బర్త్ డే మంత్రిపై కేసీఆర్ ఆగ్రహం

అసలే లాక్ డౌన్ సమయం, కరోనా విజృంభిస్తున్న వేళ.. ప్రజా ప్రతినిధుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. బైటకు వెళ్తే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటారు, ఇంట్లో ఉంటే ప్రజల కష్టాలు పట్టవా అని…

అసలే లాక్ డౌన్ సమయం, కరోనా విజృంభిస్తున్న వేళ.. ప్రజా ప్రతినిధుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. బైటకు వెళ్తే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటారు, ఇంట్లో ఉంటే ప్రజల కష్టాలు పట్టవా అని ప్రశ్నిస్తారు. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలంతా జనంలో తిరగడానికే ఇష్టపడుతున్నారు. ఇలాంటి టైమ్ లో ఎరక్కపోయి, బర్త్ డే కేక్ కోసి ఇరుక్కుపోయారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

మంత్రి మీద అభిమానంతో ఆ శాఖ సిబ్బంది సర్ ప్రైజ్ పార్టీ ఇచ్చారు. సడన్ గా కేక్ తీసుకొచ్చి కట్ చేయమని టేబుల్ పై పెట్టారు. జనాలకి ఓ మెసేజ్ ఇచ్చే ఉద్దేశంతో కరోనా వైరస్ ని పోలినట్టు కేక్ తయారు చేయించారు, కరోనా మహమ్మారిని మంత్రి చీల్చి చెండాడుతున్నట్టు పెద్ద కత్తిని ఆయన చేతికి అందించారు.

ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎక్కడంతో అసలు రచ్చ మొదలైంది. కరోనా కష్టకాలంలో మంత్రిగారికి పుట్టినరోజు వేడుకలు కావాల్సి వచ్చాయా అంటూ విమర్శలు మొదలయ్యాయి. అసలు కరోనా కాలంలో కేక్ ఎలా తయారు చేశారు, ముందు ఆ బేకరీ సంగతి తేల్చండి అంటూ కొందరు మంచి లాజిక్ పాయింట్ తీశారు. చివరకు ఈ వ్యవహారం కేసీఆర్ దగ్గరకు చేరింది.

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో లాక్ డౌన్ ని మే-7 వరకూ పొడిగించి సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్.. ఈ వార్త విని మంత్రికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాపై అవగాహన కల్పించేందుకే అలాంటి కేక్ కట్ చేశామని, పుట్టినరోజు జరుపుకోవాలని తాను అనుకోలేదని వివరణ ఇచ్చుకున్నారట మంత్రి అజయ్.

మంత్రి వివరణతో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడినా, సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మాత్రం ఆగలేదు. మంత్రి అయినా, సామాన్యులైనా.. కరోనా టైమ్ లో ఏదైనా చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది. 

రోజా స్పెషల్ 'చికెన్ పికిల్

తెలంగాణాలో మే 7 వరకు చాలా కఠినంగా లాక్ డౌన్