Advertisement

Advertisement


Home > Movies - Reviews

F3 Review: మూవీ రివ్యూ: ఎఫ్ 3

F3 Review: మూవీ రివ్యూ: ఎఫ్ 3

టైటిల్: ఎఫ్ 3 
రేటింగ్: 2.75/5
తారాగణం: వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, రఘుబాబు తదితరులు
కెమెరా: సాయి శ్రీరాం
ఎడిటింగ్: తమ్మిరాజు
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
నిర్మాత: శిరీష్
దర్శకత్వం: అనిల్ రావిపూడి
విడుదల తేదీ: 27 మే 2022

జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ తరం తర్వాత పెద్ద హీరోలతో పూర్తి స్థాయి కామెడీ చిత్రాలు దాదాపు కనుమరుగైపోయాయి. కొన్నాళ్లు శ్రీను వైట్ల తన మార్కు కామెడీ పండించినా వాటిని పూర్తిస్థాయి కామెడీ సినిమాలనలేం. ఆ వాక్యూం ని 2019లో వచ్చిన ఎఫ్-2 అధిగమించగలిగింది. అనిల్ రావిపూడి తన శైలిలో సంపూర్ణ హాస్యభరిత చిత్రాన్ని అందించి ప్రేక్షకూల మెప్పు పొందాడు. 

సినిమా అంటే నవ్వుకోవడానికే తప్ప ఇంకేమీ కాదు..అనుకునే ప్రేక్షకులు చాలామంది ఉంటారు. యాక్షన్, రొమాన్స్ కంటే కామెడీకి ఎప్పుడూ వాళ్లు పెద్ద పీటే వెస్తారు.

గతంలో జంధ్యాల కూడా తన కామెడీ చిత్రాలకి వస్తున్న ఆదరణకి అప్పుడప్పుడూ కాస్త ఎక్కువగా సంతోషపడి ఆ ఊపులో మరీ అర్థం లేని కామెడీ సినిమాలు తీసి ఫ్లాపులు కూడా అందుకున్నారు. ఎంతటి వాళ్లు తీసినా కామెడీ అనేదానికి ఒక హద్దూ, అదుపూ ఉంటుంది. 

సరైన డోసులో ఉంటే కామెడీ నవ్విస్తుంది. కాస్త ఎక్కువైతే ఆ కామెడీయే నవ్వులపాలౌతుంది. 

కానీ ఫార్స్ కామెడీ జానర్లో ఎంత డోసు ఎక్కువైనా పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఆ దిశగా ఆడియన్స్ ని సెట్ చేసి కూర్చోబెట్టగలగాలంతే. 

"ఎఫ్-2" తో అందుకున్న విజయం వల్ల దర్శకుడు మరింత లిబర్టీ తీసుకుని ఈ స్క్రీన్ ప్లే రాసుకున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఇందులోని పాత్రలకి పొట్టలో ఎంత లోతులో కత్తులు, బల్లేలు దిగినా చావు రాదు. ఆ సంపూర్ణ అసహజత్వాన్ని కూడా కామెడీ పేరుతో స్వీకరించమన్నాడు. అన్నట్టు "సంపూర్ణ" అంటే సంపూర్ణేష్ బాబు గుర్తొచ్చాడు. కొబ్బరిమట్ట, హృదయకాలేయం సినిమాల్లో కూడా ఈ తరహా అసహజమైన సీన్లు ఫార్స్ కామెడీ జానర్లో ఒక స్థాయి ప్రేక్షకుల్ని అలరించాయి. 

"ఎఫ్-2" లో ఉన్న ప్రధాన పాత్రధారులంతా ఇందులో కూడా ఉన్నా ఆ సినిమాకి, దీనికి అసలు సంబంధం లేదు. అంటే ఇది "బాహుబలి-1", "బాహుబలి-2" మాదిరిగా కంటిన్యుటీ ఉన్న కథ కాదు. 

మొదటి భాగంలో ఉన్న పాత్రలతో రెండో భాగం పూర్తి స్వతంత్ర కథతో ముందుకెళ్తుంది. 

అయితే "ఎఫ్-2" చూసిన వాళ్లకి మాత్రమే కనెక్టయ్యే కొన్ని చిన్న చిన్న డయలాగ్స్, సన్నివేశాలు ఉన్నాయిందులో. 

వెంకటేశ్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. లుక్స్ తో కానీ, డ్యాన్సింగుతో కానీ ఎక్కడా పెద్దగా ఏజైనట్టు కనిపించలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ స్టార్ హీరోగా తన మార్క్ ని నిలబెట్టుకున్నారు. కానీ తన పాత్రకి ఇచ్చిన రేచీకటి ఎలిమెంట్ ని పెద్దగా వాడుకోలేదు. నిజానికి దాంతో కావల్సినంత కామెడీ రాసుకోవచ్చు. 

వరుణ్ తేజ్ నత్తి నటన బానే ఉంది. అయితే తన పాత్రకి ఎఫ్-2 లో ఉన్నంత ఇంపాక్ట్ అయితే ఇందులో లేదు. 

కంటికింపైన తమన్నా, మెహ్రీన్ తో పాటు ఇప్పుడు అదనంగా సోనాల్ చౌహాన్, పూజా హెగ్డే కూడా తెరమీద గ్లామరసాన్ని చిందించారు. 

రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ ట్రాక్ బాగుంది. కిషోర్ కొన్ని చోట్ల తన టైమింగుతో నవ్వించాడు. 

సత్య-సంపత్ ల ట్రాక్ కూడా చిన్నదే అయినా బాగుంది. 

మొత్తానికి ఇందులో పాత్రలన్నీ ఏదో విధంగా మోసపోతూనే ఉంటాయి. అందరూ తమని తాము తెలివైనవాళ్లమనుకునే అమాయికులే. అదే కామెడీకి కీ ఎలిమెంట్. 

అనిల్ రావిపూడి కేవలం నవ్వించడమే పరమావధిగా పెట్టుకుని గతంలో తాను చూసిన కొన్ని సినిమాల స్ఫూర్తితో చేతికొచ్చిన కథ రాసుకుపోయాడనిపిస్తుంది. ముఖ్యంగా మెహ్రీన్ ఓపెనింగ్ సీన్ చూస్తే "అసెంబ్లీ రౌడీ"లోని పాకీజా ట్రాక్ గుర్తొస్తుంది. అలాగే ధనవంతుడి ఇంటికి ఆస్తి కోసం తిరిగొచ్చే కొడుకుల ట్రాక్ చిరంజీవి "చంటబ్బాయి"లోదే. 

ఇలా ట్రాకుల్ని ఎత్తుకున్నా నడిపించిన విధానం మాత్రం పూర్తిగా అనిల్ రావిపూడి సొంతమే. 

ఓటీటీల బ్యాక్ డ్రాపులో డిజైన్ చేసిన క్లైమాక్స్ ఫైట్ కూడా సరదాగా సాగుతుంది. 

దేవీ శ్రీప్రసాద్ అందించిన పాటలు బాగానే ఉన్నాయి. 

చివర్లో మురళీశర్మ పాత్రతో డబ్బు గురించి, అత్యాస గురించి, ఆత్మహత్యల గురించి ఒక వ్యక్తిత్వ వికాస పాఠం కూడా చెప్పించాడు దర్శకుడు. ఫ్లోలోనే ఉంది కనుక పెద్దగా క్లాస్ పీకినట్టు అనిపించదు. 

ఇలా కామెడీ, గ్లామర్, సందేశం ..ఎవరిక్కావాల్సింది వాళ్లు తీసుకునే విధంగా ఒక కిచిడీ వండేసాడు. ఎవరికి కావాల్సింది వాళ్లు తీసుకుంటే పర్వాలేదు. కానీ మొత్తంగా రుచి చూసినప్పుడు కొందరికి గందరగోళంగా అనిపించొచ్చు. 

ఏది ఏమైనా "ఎఫ్-2" తో ఒక స్థాయి కామెడీని ఇచ్చిన దర్శకుడు ఈ సారి "ఎఫ్-3" పేరుతో ఇంకాస్త "అతి"ని జోడించాడు. ఈ "అతి"ని ప్రేక్షకులు పాజిటివ్ గా తీసుకుని "అతి"గా కలెక్షన్లు కురిపిస్తారా లేదా అనేది ఆగి చూడాలి. 

బాటం లైన్: "అతి"శయోక్తి కామెడీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?