పేరుకే సంచలనం.. చెప్పుకోడానికే హై-ప్రొఫైల్ కేసు.. డ్రగ్స్ కేసుల్లో ఎండింగ్ ఎలా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఫలితం కూడా అందరూ ఊహించిందే. ఈ కేసు నుంచి షారూక్ కొడుకు ఆర్యన్ సచ్ఛీలుడిగా బయటపడ్డాడు. ఇన్నాళ్లూ ఏదో జరిగిపోతోందంటూ బిల్డప్ ఇచ్చిన ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అతడికి క్లీన్ చిట్ ఇచ్చేసింది.
ముంబయిలోని క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ వాడుతున్నట్టు అందిన పక్కా సమాచారంతో ఎన్సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకంగా 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లలో షారూక్ కొడుకు ఆర్యన్ ఖాన్ కూడా దొరికాడు. పట్టుబడిన వెంటనే ఆర్యన్ పాకెట్ లో డ్రగ్స్ ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఆ తర్వాత అతడు డ్రగ్స్ తీసుకోలేదన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అతడి దగ్గర ఏమీ దొరకలేదన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా కేసు నుంచి క్లీన్ చిట్ లభించింది.
దీన్ని హై-ప్రొఫైల్ కేసుగా పరిగణించి ప్రత్యేక దర్యాప్తు కమిటీ (సిట్) ఏర్పాటుచేశారు. అయితే సరైన సాక్ష్యాధారాలు లేవంటూ ఆర్యన్ తో పాటు ఆరుగురిపై అసలు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కీలక పరిణామాలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న టీమ్ లోని ఇద్దరు కీలక వ్యక్తుల్ని ఎన్సీబీ ఆమధ్య పక్కకు తప్పించింది. ఆ వెంటనే ఆర్యన్ కు క్లీన్ చిట్ రావడం గమనార్హం.
ఈ కేసులో 28 రోజుల పాటు జైల్లో ఉన్నాడు ఆర్యన్ ఖాన్. అతడికి బెయిల్ దొరికినప్పుడు లాయర్ల బృందానికి షారూక్ ఖాన్ పెద్ద పార్టీ ఇచ్చాడు. ఇక క్లీన్ చిట్ రావడానికి కొన్ని గంటల ముందు, కరణ్ జోహార్ ఇచ్చిన బర్త్ డే పార్టీలో ఆర్యన్ ఖాన్ హుషారుగా కనిపించాడు. డాన్స్ ఫ్లోర్ పై తన తండ్రి పాటలకు డాన్స్ కూడా చేశాడు.