గత వారం రోజులుగా వార్తల్లో ప్రముఖంగా వినిపించిన పేరు గోరంట్ల మాధవ్. ఆయన చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై అనంతపురం ఎస్పీ ఫకీరప్ప బుధవారం క్లారిటీ ఇచ్చారు. అది ఒరిజినల్ వీడియో కాదని తేల్చి చెప్పారు.
ఇక అప్పటి నుంచి ఆయనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఇది పోలీస్, ప్రభుత్వం మధ్య సమన్వయ లోపాన్ని బయట పెట్టింది.
ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని స్వయంగా హోంశాఖ మంత్రి వనిత చెప్పారు. పంపలేదని అనంతపురం ఎస్పీ వివరణ ఇచ్చారు. తన వీడియో ఫేక్ అని, అధికారికంగా తేల్చాలని ఎస్పీకి ఫిర్యాదు ఇచ్చినట్టు గోరంట్ల మాధవ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోరంట్ల ఉదంతం, ఎస్పీ ప్రెస్మీట్లో చెప్పిన అంశాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తనదైన శైలిలో సెటైర్లు విసిరారు.
అనంతపురం ఎస్పీ కొండను తవ్వి ఎలుకను పట్టారని విమర్శించారు. ఈ విషయంలో ఆయనకు ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్డ్‌మెడల్ ఇస్తే బాగుంటుందని వెటకరించారు. ఎస్పీ ప్రకటన గందరగోళానికి గురి చేసిందన్నారు.
తన వీడియోను మార్ఫింగ్ చేశారని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ మాధవ్ ఫిర్యాదు ఇచ్చారన్నారు. అయితే ఫిర్యాదు ఇవ్వలేదని ఎస్పీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మాధవ్ కేసును ఎటూ తేల్చలేక ఎస్పీ చేతులెత్తేశారని రామకృష్ణ విమర్శించారు.