కోనసీమలో విధ్వంసాన్ని ఖండించే క్రమంలో వైసీపీ సీనియర్ నేత, రాష్ట్ర సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్‌రావు నోరు జారారు. పార్టీకి నష్టం కలిగించే రీతిలో శెట్టిబలిజల సామాజిక వర్గంపై జూపూడి నోరు పారేసుకున్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి జూపూడి ప్రభాకర్‌రావు తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పారు.
కోనసీమలో కాపులు, శెట్టిబలిజల మధ్య దశాబ్దాల తరబడి వైరం ఉంది. జనసేనకు కాపులు అండగా నిలిచినా, శెట్టిబలిజలు వైసీపీ వైపు వుంటారనే వ్యూహంలో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆ సామాజిక వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాల్‌కు రెండోసారి కూడా మంత్రి పదవి ఇచ్చారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం తీవ్ర వివాదానికి దారి తీసింది.
పాలక ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో జూపూడి ప్రభాకర్‌రావు మీడియాతో మాట్లాడుతూ కోనసీమలో శెట్టిబలిజలు కూడా అంబేద్కర్ పేరును సహించలేని ఒక తరం వచ్చిందా? అని ప్రశ్నించారు. అంతటితో ఆయన ఊరుకుంటే సరిపోయేది.
అక్కడ శెట్టిబలిజలు, ఎస్సీలు బ్రహ్మాండంగా కలిసి వుంటారంటూనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు అందిన సమాచారం మేరకు శెట్టిబలిజల్లో కొందరు మంత్రి ఇల్లు తగలబెట్టడం లాంటి దుశ్చర్యకు దిగారన్నారు. ఇలాంటి వాళ్లు స్పృహలో లేరని, గంజాయి లేదా మందైనా తాగి ఉంటారని విమర్శించారు. లేకపోతే మరో రకమైన మత్తులో అయినా ఉంటారని శెట్టిబలిజల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కోనసీమలో తయారైన దరిద్రులుగా భావిస్తున్నట్టు ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
జూపూడి వ్యాఖ్యలపై శెట్టిబలిజల మనోభావాలు దెబ్బతిన్నట్టు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పసిగట్టారు. దీంతో నష్టనివారణ చర్యలు చేపట్టారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ జూపూడి వ్యాఖ్యలు తమ సామాజిక వర్గం మనోభావాలను పూర్తిగా కలచివేసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూపూడి వ్యాఖ్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. జూపూడి నుంచి క్షమాపణ డిమాండ్ చేస్తున్నామన్నారు. తమ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడ్డం సరికాదన్నారు.
అధిష్టానం ఆదేశాలో లేక తనకు తానుగా జూపూడి రియలైజ్ అయ్యారో తెలియదు కానీ, మీడియా ముందుకొచ్చారు. శెట్టిబలిజల్లో కొందరు మత్తులో ఉన్నారనే తన వ్యాఖ్యలు ఆ సామాజిక వర్గం బాధపడినట్టు తెలిసిందన్నారు. తన మాటలకు ఎవరైనా బాధ పడి ఉంటే వైసీపీ, అలాగే వ్యక్తిగతంగా తన తరపున సంపూర్ణంగా క్షమాపణలు అడుగుతున్నట్టు జూపూడి తెలిపారు. క్షమాపణతో శెట్టిబలిజలు శాంతించడమే మంత్రి వేణుగోపాల్‌కు కావాల్సింది.