కార్యకర్తల్ని కొట్టడం జన్మహక్కుగా టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భావిస్తుంటారు. బాలయ్య పర్యటనలో అభిమానులు, కార్యకర్తలు దూరంగా ఉంటుంటారు. ఎందుకంటే ఆయనకు ఎప్పుడు కోపం వస్తుందో, ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు. ఎందుకైనా మంచిది, మనమే జాగ్రత్తగా ఉందామని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అనుకుంటుంటారు.
అలాంటి బాలయ్య తన పార్టీ కార్యకర్తలపై ఎవరైనా చేయి వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించడం గమనార్హం. బాలయ్యపై సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. ఇవాళ ఆయన హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వైసీపీ దాడిలో గాయపడ్డ చిలమత్తూరు మండలం కొడికొండ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు నర్సింహమూర్తి, రవిలను బాలయ్య పరామర్శించారు. ధైర్యం చెప్పారు.
బాలయ్య మాట్లాడుతూ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునే ప్రశ్నే లేదని హెచ్చరించారు. ఖబడ్దార్ అంటూ తన మార్క్ సినిమా డైలాగ్లు చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు కష్టం వస్తే అర్ధరాత్రైన సరే వస్తానని హామీ ఇచ్చారు. హిందూపురంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులకు మీ వల్లే ప్రమాదం పొంచి వుందని బాలయ్యపై సోషల్ మీడియాలో వ్యంగ్యోక్తులు వెల్లువెత్తుతున్నాయి.
గత ఏడాది మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలయ్య 9వ వార్డు అభ్యర్థి ఇంటికెళ్లిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. కార్యకర్తలతో మాట్లాడుతుంటే ఓ అభిమాని వీడియో తీస్తుండగా బాలయ్య చెంప ఛెళ్లమనిపించడాన్ని నెటిజన్లు తెరపైకి తెచ్చి ట్రోల్ చేయడం విశేషం.
గతంలో హిందూపురంలో రెండు మూడు సందర్భాల్లోనూ, అలాగే కర్నూలు ఎన్నికల ప్రచారంలోనూ బాలయ్య ఇదే విధంగా అభిమానులు, టీడీపీ కార్యకర్తలపై చేయి చేసుకోడాన్ని ప్రత్యర్థులు ప్రస్తావిస్తున్నారు.
బాలయ్యా… టీడీపీ కార్యకర్తలకే తమరి వల్లే అసలు సమస్య అంటూ వెటకరిస్తున్నారు. మీ చేతిలో దెబ్బతిన్న వాళ్లకు ఏమని భరోసా ఇస్తావో చెప్పు హీరో అంటూ నెటిజన్లు సెటైర్లు విసరడం ఆకట్టుకుంటోంది.