తెలంగాణలో జులై 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. నేరుగా తరగతి గది బోధన చేపట్టాలని చూసినా, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఒత్తిడితో కేవలం ఆన్ లైన్ క్లాసులే మొదలయ్యాయి. ఇటు ఏపీలో కూడా జులై 1 నుంచి ప్రభుత్వ స్కూల్స్ తెరిచినా విద్యార్థులకు మాత్రం క్లాసులు మొదలు పెట్టలేదు. కేవలం టీచర్లు మాత్రమే రోజు విడిచి రోజు స్కూల్స్ కి వస్తున్నారు.
పిల్లలకు ఇవ్వాల్సిన హోమ్ వర్క్ ప్రిపేర్ చేయాల్సిందిగా వీరికి విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. అయితే పిల్లల్ని నేరుగా స్కూళ్లకు పిలవకుండా, కేవలం తల్లిదండ్రుల్ని పిలిపించి వారికి వర్క్ షీట్లు ఇచ్చే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న విద్యాకానుక లాంటి పథకాల అమలు కోసం ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆగస్ట్ లో కొత్త అకడమిక్ ఇయర్..
మరోవైపు టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు కావడంతో వాటికి సంబంధించి మార్కులు ప్రకటించే దిశగా విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. మార్కుల కేటాయింపుకి సంబంధించి హైపవర్ కమిటీ ఏర్పాటు చేశామని, 3-4 రోజుల్లో ఆ కమిటీ నివేదిక వస్తుందని చెప్పారు మంత్రి ఆదిమూలపు సురేష్.
విద్యార్థుల భవిష్యత్ కి ఇబ్బంది లేకుండా మార్కులు ప్రకటిస్తామని చెప్పారు. జులై నెలాఖరులోగా ఫలితాలు ప్రకటించి, ఆగస్ట్ లో సెట్ ఎగ్జామ్స్ పూర్తి చేస్తామని చెప్పారు. ఆగస్ట్ రెండో వారం నుంచి కొత్త అకడమిక్ ఇయర్ మొదలవుతుందని చెప్పారు మంత్రి.
ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట..
అకడమిక్ ఇయర్ ఆలస్యమైనా, కేవలం ఆన్ లైన్ క్లాసులే నిర్వహించినా.. ప్రైవేట్ స్కూల్స్ మాత్రం ఫీజుల వసూళ్లలో ఏమాత్రం కనికరం చూపించవు. అయితే ఈ దఫా అలాంటి స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి ఆదిమూలపు సురేష్.
కేవలం ఆన్ లైన్ క్లాసులే జరిగి, తరగతి గదిలో క్లాసులు నిర్వహించలేని పరిస్థితులు ఉంటే.. 70 శాతం మాత్రమే ఫీజులు తీసుకోవాలని సూచించారు. రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ నిర్ణయాల మేరకే ప్రైవేటు స్కూల్స్ ఫీజులు తీసుకోవాలని స్పష్టం చేశారు.