ఏపీ అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అస్వస్థతకు గురయ్యారు. ఆ ఇద్దరు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. భూమన గురువారం నుంచి అనారోగ్యంతో బాధపడుతుండగా, కోటంరెడ్డి ఇవాళ గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లి అస్వస్థకు గురయ్యారు.
వ్యక్తిగత పని నిమిత్తం భూమన హైదరాబాద్ వెళ్లారు. గురువారం తెల్లవారుజామున ఆయనకు వాంతులయ్యాయి. ఆ తర్వాత కొంచెం ఆరోగ్యం కుదటపడింది. గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని మొదలు పెట్టేందుకు తిరుపతికి వెళ్లారు. కొంచెం నలతగా ఉండడంతో స్విమ్స్ ఆస్పత్రిలో చేరారు. నిన్నటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. ఫుడ్ ఇన్ఫెక్షన్ అయినట్టు సమాచారం.
ప్రస్తుతం ఆయన జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. స్విమ్స్‌లో ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. నీరసంగా ఉండడంతో ఎవరితోనూ ఆయన మాట్లాడ్డం లేదని సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి శుక్రవారం నియోజకవర్గంలో గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లారు. నలతగా ఉండడంతో ఆయన్ను వెంటనే నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు. హార్ట్‌బీట్ పల్స్ ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఎమ్మెల్యేలిద్దరూ త్వరగా కోలుకోవాలని వైసీపీ శ్రేణులు ప్రార్థిస్తున్నాయి.