రేవంత్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నాటినుంచి ఆయనది ఒకటే ఎజెండా. కేసీఆర్ ను అత్యంత ఘోరంగా తిట్టడం.. అలా తిట్టడం ద్వారా.. తిడితే సంతోషించే వారికి ఆనందాన్ని కలిగించడం. ఆ విషయంలో ఆయన ఆరితేరిపోయారు. ఈ రకంగా ఆయన కేసీఆర్ శత్రువులు, ద్వేషించే అనేకమందికి ఆనందం కలిగిస్తుండవచ్చు.. కానీ.. వారందరి నుంచి ఓట్లు పొందగల స్థితిలో ఉన్నారా? అనేది చాలా ఇంపార్టెంట్. పవన్ కల్యాణ్ మాట్లాడితే విజిల్స్ వేసేవాళ్లు ఉంటారు గానీ.. ఓట్లు వేసేవాళ్లు ఉండరు.. అనేది ఒక నవీన రాజకీయ సిద్ధాంతం. తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అంతే.
ఇప్పుడు మునుగోడు ఎన్నిక రేవంత్ రెడ్డి ప్రాణాలమీదికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయక ముందునుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డైరక్టుగా రేవంత్ మీదనే ఎడాపెడా విమర్శలు చేస్తూనే ఉన్నారు. నిజానికి రేవంత్ కు పీసీసీ సారథ్యం కట్టబెట్టడానికి ముందునుంచే కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యతిరేకిస్తున్నారు. తీరా రాజగోపాల్ పార్టీనుంచి వెళ్లిపోయాక.. రేవంత్ చేతగానితనం గురించి.. చాలా పెద్దపెద్ద మాటలే అన్నారు. మునుగోడు ఎన్నికల బరిలో .. రాజగోపాల్ కు కౌంటర్లివ్వడం ఇప్పుడు రేవంత్ బాధ్యత.
ఈ విషయంలో రేవంత్ మంచి పంచ్ డైలాగునే తయారు చేసుకున్నారు. రాజకీయాలు మాత్రమే మాట్లాడుతూ కూడా ప్రజలకు మంచి కామెడీ పంచిపెట్టే కెఎ పాల్ తో రాజగోపాల్ ను కంపేర్ చేస్తున్నారు. ఒక కేఎ పాల్ లాగా.. ఇప్పుడు ఆర్ జి పాల్ వచ్చాడని.. ఎద్దేవా చేస్తున్నారు. నిజానికి కామెడీ పరంగా పంచ్ అదిరిపోయినట్టే లెక్క. కోమటిరెడ్డి రాజగోపాల్ ను ఇష్టపడని వాళ్లందరికీ ఈ పంచ్ గొప్పగా అనిపించవచ్చు. వాళ్లు ఆనందించవచ్చు. కానీ.. తొలుత చెప్పుకున్న అనుమానే ఇక్కడ కూడా కలుగుతోంది. రేవంత్ తన పంచ్ లతో వారందరినీ ఆనందపెట్టడం మాత్రమేనా.. మునుగోడులో ఓట్లు సాధించేది కూడా ఉంటుందా? అనేది ప్రశ్న.
రేవంత్ కు మునుగోడు ఎన్నిక డూ ఆర్ డై లాంటిది. ఇదివరకటి ఉప ఎన్నికలు వేరు. ఈటల కోల్పోయిన సీటును ఆయనే గెలుచుకున్నాడు. టీఆర్ఎస్ కోల్పోయిన సీటును ఆ పార్టీనే గెలుచుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. కాంగ్రెస్ కోల్పోయిన సీటును ఆ పార్టీ గెలుచుకుంటుందా? రాజగోపాల్ కోల్పోయిన సీటును ఆయన గెలుచుకుంటాడా? అనేది ఇక్కడ మీమాంస.
కాంగ్రెస్ సీటు ఇది. పార్టీకి హవా ఉన్నదని నిరూపించాలంటే రేవంత్ ఈ సీటును గెలిచి తీరాలి. కానీ టీఆర్ఎస్, బిజెపి ఇప్పటికీ ఈ ఎన్నికను చాలా ప్రతిష్ఠాత్మకంగా మార్చేశాయి. రేవంత్ రెడ్డి తన మార్కు పంచ్ లతో దూసుకెళ్లినా సరే.. అంతిమంగా విజయం సాధిస్తేనే ఆయనకు గౌరవం. మునుగోడులో విజయం సాధించకపోయినా.. కనీసం ప్రత్యర్థిని బెంబేలెత్తించేంత ఓట్లు సాధించకపోయినా.. పంచ్ లతో విరుచుకుపడే రేవంత్ సారథ్యం అనేది మాటల గారడీకే తప్ప పార్టీ విజయాలకు ఉపయోగపడేది కాదని, కాంగ్రెస్ ఆశలు వదులుకోవచ్చు.