ఇటీవల కుప్పం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. తనకు పులివెందుల ఎంత ముఖ్యమో, అదే స్థాయిలో కుప్పాన్ని కూడా చూసుకుంటానని జగన్ అన్నారు. కుప్పాన్ని అభివృద్ధి చేసి చూపుతానని, వైసీపీ అభ్యర్థి భరత్‌ను గెలిపించాలని కార్యకర్తలను జగన్ కోరారు. జగన్ చెప్పినట్టుగానే కుప్పం మున్సిపాలిటీకి రూ.66 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయడం చర్చనీయాంశమైంది.
25 వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం గతంలో రూ.67 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదనల్లో కంటే కోటి రూపాయలు తక్కువగా నిధులను జగన్ ప్రభుత్వం మంజూరు చేసి ప్రశంసలు అందుకుంటోంది. కుప్పం మున్సిపాల్టీని వైసీపీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కుప్పంలో వైసీపీ గెలుపు బాధ్యతల్ని భుజాన వేసుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ నిధులను ఖర్చు చేసి, అక్కడి ప్రజల మన్ననలు పొందేలా ఎలా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
సంక్షేమ పథకాలకు మినహాయించి, ఏపీ ప్రభుత్వం అభివృద్ధి పనులకు బటన్ నొక్కడాన్ని మరిచిందనే విమర్శ వుంది. ఈ నేపథ్యంలో కుప్పం మున్సిపాలిటీకి ఏకంగా రూ.66 కోట్లు విడుదల చేయడం సంచలనమే. ఒక రకంగా చంద్రబాబు అక్కడ ప్రాతినిథ్యం వహించడం వల్లే జగన్ అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. కుప్పం మున్సిపాలిటీలో మురుగునీటి కాలువలు, తాగునీటి వసతి, రోడ్లు, డ్రైనేజీ తదితర కనీస అవసరాలను తీర్చేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు.
ఈ నిధులను సక్రమంగా వినియోగిస్తే మాత్రం కుప్పం పంట పండినట్టే. చంద్రబాబు హయాంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుప్పంలో నిధులను దుర్వినియోగం కాకుండా ఇప్పటికే ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కార్యాచరణ రూపొందించినట్టు సమాచారం. జగన్ ఇచ్చిన మాట ప్రకారం నిధుల మంజూరులో వేగాన్ని చూస్తే …కుప్పాన్ని సీఎం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతోంది.