జనసేన వ్యూహకర్తలు అందరూ తమ మేథకు పదును పెడుతున్నారు. జాతీయ రాజకీయాల్లో పరిణామాలు ఎలా జరుగుతున్నాయో.. ఏం జరుగుతున్నాయో.. చాలా నిశితంగా గమనిస్తున్నారు. ఎన్డీయే కూటమినుంచి నిజాయితీగల నాయకుడిగా పేరున్న నితీశ్ కుమార్ దూరం జరగడం, దాని పర్యవసానాలను పరిశీలిస్తున్నారు.
మోడీ కి మచ్చ వచ్చేలాగా.. ఒక మంచి నాయకుడు కటీఫ్ చెప్పి వెళ్లిపోయిన తర్వాత.. కమలదళం ప్రతిస్పందన ఎలా ఉంటుందో బేరీజు వేస్తున్నారు. రేపు తాము కూడా నితీశ్ తరహాలో.. ఎన్డీయేకు రాంరాం చెబితే ఏం జరుగుతుందో, దానికి ఎలా సిద్ధం కావాలో అంచనావేసే పనిలో ఉన్నారు.
తెలుగునాట తనకు ఉండే ప్రజాబలానికి ఒంటరిగా రాజకీయం చేయడం అనేది వల్లకాని పని అని పవన్ కు మూడేళ్ల కిందటే బోధపడింది. ఎన్నికల వేళ చంద్రబాబు చేతగానితనాన్ని తూర్పారపట్టిన నోటితో, వెంటనే పొగడలేక, అలాగని ఒంటరిగా ఉండడంలోని ఉక్కపోతను భరించలేక పవన్ వెళ్లి కమలంజట్టులో కలిసిపోయారు. వారితో పొత్తులతోనే 2024 ఎన్నికలకు వెళ్తే.. తన పార్టీ మరింత అధ్వానం అయిపోతుందనే భయం ఆయనకు పట్టుకున్నట్టుంది. కొంతకాలంగా చంద్రబాబు పాట పాడుతున్నారు.
ఢిల్లీలో మోడీతో జరిగిన భేటీ గురించి చంద్రబాబు ఎలాగైనా ప్రచారం చేసుకుంటూ ఉండవచ్చు గాక.. కానీ.. ఏపీలో తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి బిజెపి ఒప్పుకుంటుందనే మాట కల్ల. కానీ, పవన్ కల్యాణ్ మాత్రం మానసికంగా చంద్రబాబు పల్లకీ మోయడానికి సిద్ధమైపోయారు. ఇప్పుడు ఆయన ముందున్న తక్షణ కర్తవ్యం.. బిజెపి కూటమినుంచి బయటకు రావడం!
అదే ఎలా? అనేది ఆయనకు పెద్ద ప్రశ్న! బిజెపితో కటీఫ్ చెప్పడానికి ఆయనకు ఇదివరకే మంచి అవకాశాలు వచ్చాయి.
విశాఖ ఉక్కు ప్రెవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ ఉద్యమించిన రోజునే.. ప్రెవేటీకరిస్తే బిజెపితో మైత్రి ఉండదనే హెచ్చరిక చేసి ఉంటే ఆయన హీరో అయ్యేవారు. ఆ అవకాశం మిస్ చేసుకున్నారు. తీరా ఇప్పుడు నితీశ్ కూటమినుంచి వెళ్లిపోయిన తర్వాత.. పవన్ కు మరో అవకాశం వచ్చినట్టే. బిజెపి విభజన రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రాంతీయ పార్టీలను రూపుమాపడానికి చూస్తున్నదని, మహారాష్ట్ర, బీహార్ అనుభవాలు ఇందుకు నిదర్శనాలు అని.. అందువల్ల బిజెపి కూటమిలో ఉండదలచుకోవట్లేదని చెప్పి బయటకు రావచ్చు. ఇది రైట్ టైం అని పలువురు భావిస్తున్నారు.
ఈ సమయం మించిపోతే.. మళ్లీ బిజెపి మీద ప్రజలు నమ్మగలిగే నిందలు వేయడానికి, పవన్ కు అవకాశం దొరుకుతుందో? లేదో? ఆయన ఆలోచించుకోవాలి. మంచి తరుణం మించిపోతే, ఖచ్చితంగా దొరకదు.