ఆ కేసు ఎదుర్కోడంలో జనసేనాని పవన్‌కల్యాణ్ తర్వాత ఎంపీ గోరంట్ల మాధవే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకూ ఆ కేసు సంగతేంటో తెలుసుకుందాం. గత నాలుగేళ్లలో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ పరువు నష్టం దావా వేయడం బహుశా ఇది రెండోది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రీతిలో జనసేనాని పవన్‌కల్యాణ్‌పై రాధాకృష్ణ పరువు నష్టం దావా వేశారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్‌పై వేయడం చర్చనీయాంశమైంది.
అయితే అప్పుడు పవన్‌కల్యాణ్‌పై, ఇప్పుడు గోరంట్ల మాధవ్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం జరిగిందని దావా వేయడం ఆసక్తికర పరిణామం. నాలుగేళ్లలో రాధాకృష్ణ పరువులో ఎలాంటి మార్పు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తన తల్లి, కుటుంబ సభ్యులపై రాధాకృష్ణ మీడియాలో కించపరిచే డిబేట్లు, రాతలు రాస్తున్నారంటూ ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో చంద్రబాబును వ్యతిరేకించి పవన్‌కల్యాణ్ వామపక్షాలతో కలిసి నడుస్తున్న సమయం. చంద్రబాబు పల్లకి మోయలేదనే అక్కసుతో పవన్‌ను నాడు ఎల్లో మీడియా టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరంపరలో తనపై పవన్ ఆరోపణలను జీర్ణించు కోలేక పరువు పోయిందంటూ రాధాకృష్ణ కోర్టును ఆశ్రయించారు.
తాజాగా గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం మరోసారి పరువు నష్టం దావాకు దారి తీసింది. మాధవ్ వీడియో ఒరిజినల్ కాదని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తేల్చి చెప్పారు. దీంతో గోరంట్ల మాధవ్ మీడియా ముందుకొచ్చి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై నోటికొచ్చినట్టు తిట్టారు. ఈ నేపథ్యంలో తనను అసభ్యపదజాలంతో, వ్యక్తిగత దూషణలకు దిగిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేసేందుకు రాధాకృష్ణ సిద్ధమయ్యారు. అంతేకాదు, క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో దావా వేయాలని నిర్ణయించుకున్నట్టు సొంత పత్రిక ప్రకటించింది.
పరువు నష్టం దావాలు వేయడం వరకూ ఓకే. 2018, ఏప్రిల్‌లో జనసేనాని పవన్‌కల్యాణ్‌పై రాధాకృష్ణ వేసిన రూ.10 కోట్ల పరువు నష్టం దావా ఏమైందనే ప్రశ్నలొస్తున్నాయి. పరువు తిరిగి వచ్చిందా? లేక పవన్ నష్టపరిహారం చెల్లించారా? అసలా దావా ఏమైందంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పాపం చంద్రబాబు కోసం ఆర్కే పరువు పోగొట్టుకోడానికి కూడా వెనుకాడరనే సెటైర్స్ ప్రత్యక్షమయ్యాయి.