చరిత్ర ప్రతిదీ రికార్డ్ చేస్తుంది. అందులో మంచీచెడూ ఉంటాయి. రాజకీయ పార్టీలు, నాయకులు, అధికారం, ప్రతిపక్ష హోదా అనేవి అశాశ్వతం. ఆయా వ్యక్తులు చేసే పనులు మాత్రం శాశ్వతంగా నిలుస్తాయి. మంచి చేస్తే గౌరవం, చెడైతే ఛీత్కారం తప్పవు. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. మహానాడు సభలో టీడీపీ చరిత్ర గురించి చంద్రబాబు గొప్పగా చెప్పారు. ఆ పార్టీ అధినేతగా చంద్రబాబు ఆ విధంగానే చెబుతారు, చెప్పాలి కూడా.
చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుందనేది ఆయన ఘనమైన అభిప్రాయం. మహానాడు తెలుగు జాతికి వేడుకగా అభివర్ణించారు. పసుపు రంగు చూస్తే చైతన్యం వస్తుందన్నారు. చరిత్ర వున్నంత వరకూ టీడీపీ ఉంటుందనే చంద్రబాబు మాటల్లో నిజం లేకపోలేదు. ఈ నిజంతో పాటు మరో నిఖార్సైన నిజం కూడా ఉంది.
టీడీపీ ఉన్నంత వరకూ ఎన్టీఆర్ గుర్తుంటారు. ఎన్టీఆర్ పేరు చెబితే చంద్రబాబు వెన్నుపోటును కూడా చరిత్ర తప్పక గుర్తు చేస్తుంది. అధికారం కోసం అంతటి ఎన్టీఆర్‌ను నడిబజార్లో చంద్రబాబు చెప్పులతో కొట్టించిన వైనాన్ని చరిత్ర ఇప్పటికే రికార్డు చేసింది.
టీడీపీ ప్రస్థానంలో ఈ కోణం ప్రత్యేకమైంది. టాలీవుడ్‌లో అగ్రనటుడిగా, తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని హస్తగతం చేసుకున్న ప్రజానాయకుడిగా ఎన్టీఆర్‌ను చరిత్ర ఎప్పటికీ గుర్తించుకుంటుంది. స్ఫూర్తిగా కొనియాడుతుంది. అంతేనా, సొంత అల్లుడి చేతిలో అధికారాన్ని పోగొట్టుకున్న దురదృష్టవంతుడిగా చరిత్ర కన్నీటి సిరాతో లిఖించింది.
పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన నాయకుడిగా చంద్రబాబుకు చరిత్ర మాయని మచ్చ మిగిల్చింది. ఒక్క మామనే కాదు, బామ్మర్ది నందమూరి హరికృష్ణ, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును కూడా వెన్నుపోటు పొడిచిన నాయకుడిగా చరిత్ర ఎప్పటికీ గుర్తు చేస్తూనే వుంటుంది.
కొడుకు కోసం మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్‌ను పాతాళంలోకి తొక్కిన నాయకుడిగా ఎన్టీఆర్ కుటుంబం మరిచిపోయినా, చరిత్ర మాత్రం లోకానికి చాటి చెబుతూనే వుంటుంది. చంద్రబాబు రాసిందే చరిత్ర కాదు. టీడీపీ చరిత్ర నాణేనికి మరోవైపు వెన్నుపోటు, వంచన, నమ్మక ద్రోహాలతో నిండి వుంది. వెన్నుపోటుకు పర్యాయపదంగా చంద్రబాబును చరిత్ర ఎప్పటికీ గుర్తు చేస్తూనే వుంటుంది.