కేసీఆర్ కు మోడీపై కక్షా? మొహం చూడాలంటే భయమా?

ఉమ్మడి ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయ చాణక్యుడు అనేవారు. తరువాత తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను అన్నారు. కానీ ఇప్పుడు ఇద్దరి రాజకీయ చాణక్యం పనిచేయడంలేదు. బాబులో ఇదివరకున్న పదును, అదును ఇప్పడు…

ఉమ్మడి ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయ చాణక్యుడు అనేవారు. తరువాత తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను అన్నారు. కానీ ఇప్పుడు ఇద్దరి రాజకీయ చాణక్యం పనిచేయడంలేదు. బాబులో ఇదివరకున్న పదును, అదును ఇప్పడు లేవు. సేమ్ కేసీఆర్ కూడా అలాగే ఉన్నారు. ఇక కేసీఆర్ విషయానికొస్తే ఆయనది మేకపోతు గాంభీర్యం అనేది జనాలకు అర్ధమైపోయింది. సాధారణంగా మామూలు ప్రజలు ఎవరినైనా తమ బంధువులనో, పడనివారినో తిట్టాలంటే ఇంట్లో కూర్చొని తిడతారు. కానీ వారి ఎదురుగా తిట్టరు. ఇది సాధారణంగా ప్రతి ఇంట్లో జరిగే తంతే. కేసీఆర్ కూడా ఇదే టైపని అర్ధమైంది. 

మామూలు రోజుల్లో అంటే పార్టీ సమావేశాల్లోనే, ఇతర సభల్లోనో ప్రధాని మోడీని ఇష్టం వచ్చినట్లు తిడతారు. రాష్ట్రానికి తానేం చేశానో చాలా గొప్పగా చెబుతారు. గత ఎనిమిదేళ్లుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి నయా పైసా సహాయం లేదని అంటారు. ఆయన దారిలోనే మంత్రులు, ఇతర నాయకులూ నడుస్తుంటారు. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఏదైనా సందర్భంలో మోడీ రాష్ట్రానికి వస్తే చాలు కేసీఆర్ ఆయనకు ఎదురు పడకుండా లేదా మొహం చూపించకుండా ఏదో పర్యటన పేరుతో వెళ్ళిపోతారు. ఎటూ పోకపోతే ఒంట్లో బాగాలేదని చెప్పి ప్రగతి భవన్లోనో, ఫామ్ హౌస్ లోనో ఉండిపోతారు. ఈ ధోరణిని ఎలా అర్ధం చేసుకోవాలి ? అంటే మోడీపై కక్ష సాధింపా లేదా ఆయనకు  ఎదురుపడాలన్న, మొహం చూడాలన్న భయమా ? అర్ధం కావడంలేదు.

రాజకీయ చాణక్యుడిగా పేరు పొందిన కేసీఆర్ లో ఇంత పిరికితనముందా? ముచ్చింతల్ లో రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించాడానికి మోడీ వచ్చినప్పుడు స్వాగతం పలకలేదు. ముచ్చింతల్ కు వెళ్ళలేదు. చివరకు తన అభిమాన గురువు చినజీయర్ స్వామిని కూడా దూరం పెట్టారు. మోడీ మీద కోపంతో గవర్నర్ తమిళిసైని కూడా దూరం పెట్టారు. 

తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవానికి మోడీ వస్తే వెంటనే బెంగళూరుకు వెళ్లిపోయారు కేసీఆర్. అంతకు ముందు రోజే ఢిల్లీ నుంచి వచ్చారు. కానీ మళ్ళీ వెంటనే జాతీయ రాజకీయాలు మాట్లాడటానికి కొంపలు మునిగిపోయినట్లు ఆగమేఘాలమీద బెంగళూరు వెళ్లిపోయారు. వాస్తవానికి బెంగళూరు నుంచి రాలేగావ్ సిద్ది వెళ్లి అన్నా హజారేను కలుస్తారని, ఆ తరువాత షిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. 

కానీ మోడీ వెళ్ళిపోగానే పర్యటనను రద్దు చేసుకొని హైదరాబాదుకు బయలుదేరారు. దీన్నిబట్టి ఏం అర్ధమవుతోంది? కేవలం మోడీకి మొహం చూపించడం ఇష్టం లేకనే బెంగళూరుకు వెళ్లారు. పోనీ అక్కడికి వెళ్లి ఏం ఘనకార్యం చేశారయా అంటే ఏమీలేదు. కేంద్రంలో మార్పు వస్తుంది. ఇది జరిగి తీరుతుంది. రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారని జోస్యం చెప్పారు. ఆయన చెప్పిన దానికి ఆధారాలేమిటో తెలియదు. కేసీఆర్ జాతీయ రాజకీయాలు మొదటి నుంచి కొండని తవ్వి ఎలుకను పెట్టినట్లుగా ఉన్నాయి. మోడీ హైదరాబాదు నుంచి చెన్నై వెళ్లారు.

అక్కడి ముఖ్యమంత్రి స్టాలిన్ కు కూడా మోడీ అంటే పడదు. కారణం తెలియదుగానీ చెన్నైలో ఆయన కూడా మోడీకి స్వాగతం పలకలేదు. కానీ మోడీ పాల్గొన్న సభలో స్టాలిన్ పాల్గొన్నారు. ప్రధాని సమక్షంలోనే తమ ప్రభుత్వ విధానాల గురించి చెప్పారు. అంతటితో ఊరుకోకుండా కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని కుండబద్దలు కొట్టారు. అదీ స్టాలిన్ ధైర్యం. కేసీఆర్ అలా ఎందుకు వ్యవహరించలేకపోతున్నారు? రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని మొహం మీదనే చెప్పొచ్చుగా. అలా చెప్పలేని కేసీఆర్ ధైర్యవంతుడు ఎలా అవుతారు?