపించడం లేదు. ఎన్నికల సమయంలో యధావిధిగా ఓటుకు నోటు ఇస్తే తప్ప ఓట్లు వేయరనే భయం రాజకీయ పార్టీలను వెంటాడుతోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే… నిజంగా కష్టాల్లో ఉన్న వాళ్లకు కాకుండా ఆర్థికంగా స్థితిమంతులకు లబ్ధి చేకూర్చడమే. అవసరాల్లో ఆదుకున్న ఏ పాలకుడిని ప్రజలు మరిచిపోరు.
అందుకు విరుద్ధంగా రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం మాత్రమే సంక్షేమ పథకాల పేరుతో ఇబ్బడిముబ్బడిగా డబ్బు పంచుతున్నారనే భావనలో ఉన్న వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ నాయకులు అనుకున్నట్టు ఓట్లు వేయరు. కనీసం ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల వైపు కూడా తొంగిచూడరు. ఇదే పేదరికంతో ఇబ్బంది పడుతూ లబ్ధి పొందిన వాళ్లు మాత్రం…. వద్దన్నా ఓట్లు వేస్తారు. ఉచిత పంపిణీలపై ప్రభుత్వాలకు స్పష్టత వుండాలి.
అయితే లబ్ధిదారుల్లో కోత విధిస్తే రాజకీయంగా తమకెక్కడ ఇబ్బంది అవుతుందోనని వెనుకాడుతు న్నారు. ఎన్నికల ముంగిట రాష్ట్ర, దేశ ఆర్థిక బడ్జెట్‌కు మించి హామీలిచ్చి, పబ్బం గడుపుకున్న తర్వాత అప్పుల కోసం ఎదురు చూడడం పరిపాటైంది. చివరికి ఉచిత పథకాలు ప్రభుత్వాలకు భారమయ్యాయనే గగ్గోలు మొదలైంది. వీటిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడం మంచి పరిణామం. రాష్ట్ర, దేశ భవిష్యత్‌ను కాపాడేలా మంచి తీర్పు వస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది?