నారా లోకేశ్… మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ముద్దుల పుత్రరత్నం. టీడీపీ ఆశాకిరణం. చంద్రబాబు తర్వాత పార్టీ బాధ్యతల్ని చేపట్టనున్న యువకిశోరం. విదేశాల్లో చదువుకున్న మేధావి. మాతృభాషపై కంటే పరాయిభాషపై పట్టున్న యువనేత. ప్రత్యర్థుల దృష్టిలో ఉప్పు, పప్పు, నిప్పు ఇలా ఏమైనప్పటికీ, టీడీపీ మాత్రం భవిష్యత్ వారసుడిగా గుర్తించింది. కాకి పిల్ల కాకికి ముద్దు అనే చందంగా, లోకేశ్‌పై ఎన్ని విమర్శలొచ్చినా… టీడీపీ అభిమానులు ఆయన్ను ప్రేమిస్తుంటారు.
అయితే రాజకీయాల్లో ఎంట్రీనే లోకేశ్‌పై బలమైన నెగెటివ్ ముద్ర వేసింది. ఇందుకు ప్రత్యర్థుల విమర్శలకు తోడు లోకేశ్ స్వీయ తప్పిదాలు కూడా లేకపోలేదు. కుల పిచ్చి, మతపిచ్చి, అవినీతి పార్టీ ఏదైనా ఉందంటే… అది టీడీపీనే అని లోకేశ్ తప్ప మరెవరైనా చెప్పగలిగే ధైర్యం చేస్తారా? టీడీపీ భవిష్యత్ సారథిగా తెరపైకి వచ్చిన లోకేశ్ ప్రసంగాలు, ప్రత్యర్థులకు ఆయుధాలయ్యాయి. అందుకే లోకేశ్‌పై సులువుగా విమర్శల దాడి చేయగలుగుతున్నారు.
తాజాగా టీడీపీకి కొత్త రక్తం ఎక్కిస్తానని చంద్రబాబు చెబుతుంటే, లోకేశ్‌లాంటి వాళ్లను మరింత మందిని తీసుకొస్తున్నారా? అనే ప్రశ్నలు ప్రత్యర్థుల వైపు నుంచి వినిపిస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్ వారసుడిగా కేటీఆర్… తండ్రికంటే బలమైన వాదన వినిపిస్తున్నారు. ఇప్పుడు ప్రతిదీ పోలిక పెట్టి చర్చిస్తున్నారు. వైఎస్సార్ తనయుడిగా జగన్ విజయవంతమైన రాజకీయ నాయకుడిగా నిరూపించుకున్నారు. ఇక ఫెయిల్యూర్ వారసులుగా తెలుగు రాష్ట్రాల్లో లోకేశ్, జాతీయస్థాయిలో రాహుల్‌గాంధీ గుర్తింపు పొందారు.
40 శాతం మంది యువకులకు సీట్లు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన వెనుక బలమైన కారణం ఉంది. భవిష్యత్‌లో తనయుడి వెంట నడిచే నమ్మకమైన లోకేశ్ టీంను చంద్రబాబు తయారు చేయాలనే వ్యూహం ఉంది. తండ్రిగా చంద్రబాబు ముందు చూపును అభినందించకుండా ఉండలేం. అయితే తండ్రి ఆలోచనల్ని పసిగట్టి, ఆయన అంచనాలకు తగ్గట్టు నడుచుకోవడంలో లోకేశ్ తడబడుతున్నారు. లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చిన మొదటి రోజులతో పోల్చితే, ఇప్పుడు ఎంతో మేలని ప్రత్యర్థులు కూడా అంగీకరించే విషయం.
లోకేశ్‌కు మొదటి ఓటమి గట్టి షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి మంగళగిరి నుంచి సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై నిలిచి, పోరాడి ఓడిపోయారు. పరువు పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని లోకేశ్ తహతహలాడుతున్నారు. మరోసారి అక్కడి నుంచే బరిలో దిగి, గెలుపును తండ్రికి గిఫ్ట్‌గా ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు.
పార్టీ కోసం పనిచేసే వాళ్లకే అవకాశాలు వస్తాయని మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుల్లో చాలా మంది వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. నిజానికి చంద్రబాబుది కూడా అదే పరిస్థితి. అయితే పార్టీకి బాబు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అన్నీ ఆయనే చూసుకోవాల్సిన దుస్థితి. మరోవైపు ప్రత్యర్థి పార్టీకి యువ నాయకుడు నాయకత్వం వహిస్తున్నారు. కొత్త తరం యువ నాయకత్వాన్ని కోరుకుంటోంది.
దశాబ్దాల తరబడి పదవులు పట్టుకుని వేలాడుతున్న నాయకుల్ని కొత్త తరం అంగీకరించే పరిస్థితి లేదు. తమ ఆకాంక్షలు, ఆలోచనలకు తగ్గట్టు నడుచుకునే నాయకులను యువతరం కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో టీడీపీకి యువ నాయకత్వం అవసరమని చంద్రబాబు గ్రహించారు. అందుకే 40 శాతం యువతకు సీట్లు కేటాయిస్తానని ఆయన చెప్పడం. అయితే వారసత్వంగా లోకేశ్ వచ్చినట్టే, మెజార్టీ యువనాయకత్వాన్ని చంద్రబాబు ప్రోత్సహిస్తారా? అనే చర్చకు తెరలేచింది.
లోకేశ్ నాయకత్వ సత్తా ఏంటో తెలిసిన వాళ్లు, కొత్తగా వచ్చే యువనాయకులు కూడా అలాంటి వాళ్లేనా? అని పెదవి విరుస్తున్నారు. అభిప్రాయాలు ఏవైనా టీడీపీలో లోకేశ్‌తో కలిసి వందలాది మంది యువనాయకులు నడవనున్నారు. చంద్రబాబు ఆశిస్తున్నట్టు యువశక్తి చంద్రబాబుకు అధికారాన్ని అందిస్తుందా?…ఈ ప్రశ్నకు కాలమే జవాబు చెప్పాల్సి వుంది.
సొదుం రమణ