సినిమా టికెట్ ల వ్యవహారం చిత్రాతి చిత్రమైన మలుపులు తిరుగుతోంది. ఆంధ్ర ప్రభుత్వం రేట్ల తగ్గించినపుడు జనాలు నానా గడబిడ చేసారు. సెటైర్లు వేసారు. సినిమా ఇండస్ట్రీని చంపేస్తున్నారు అన్నారు. సరే అని ప్రభుత్వం రేట్లు పెంచేసింది. అంతే కాదు, అవసరం అయితే మరింత పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. తెలంగాణలో ప్రభుత్వం ఏకంగా ఫ్లెక్సీ రేట్లు ఇచ్చింది.
ఇదంతా జరిగి ఎన్నో రోజులు కాకుండానే టాలీవుడ్ జనాలకు బొమ్మ కనిపించడం ప్రారంభించింది. కరోనా టైమ్ లో ఓటిటికి అలవాటు పడిన జనాలు. టికెట్ రేట్లు విని భయపడిన జనాలు చిన్న, మీడియం సినిమాలకు దూరంగా వుండడం ప్రారంభించారు. మరోపక్కన పెద్ద సినిమాలకు కూడా ఫుట్ పాల్ తగ్గిపోతోంది. దీంతో సినిమా జనాలు ఆలోచనలో పడ్డారు.
బాతు గుడ్డు తినడం మంచిది కానీ కోసేసుకోకూడదు అని అర్థం అయింది. ప్రభుత్వం ఇచ్చిన రేట్లే ఎక్కువ అని తెలిసివచ్చింది. అందుకే ఎఫ్ 3 సినిమాకు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లే అని ప్రచారం సాగించారు. అప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు కాస్త కిందా మీదా అయ్యారు.
ఎందుకుంటే ఆంధ్రలో 30 కోట్ల రేషియోలో విక్రయాలు సాగించారు. అవి రికవరీ కావాలంటే కాస్తయినా రేట్లు కాస్త వుండాలని అనుకున్నారు కానీ ఓపెనింగ్స్ చూసి పెంచకుండా వున్నారు.
ఇప్పుడు ఈ బాటలో మేజర్ సినిమా కూడా అదే బాటలో పయనిస్తోంది. టికెట్ రేట్ ను ఇంకా తగ్గించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసారు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ 150 మల్టీ ప్లెక్స్ లు 195 రేటు గరిష్టంగా ఫిక్స్ చేసారు. ఆంధ్రలో సింగిల్ స్క్రీన్ లు 147 మల్టీ ఫ్లెక్స్ లో 177 గరిష్టంగా ఫిక్స్ చేసారు. కోవిడ్ తరువాత ఇవే అతి తక్కువ రేట్లు అని యూనిట్ ప్రకటించింది.
చూస్తుంటె ఇక చిన్న, మీడియం సినిమాలు ఇదే దోవలో వెళ్లేలా కనిపిస్తోంది పరిస్థితి. రాను రాను చిన్న సినిమాలు బై వన్ గెట్ వన్ లాంటి స్కీములు కూడా పెట్టినా ఆశ్చర్యం లేదు.