లాక్ డౌన్ మినహాయింపులో ముందు నిలుస్తూ ఉంది కేరళ. ఏప్రిల్ 20 అలా వచ్చిందో లేదో.. చాలా రకాలుగా లాక్ డౌన్ ను మినహాయించింది కేరళ సర్కారు. హోటళ్లు, రెస్టారెంట్లను ఓపెన్ చేయించింది ప్రభుత్వం. అలాగే పగలంలా బైక్ రైడింగ్స్ కు కూడా పర్మిషన్ ఇచ్చేసింది. అయితే ఈ పరిణామం పట్ల కేంద్రం అభ్యంతరం చెబుతున్నట్టుగా సమాచారం. లాక్ డౌన్ ను ఏప్రిల్ 20 తర్వాత పాక్షికంగా సడలిస్తామని స్వయంగా ప్రధానమంత్రి ఇది వరకే ప్రకటించారు. అయితే ఆయన చెప్పింది అత్యవసరమైన అంశాల గురించి మాత్రమే. కానీ కేరళ మాత్రం దాదాపుగా లాక్ డౌన్ ను ఎత్తేసినంత పని చేస్తూ ఉంది.
రెస్టారెంట్లను ఓపెన్ చేసుకోవడానికి, జనాలు ఇష్టానుసారం బయట తిరగడానికి అనుమతిని ఇవ్వడం అంటే దాదాపుగా లాక్ డౌన్ ను ఎత్తేస్తున్నట్టే. కేవలం పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను స్టార్ట్ చేయడమే తరువాయి! అన్నట్టుగా ఉంది కేరళ ప్రభుత్వ తీరు.
దేశంలో మొదట కరోనా కేసులను గుర్తించింది కేరళలోనే. అయితే వాటి వ్యాప్తి మాత్రం అంతగా లేదక్కడ. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో మొత్తం కరోనా కేసుల సంఖ్య తక్కువే. అలాగే తమ రాష్ట్రంలో కరోనా సోకిన వారిలో చాలామందికి నయం అయినట్టుగా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అత్యధిక కేసులను డిశ్చార్జి చేసిన రాష్ట్రంగా కేరళ నిలుస్తూ ఉంది. ఈ క్రమంలో లాక్ డౌన్ నుంచి మినహాయింపులకు కూడా విజయన్ ప్రభుత్వం వెనుకాడుతున్నట్టుగా లేదు. అయితే మే 3 వరకూ లాక్ డౌన్ ను పాటించాలన్న కేంద్రం ఆంక్షలకు భిన్నంగా వ్యవహరిస్తున్న వైనం మాత్రం చర్చనీయాంశం అవుతోంది. ఈ అంశంపై కేరళ సర్కారు ఇంకా స్పందించలేదు.