ఈవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ విన్నర్ చంద్రబాబే..!

మహానాడులో కామెడీ షో చేస్తారనే విషయం తెలిసిందే. అయితే ఈసారి చంద్రబాబు కూడా నేరుగా కామెడీ మొదలుపెట్టారు. ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ విన్నర్ గా మారారు.  Advertisement అసలే పార్టీలో పోటీ చేసేందుకు…

మహానాడులో కామెడీ షో చేస్తారనే విషయం తెలిసిందే. అయితే ఈసారి చంద్రబాబు కూడా నేరుగా కామెడీ మొదలుపెట్టారు. ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ విన్నర్ గా మారారు. 

అసలే పార్టీలో పోటీ చేసేందుకు నాయకులు కరువైపోయిన స్థితిలో చంద్రబాబు 2024 అసెంబ్లీ టికెట్ల గురించి ప్రస్తావించారు. మన దగ్గర బేరాల్లేవమ్మా.. రికమండేషన్లు చేయొద్దని, పనిచేసే వారికే టికెట్లు ఇస్తానన్నారు. మరో అడుగు ముందుకేసి 40 శాతం టికెట్లు యువతకే కేటాయిస్తామన్నారు. 

యువత అంటే సోమిరెడ్డి, చినరాజప్ప, కళా వెంకట్రావు.. వీళ్లేనా అంటూ సోషల్ మీడియాలో ఆల్రెడీ చెడుగుడు మొదలైంది. అసలు చంద్రబాబే రిటైరైపోవచ్చు కదా, యువత అయిన తన కొడుక్కి ఆ అవకాశం ఇవ్వొచ్చుగా అని వెటకారం చేస్తున్నారు నెటిజన్లు.

బాబ్బాబు పోటీ చేయండి చాలు..

2019లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అందరం చూశాం. 2024లో టీడీపీ పరిస్థితి కూడా అదే కాబోతోంది. సరైన అభ్యర్థులు దొరకరనే విషయం తేలిపోయింది. కచ్చితంగా కొత్త మొహాలకు టికెట్లు ఇవ్వాల్సిందే. అందుకోసమే బాబు 40 శాతం టికెట్లు యువతకేనంటూ అసలు విషయం చెప్పేశారు. 

ఇక రికమండేషన్లు వద్దంటూ మరో జోక్ పేల్చారు. అసలు రికమండేషన్ చేయడానికి టీడీపీలో ఎవరైనా సీనియర్లు మిగలాలి కదా, మిగిలినా.. తమ వారి భవిష్యత్ కోసం పక్క పార్టీలోకి వెళ్లమంటారే కానీ, టీడీపీ తరపున టికెట్ ఇప్పించాలనే పిచ్చి ఆలోచన ఎవరూ చేయరు.

ఒకవేళ చేశారంటే.. కచ్చితంగా టికెట్ ని అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం కోసమే కాక ఇంకోటి కాదు. అభ్యర్థుల ఎంపికలో వారు పార్టీకి చేసిన సేవలు డాక్యుమెంటేషన్ చేస్తామని, సరైన స్థానంలో సరైన వ్యక్తులను ఉంచే ప్రయత్నం చేస్తామని, దానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అంటున్నారు చంద్రబాబు.

భ్రమల్లో  బాబు..

ఏపీ చరిత్ర టీడీపీకి ముందు టీడీపీ తర్వాత అని చదువుకోవాల్సి ఉంటుందని అన్నారు చంద్రబాబు. అక్కడి వరకు బాగానే ఉంది కానీ టీడీపీయే ఇప్పుడు చరిత్రలో కలిసిపోయింది. జగన్ రాకతో ఏపీ చరిత్ర మరో మలుపు తిరిగింది. 

ఇప్పుడు ఏపీ చరిత్ర జగన్ కి ముందు జగన్ తర్వాత, జగన్ పథకాలకు ముందు, వాటి అమలు తర్వాత.. అని చదువుకుంటున్నారు. ఇంకా చంద్రబాబు టీడీపీ బతికే ఉందనే భ్రమలో ఉన్నారు. మొత్తమ్మీద మహానాడులో నర్సిరెడ్డి లాంటివాళ్లు కామెడీ చేస్తారని అనుకున్నా.. తొలిరోజే చంద్రబాబు స్టాండప్ కామెడీ చేశారు. తన వన్ మేన్ పెర్ఫార్మెన్స్ తో జబర్దస్ట్ విన్నర్ గా నిలిచారు.