విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, రాజకీయ దిగ్గజం గంటా శ్రీనివాసరావు విషయంలో చంద్రబాబుకు ఆనందం కలిగించే వార్త ఒకటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వినిపించారు. ఓ విధంగా బాబు పుట్టిన రోజు వేళ ఇది గిఫ్ట్ గా కూడా భావించాలేమో.
గంటాను తమ పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోమని విజయసాయిరెడ్డి పక్కా క్లారిటీగా చెప్పేశారు. గంటా ఎన్నికలకు ఒక పార్టీ, ఒక్కో నియోజకవర్గం మారుతూ ఉంటారని, ఆయన్ని జనం ఇపుడు అసలు పట్టించుకోవడం లేదని కూడా హాట్ కామెంట్స్ చేశారు.
ఇక గంటా విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా కరోనా విపత్తు వేళ ఎక్కడా కనబడడంలేదని విమర్శిస్తున్నారు. తమ పార్టీకి చెందిన ఓడిన నాయకుడే ఇపుడు జనాలకు చేరువలో ఉంటూ కష్టాల్లో ఆదుకుంటున్నారని ఆయన అంటున్నారు.
గంటాకు వైసీపీ లో డోర్స్ క్లోజ్ అనేశారు. ఆయన మార్క్ పాలిటిక్స్ తమ పార్టీకి అసలు నప్పదని కూడా కుండబద్దలు కొట్టేశారు. మొత్తం మీద చూసుకుంటే గంటా ఇవాళ కాకపోయినా రేపైనా వైసీపీలో చేరుతారని అటు టీడీపీ, ఇటు వైసీపీలో తరచూ వచ్చే పుకార్లకు విజయసాయిరెడ్ది చెక్ పెట్టేశారనే చెప్పాలి.
విజయసాయి చెప్పారంటే అది జగన్ చెప్పినట్లుగానే చూడాలి. ఎందుకంటే ఆయన జగన్ కి అత్యంత సన్నిహితుడు కాబట్టి. మొత్తానికి గంటా మరో నాలుగేళ్ళ పాటు సైకిల్ దిగరని ఇప్పటికైతే గ్యారంటీ ఇవ్వొచ్చేమో.