ఢిల్లీ పర్యటనలో తనతో ప్రధాని మోదీ ఏం మాట్లాడారో చంద్రబాబు వివరించారు. ఆన్లైన్లో నిర్వహించిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో చంద్రబాబు పర్యటన వివరాలను వెల్లడించారు.
‘రాష్ట్రపతి భవన్లో నేను ఒక పక్కన ఉండి వేరే వాళ్లతో మాట్లాడుతున్నాను. ప్రధాని ఒక్కొక్కర్నీ పలకరిస్తూ నా వద్దకు వచ్చారు. మనం కలిసి చాలా రోజులైంది… ఢిల్లీ రావడం లేదా అని అడిగారు. ఢిల్లీలో నాకు పనేమీ లేదని, రావడం లేదని చెప్పాను. మీతో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. మనం ఒకసారి కలవాలని ఆయన అన్నారు. నేను కూడా సరేనన్నాను’ అని చంద్రబాబు వివరించారు.
ఇప్పటికే ఎల్లో మీడియాలో ఇదే అంశమై పతాక శీర్షికలతో వార్తలు వచ్చాయి. తమ చానళ్లలో డిబేట్లు పెట్టారు. ఇక బీజేపీతో పొత్తు ఖరారైందని, వైసీపీ వెన్నులో వణుకు పుట్టిందనే చర్చకు తెరలేపారు. ఇదిలా వుంటే, చంద్రబాబు తాజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడుకుంటున్నారు.
టీడీపీ, బీజేపీలలో అవివాహితులకు పెళ్లిళ్లు చేసే విషయమై మాట్లాడ్డానికి చంద్రబాబును ఢిల్లీ రావాలని ప్రధాని ఆహ్వానించారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తన దగ్గర అన్ని వయసుల వారికి సంబంధించిన వధూవరుల వివరాలు ఉన్నాయని ప్రధానితో చంద్రబాబు చెప్పారని, అయితే ఒకసారి వారి ఫొటోలు, సమగ్ర వివరాలతో వస్తే చాలా మాట్లాడాల్సిన విషయాలున్నట్టు ప్రధాని అన్నారని విశ్వసనీయ సమాచారం ఉందని నెటిజన్లు వ్యంగ్య పోస్టులు పెడుతున్నారు.
టీడీపీ, బీజేపీ మధ్య పెళ్లి సంబంధాలు కలుపుకుంటే ఎలా వుంటుందో ఆలోచించుకుని రావాలని, వాటి పర్యవసానాలు రాజకీయాలపై ఎలా వుంటుందో చాలా మాట్లాడాల్సి వుందని బాబుతో ప్రధాని అన్నట్టు నెటిజన్లు సృజనాత్మక సెటైర్స్ విసరడం ఆకట్టుకుంటోంది.
జనసేన కూడా ఉందని చంద్రబాబు గుర్తు చేయడంతో ప్రధాని అభినందించారని విశ్వసనీయ సమాచారం అంటూ నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. ఇలా ప్రధానితో బాబు మాటామంతీపై సోషల్ మీడియా తన మార్క్ అభిప్రాయాల్ని వెల్లడిస్తోంది.