వ్య‌భిచారంపై 44 ఏళ్ల‌ క్రితమే…!

ఈ రోజు 2022, మే  28. ఖచ్చితం గా 44 ఏళ్ళ క్రితం… అంటే 1978 మే 28 ఆదివారం. ఆ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక వ్యాసం రాశాను. అప్పుడు ఒక్క విజయవాడలోనే…

ఈ రోజు 2022, మే  28. ఖచ్చితం గా 44 ఏళ్ళ క్రితం… అంటే 1978 మే 28 ఆదివారం. ఆ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక వ్యాసం రాశాను. అప్పుడు ఒక్క విజయవాడలోనే ఆంధ్రజ్యోతి కార్యాలయం ఉండేది . ఈ వ్యాసంలో “వ్యభిచారాన్ని చట్టబద్ధం  చేయండి” అని రాశాను. జీవనోపాధి కోసం చేసే వ్యభిచారాన్ని ఒక వృత్తిగా గుర్తించండి అని రాశాను . వారికి ఉచిత ఆరోగ్య కార్డులు ఇవ్వండి అని రాశాను . వారితో పోలీసులు అమర్యాదకరంగా వ్యవహరించకుండా చూడాలి అని రాశాను.

నిజానికి, ఆ రోజుల్లో ఏ వ్యాసమైనాఎడిటర్ నండూరి రామమోహన రావు చూసిన తరువాతే, ప్రింటింగ్‌కు వెళ్లేది. ఇది మాత్రం అసిస్టెంట్ ఎడిటర్ తుర్లపాటి కుటుంబరావు (ఇప్పుడు స్వర్గీయ) చూసి,  చూసీ -చూడగానే కంపోజింగ్‌కు పంపారు.

అప్పటికి, ట్రైనీ  సబ్ – ఎడిటర్ గా నేను చేరి రెండు నెలలే అయింది. మార్చ్ 15, 1978 న చేరాను. ఈ ఆర్టికల్ మీద పెద్ద దుమారం చెలరేగింది. నా వ్యాసాన్ని తీవ్రంగా ఖండిస్తూ మహిళా సంఘాల ఉత్తరాలు, ఆ ఉత్తరాలను ఖండిస్తూ మరికొంత మంది ఉత్తరాలు. ఇలా….ఒక 15 రోజులు ఇవే ఉత్తరాలు.

'ఆర్యా ' అంటూ ఎంతో సౌమ్యంగా సాగే ఉత్తరాల శీర్షిక -ఈ వ్యతిరేక, అనుకూల దూషణ భూషణ ఉత్తరాల దుమారంతో పూర్తిగా 'కలుషితమై' పోయింది.

ఇప్పుడు,44 సంవత్సరాల తరువాత – భారత సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం అదే చెప్పింది. జీవనోపాధి కోసం వ్యభిచరించే మహిళలకు మనందరిలాగే అన్ని హక్కులూ ఉంటాయని, అది నేరం కాదని తేల్చి చెప్పింది. అయితే, వ్యభిచార గృహాలు నిర్వహించడం మాత్రం నేరమని స్పష్టం చేసింది. 

వ్యభిచరించే మహిళలపై పోలీసులు నేరం మోపడానికి  వీలు లేదు అన్నది. భారత సుప్రీంకోర్టుకు, ఈ అభిప్రాయం వ్యక్తం చేసిన -జస్టిస్ లావు నాగేశ్వర రావు నేతృత్వం లోని త్రిసభ్య ధర్మాసనానికి పాదాభివందనాలు.

-భోగాది వేంకట రాయుడు