ఎన్నికల్లో రాజకీయ పార్టీల హామీలు, జవాబుదారీతనంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే, ఆ పార్టీల గుర్తింపును రద్దు చేయడం తగదని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆ కారణంతో గుర్తింపు రద్దు చేయాలని కోరడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని ఆయన ఘాటు వ్యాఖ్య చేశారు.
విచారణలో బాగంగా రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు అంశంలోకి వెళ్లదలుచుకోలేదన్నారు. ఆ ఆలోచనే అప్రజాస్వామిక మైందన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని ఆయన గుర్తు చేశారు. అయితే ఎన్నికల్లో ఉచిత హామీలు ఇవ్వడం మాత్రం తీవ్రమైన అంశంగా ఆయన పేర్కొన్నారు. చట్టపరమైన అడ్డుకట్ట పడేవరకు జోక్యం చేసుకోలేమన్నారు. ఎందుకంటే శాసన వ్యవస్థ నిర్ణయాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటోందనే అపవాదు ఇప్పటికే ఉందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
ఎన్నికల్లో ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు రెండూ వేర్వేరు అంశాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ఉచిత హామీలు, అలాగే సంక్షేమ పథకాల మధ్య సమతుల్యతను సాధించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందుకే వీటిపై చర్చిస్తున్నట్టు పేర్కొంది. మంచి జరిగే దిశగా ఆలోచనలు, సూచనలను తన రిటైర్‌మెంట్‌లోపు చెప్పాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేశారు.
ఈ నెల 26న ఎన్వీ రమణ పదవీ విరమణ చేయనున్నారు. రాజకీయ పార్టీలు ఉచిత పథకాల పేరుతో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అంశాన్ని ఎన్వీ రమణ సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై తన రిటైర్మెంట్ లోపు కీలక తీర్పు ఇవ్వాలని ఆయన సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.