తెలుగుదేశం పార్టీకి మంగళగిరికి చెందిన ఆ పార్టీ నాయకుడు గంజి చిరంజీవి బిగ్ షాక్ ఇచ్చారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన బుధవారం రాజీనామా చేశారు. 2014లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఆయన టీడీపీ తరపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీలోనే కొనసాగుతూ విధేయత చాటుకున్నారు.
2019లో చివరి వరకూ గంజికే టికెట్ అంటూ టీడీపీ ఆశ చూపింది. కానీ లోకేశ్‌కు టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఆళ్ల చేతిలో లోకేశ్ పరాజయాన్ని చవి చూశారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో బలమైన ఓటు బ్యాంక్ కలిగిన చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి రాజీనామా టీడీపీకి భారీ షాక్ అని చెప్పక తప్పదు. రాజీనామా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు.
టీడీపీ బీసీల పార్టీ అని అందులో చేరానన్నారు. అయింతే నేతిబీరకాయలో నెయ్యి ఉండదనేది ఎంత నిజమో, టీడీపీలో బీసీలకు చోటు లేదనేది కూడా అంతే వాస్తవమన్నారు. టీడీపీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశానన్నారు. కానీ ఆ పార్టీలో తనను మానసికంగా హత్య చేశారని సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నేత కావడం వల్లే అవమానించారని వాపోయారు.
మంగళగిరి నియోజకవర్గం మొదటి నుంచి చేనేతలకు సంబంధించిందన్నారు. అయితే ఆ ఒక్క సీటును తన కుమారుడు లోకేశ్ కోసం లాక్కున్నారని మండిపడ్డారు. తద్వారా తమకు ద్రోహం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో చివరి వరకు సీటు నీదే అని తనకు చెప్పి మోసగించారన్నారు. ఏ పార్టీలో చేరేది త్వరలో చెప్తానని ఆయన అన్నారు. 2024లో మంగళగిరి నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే లోకేశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
గంజి చిరంజీవి రాజీనామాతో ఆ సామాజిక వర్గంలో టీడీపీ బలం తగ్గినట్టైంది. చేనేతల్లో పట్టు పెంచుకునేందుకు ఇప్పటికే వైసీపీ ఓ నాయకుడికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చింది. గంజి చిరంజీవి వైసీపీలో చేరితే మాత్రం లోకేశ్‌కు రానున్న ఎన్నికల్లో సినిమానే అని అంటున్నారు.