“చెప్పే వాడికి వినే వాడు లోకువ” అనే సామెత చందాన…టీడీపీ అధినేత చంద్రబాబుకు జనం అంటే అంత చులకన. గొప్పలు చెప్పుకోవడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. నిప్పులా బతికానని, అవినీతి మరక అంటలేదని, అలాగే తనకు సీఎం పదవిపై మోజు లేదని, ఉమ్మడి ఏపీలోనూ, విభజిత ఏపీలోనూ కలిపి అత్యధిక కాలం సీఎంగా తానే పని చేశానని చంద్రబాబు చెబుతుంటారు. సీఎంగా ఎక్కువ కాలం పనిచేశారనడంలో నిజం ఉంది. మరెవరైనా చంద్రబాబు గురించి ఇలాంటి పొగడ్తలు చేస్తే, ఆయనకు గౌరవంగా వుండేది. కానీ అలా జరగకపోవడంతో తన గొప్ప గురించి చంద్రబాబే చెప్పుకోవాల్సి వస్తోంది.
ఒంగోలులో మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. భారీగా హాజరైన నాయకులు, కార్యకర్తలను చూడగానే పూనకం వచ్చినవాడిలా చంద్రబాబు ఆవేశంతో ఊగిపోయారు. ప్రారంభ ఉపన్యాసంలో అధికార పార్టీపై చంద్రబాబు రెచ్చిపోయారు. మద్యం, గంజాయి ,డ్రగ్స్‌తో రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు సీఎం పదవి కొత్తకాదన్నారు. ఎక్కువ కాలం ఆ పదవిలో వుండే అవకాశాన్ని ప్రజలు ఇచ్చారన్నారు. కానీ రాష్ట్రం నాశనమైందనేదే తన ఆవేదన, బాధ అని చెప్పుకొచ్చారు. బాధల్లో వున్న ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై వుందని చంద్రబాబు అన్నారు.
ఇటీవల జగన్ ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి ప్రతిపక్ష పార్టీలు, అలాగే వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా తమతో కలిసొచ్చే పార్టీల కోసం త్యాగాలు చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమ నాయకుడిని సీఎం అభ్యర్థిగా అంగీకరిస్తే పొత్తుకు సిద్ధమని జనసేన నాయకులు టీవీ డిబేట్లలో ప్రకటించారు. 2014లో చంద్రబాబు సీఎం కావడానికి సహకరించామని, ఇపుడు తమకు తోడ్పాటు అందించాలని జనసేన డిమాండ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో తనకు సీఎం పదవి కొత్త కాదని చంద్రబాబు చెబుతుండడంతో, ఆ పదవికి తమ నాయకుడి పేరు ప్రకటించి, త్యాగానికి సిద్ధపడతారా? అని జనసేన నాయకులు మరోసారి ప్రశ్నిస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా తాను బాధ్యత తీసుకుంటానని పవన్‌కల్యాణ్ ప్రకటించారని, ఉమ్మడి శత్రువైన జగన్‌ను ఓడించాలంటే చంద్రబాబు సీఎం పదవిని వదులు కోవాలని మరోసారి పవన్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
సీఎం పదవిపై మోజు లేదంటూనే, మరోవైపు బాధల్లో వున్న ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై వుందని చెప్పడం ద్వారా మరోసారి ఆ పదవిని ఆకాంక్షిస్తున్నాననే సంకేతాల్ని చంద్రబాబు పంపారని టీడీపీ నాయకులు విశ్లేషిస్తున్నారు. కనీసం జనసేన అధినేతే గత ఎన్నికల్లో గెలవలేకపోయారని, అలాంటి వాళ్లకు సీఎం పదవి ఆశించే నైతిక హక్కు ఎక్కడిదని టీడీపీ నిలదీస్తోంది. ఆశకు కూడా హద్దు వుండాలని జనసేనకు టీడీపీ హితవు చెబుతోంది.