కాంగ్రెస్ పార్టీని వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓ ఆట ఆడుకుంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమవుతోంది. మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు సవాల్‌గా మారింది. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టారనే కోపంతో రాజగోపాల్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి విమర్శల దాడి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డిని ప్రముఖ హాస్య రాజకీయ నాయకుడు కేఏ పాల్‌తో రేవంత్‌రెడ్డి పోల్చడం విశేషం. కేఏ పాల్ ఉన్నట్టు మనకు ఆర్‌జీ పాల్ వచ్చారని రేవంత్‌రెడ్డి సెటైర్లు విసిరారు. ఆర్‌జీ పాల్ అంటే రాజగోపాల్ అని రేవంత్ చమత్క రించారు. (కేఏ పాల్‌ను రాజకీయాల్లో కమెడియన్‌గా చూస్తున్నట్టుగా, రాజగోపాల్‌రెడ్డిని అదే విధంగా చూపాలని రేవంత్ ప్రయత్నం) బీజేపీతో టీఆర్ఎస్ అవగాహనతోనే మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన వెంటనే రాజగోపాల్ రాజీనామా చేశారని ఆయన గుర్తు చేశారు.
రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన ఐదు నిమిషాల వ్యవధిలోనే స్పీకర్ ఎలా ఆమోదిస్తారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలకు అంత అత్యవసరం ఏముందని ఆయన నిలదీశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్‌కు, అలాగే మునుగోడు బీజేపీకి అవసరమని ఆయన అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పరస్పరం ఒకరి అవసరాలు మరొకరు తీర్చుకుంటున్నారని విమర్శించారు.
ఇదిలా వుండగా ఈ నెల 21న మునుగోడులో బీజేపీ బహిరంగ సభకు దీటుగా కాంగ్రెస్ కూడా నిర్వహించాలని నిర్ణయించు కుంది. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్ కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు ఆ పార్టీ నేతల వైఖరి తెలియజేస్తోంది.